హీరోయిన్ ఒక హత్య చూస్తుంది. కెవ్వున అరుస్తుంది. పోలీసులకు చెప్పడానికి పరుగెడుతుంది. హీరో ఒక హత్య చూస్తాడు. కెవ్వున అరవబోయిన.. హీరోయిన్ నోటిని చేత్తో మూసేస్తాడు. అతడి రియాక్షన్ తర్వాతెప్పుడో ఉంటుంది. అమె స్పందన మాత్రం వెంటనే ఉంటుంది. తమిళ పోలీసుల ‘బ్రూటాలిటీ’ పై ఇప్పుడు హీరోయిన్‌లే ముందుగా స్పందించారు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నిక్స్’ అని నినదిస్తున్నారు. స్త్రీలో ఉండే సహజ గుణమే ఇది.. అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించడం.
ప్రియాంక చోప్రా
శాడ్ అండ్ యాంగ్రీ. నేరం ఏదైనా, చనిపోయేంతగా నిందితుల్ని కొట్టడం అమానుషం. ఆ తండ్రీకొడుకుల కుటుంబాల పరిస్థితిని ఊహించలేకపోతున్నాను. మనమంతా వారికి సపోర్ట్‌గా నిలవాలి. వారి తరఫున మాట్లాడాలి.
కరీనా కపూర్
ఇంతటి దుర్మార్గాన్ని సహించకూడదు. కాఠిన్యంపై నోరు తెరవడం మన సామాజిక బాధ్యత. మళ్లీ మళ్లీ ఇలాంటివి జరగకుండా పోరాడాలి. బాధితులకు న్యాయం జరిగేవరకు వారికి మద్దతుగా నిలవాలి.
ఖష్బూ
జయరాజ్ బెనిక్స్‌ల విషయంలో చట్టం తన పని తను చేసుకుపోయి దోషులైన పోలీసులకు శిక్ష విధిస్తుందని మనం ఆశించవచ్చా? వాళ్ల కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్.
కాజల్ అగర్వాల్
నా మనసును మెలిపెట్టింది. సిక్ అయ్యాను. దీనిపై మౌనం వహించకూడదు. అందరం మన నిరసనను వినిపించాలి. ఆ తండ్రీకొడుకుల కుటుంబ సభ్యులకు అండగా ఉండాలి.
తాప్సీ పన్ను
తరచు జరుగుతుండే వాటిలో ఇదొకటి కావచ్చు. కానీ ఈ ఒక్కటీ ఇక ముందు ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు దోహదం అవ్వాలి. వాళ్లెవరో తెలియని వారు కావచ్చు. కానీ వారిపై జరిగిన అమానుషం భీతినిగొల్పింది. నరాలను మెలితిప్పింది.
హన్సిక
వింటేనే భీతిగొల్పుతోంది! పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే అవమానం. దేశానికి కూడా. దోషుల్ని ఉపేక్షించకూడదు. వారిని చట్టం ముందు నిలబెట్టి తీరాలి.
జెనీలియా
నిశ్చేష్టురాలిని అయ్యాను. ఆ ఘటన గురించి విని నా మనసు గాయపడింది. ఇలాంటిది జరగవలసింది కాదు. గుండె పగిలిపోయింది. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి.
రకుల్ ప్రీత్‌సింగ్
గుండె బద్ధలైపోయింది. మనసు చెడిపోయింది. ఈ క్రూరత్వం అమానుషమైనది. కడుపులో తిప్పేసింది. వారి కుటుంబ సభ్యులకు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి.
‘సింగం’ వన్, టు, త్రీ.. సినిమాల డైరెక్టర్ హరి గోపాలకృష్ణన్ ‘డీప్ షాక్’లో ఉన్నారు. పోలీసుల్ని తనెంతో ఉన్నతంగా, గొప్పగా చూపించాడు! కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. తమిళనాడులో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురై మరణించిన ఘటనను డైరెక్టర్ హరి మరచిపోలేకపోతున్నారు. పోలీసులను హీరోలుగా చూపించినందుకు ప్రాయశ్చిత్తంగా ఇక ఆయన సింగమ్ 4ను తీయాలన్న తన ప్రయత్నాలను విరమించుకోవచ్చనే అనిపిస్తోంది. అయితే ‘సింగమ్’ సిరీస్ హీరో సూర్య ఇంతవరకు ఆ తండ్రీకొడుకుల కస్టడీ డెత్‌పై నేరుగా ఏమీ వ్యాఖ్యానించలేదు! బహుశా ఇవాళో, రేపో ఏమైనా ఖండన వంటిదేమైనా ట్వీట్ చేస్తారేమో. వాస్తవానికి ఇప్పటికే ఆయన ఒక ‘పోలీస్ హీరో’గా తన అభిప్రాయాన్ని వెల్లడించవలసింది. ఆయన ఒక్కరనే కాదు, మిగతా స్టార్ హీరోలు కూడా! ఘటన జరిగి నేటికి వారం. చప్పుడు లేదు. ఉండవలసినంత లేదు.
యు.ఎస్.లో గత నెల జార్జి ఫ్లాయిడ్ ఏ విధంగానైతే ఒక పోలీసు చేతిలో చనిపోయాడో.. అదే విధంగా తమిళనాడు, తూత్తుకుడి సమీపంలోని శంతన్‌కుళంలో తండ్రి జయరాజ్ (58), కొడుకు బెన్నిక్స్ పోలీస్ కస్టడీలో చనిపోయారు. లాక్‌డౌన్ పని వేళల ఆంక్షల్ని ఉల్లంఘించి తమ సెల్‌ఫోన్ దుకాణాన్ని నడుపుతున్నారన్న ఆరోపణపై ఈ నెల 19 ఆ తండ్రీకొడుకులను పోలీస్‌లు ఆరెస్ట్ చేసి తీసుకెళ్లారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తీవ్ర రక్తస్రావంతో జూన్ 22 సాయంత్రం కొడుకు, 23 ఉదయం తండ్రి చనిపోయారు. ఏడు రోజులైంది. మానవ హక్కుల సంఘాల వాళ్లింకా పూర్తిగా బయటికి రాలేదు! తమిళ ప్రముఖులెవరూ ఖండనలు ఇవ్వలేదు! హర్హా భోగ్లే, శిఖర్ ధావన్, రితేశ్ దేశ్‌ముఖ్, రాజ్‌దీప్ సర్దేశాయ్, హీరో విశాల్, రాహుల్ గాంధీ, జయం రవి, జీవా.. మరి కొందరు మాత్రం పోలీసుల ‘బ్రూటల్ యాక్ట్’ తమను నిర్ఘాంతపరిచిందని సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని, ఆందోళనను వ్యక్తం చేశారు.
తమిళనాడు సీయం స్పందించి, కేసును సీబీఐకి అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని మద్రాసు హైకోర్టును కోరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. అందరికంటే ముందుగా, ఎక్కువగా బాలీవుడ్ నటీమణులు ఈ ఘటనపై మాట్లాడ్డం, న్యాయం జరగాలని కోరడం, పోలీసుల దౌర్జన్యానికి నిరసన తెలియజేయడం విశేషం. మునుపెన్నడూ ఇంతమంది హీరోయిలు ఇలా బయటికి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు. ‘జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ బెన్నీ’ అంటూ ప్రియాంకా చోప్రా లాజ్ ఏంజెలిస్ నుంచి ట్వీట్ చేశాక.. సింగర్ సుచిత్ర.. పోలీసుల రాక్షసత్వం పై ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఆ తండ్రీ కొడుకులను ఎలా చిత్రహింసలు పెట్టి చంపిందీ తమిళ్‌లో, ఇంగ్లిష్‌లో వివరించారు.
ఇంకా.. హన్సిక, ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్, పరిణీతి చోప్రా, ఈషా రెబ్బా, రమ్యా సుబ్రహ్మణ్యన్, తమన్నా భాటియా, కైరా అద్వానీ, రకుల్ ప్రీత్ సింగ్, జెనీలియా, కాజల్ అగర్వాల్, తాప్సీ, కరీనా కపూర్.. ఆ ఘటన తమను ఎంతగానో నిర్ఘాంత పరిచిందని సోషల్ మీడియాలో వెల్లడించారు. మౌనంగా ఉండటం సేఫ్ అనే భావన సాధారణంగా సెలబ్రిటీలలో ఉంటుంది. ఏమాట అంటే ఎటుపోయి వస్తుందోనన్న భయం కూడా ఉంటుంది. వీళ్లేం చేశారో, వాళ్లకెందుకు అంత కోపం వచ్చిందో అని ఆలోచించేవారూ ఉంటారు. అయితే హీరోయిన్‌లు అలా అనుకోవడం లేదు. నిజమైన హీరోల్లా తమ కోపాన్ని, తమ ఆవేదనను, తమ మనసులోని మాటను ధైర్యంగా బయటికి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment