నాన్నకు వారసులు | Jyoti, Neha life struggle special | Sakshi
Sakshi News home page

నాన్నకు వారసులు

Published Mon, Jan 21 2019 12:05 AM | Last Updated on Mon, Jan 21 2019 4:57 AM

Jyoti, Neha  life struggle special - Sakshi

 షేవింగ్‌ చేస్తున్న నేహ 

దీపక్, రాజు అని  పేర్లు మార్చుకుని,  మగవాళ్లలా  హెయిర్‌ కట్‌ చేసుకుని, ప్యాంటు షర్ట్‌ వేసుకుని జ్యోతి, నేహ చేస్తున్న జీవిత పోరాటం  అసాధారణం  మాత్రమే కాదు..  సాహసవంతమైన  జీవన విన్యాసం కూడా!

అమ్మానాన్న, ఇద్దరమ్మాయిలు. ‘పదిలంగా అల్లుకొన్న పొదరిల్లు మాది’.. అన్నట్లే వాళ్లది ముచ్చటైన కుటుంబం. ఆ ముచ్చట అలాగే కొనసాగితే ఆ ఇద్దరు అమ్మాయిలు అందరు అమ్మాయిల్లాగే ఉండేవాళ్లు.అబ్బాయిలుగా వారే వాళ్లే కాదు. ‘మారడం’ అంటే.. అబ్బాయిలుగా నటించాల్సి రావడం. ఆ నటన కూడా వెండి తెర మీదో, రంగస్థలం మీదో కాదు, నిత్య జీవితంలో! తెర మీద నటిస్తే చప్పట్లు కొడతారు. హర్షిస్తారు. నిజ జీవితంలో నటిస్తే అవేం ఉండవు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్‌ ఉంది. జీవితంలో నటించక తప్పని ఆ ఇద్దరు అమ్మాయిల్ని సమాజం గౌరవించింది. ప్రభుత్వం కూడా వాళ్లను సత్కరించింది. ఆ గౌరవాన్ని, ఆ సత్కారాన్ని అందుకున్న అమ్మాయిలే జ్యోతికుమారి, నేహ.

షాపు తెరిచారు.. వేషం మార్చారు
జ్యోతి కుమారి వయసు 18, నేహకు పదహారేళ్లు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ నగరానికి దగ్గరగా ఉన్న భన్వారీతోలి వాళ్లుండే గ్రామం. వాళ్ల నాన్న ధృవ నారాయణ. సెలూన్‌ నడిపేవాడు. నాలుగేళ్ల కిందటి వరకు ఆయన సెలూన్‌ నడుపుతూనే ఇంటిని పోషించాడు. పిల్లలిద్దరినీ చదివించాడు. 2014లో ఉన్నట్లుండి అనారోగ్యం పాలయ్యాడు. మంచం మీద నుంచి లేచి సెలూన్‌కు రావడానికి కూడా వీల్లేని పరిస్థితి.సెలూన్‌ మూతపడింది. అతడు మంచాన పడటంతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. ఇల్లు జరగాలంటే సెలూన్‌ తెరవాలి. తెరిచినా సెలూన్‌లో పని ఎవరు చేయాలి? ఇంట్లో ఒక్క మగపిల్లాడు కూడా లేడు. ధృవ నారాయణ భార్యకు భర్తను చూసుకోవడంతోనే సరిపోతోంది. పైగా సెలూన్‌ అన్నది ఆడపిల్లలు చేసే పని కాదు. మరి.. ఇల్లు గడవాలంటే, ఆ ఇద్దరే ఏదో ఒక పని చేయాలి. వేరే మార్గం లేదు. బాగా ఆలోచించాక ఓ రోజు.. అక్కాచెల్లెళ్లిద్దరూ వెళ్లి సెలూన్‌ తలుపులు తెరిచి శుభ్రం చేశారు. నాన్న పని చేసేటప్పుడు చూసిన అనుభవం తప్ప స్వయంగా చేసిన అనుభవం లేదు. ‘సవ్యంగా చేస్తారా ఈ ఆడపిల్లలు’ అని సెలూన్‌కి వచ్చే మగవాళ్లకు భయం. ‘‘జాగ్రత్తగా చేస్తాం’’ అని బతిమిలాడి వచ్చిన వాళ్లకు హెయిర్‌కటింగ్‌లు, షేవింగ్‌లు చేశారు. ‘ఫర్వాలేదు, పిల్లలకు పని సులువుగానే పట్టుపడింది’ అనుకున్న పెద్దవాళ్లు భరోసాగా వీళ్ల సెలూన్‌కు రావడం మొదలు పెట్టారు. కొత్త వాళ్లు సెలూన్‌ వరకు వచ్చి అమ్మాయిలను చూసి వెనుదిరిగి వెళుతున్నారు. వెళ్లేవాళ్లు వెళ్లిపోతుంటే, ‘ఈ సెలూన్‌లో అయితే అమ్మాయిలు షేవ్‌ చేస్తార్రా’ అని వచ్చే పోకిరీ కుర్రాళ్లతో వాళ్లకు కష్టాలొచ్చిపడ్డాయి. హెయిర్‌ కటింగ్‌ చేసేటప్పుడు, షేవ్‌ చేసేటప్పుడు ఆకతాయిలు వెకిలి వేషాలు వేసేవాళ్లు. అప్పుడు తీసుకున్నారా అమ్మాయిలు ఓ నిర్ణయం. సెలూన్‌కి వచ్చిన వాళ్ల హెయిర్‌ కట్‌ చేయడం కాదు, ముందు తమ హెయిర్‌ కట్‌ చేసుకోవాలని.  ఒకరికొకరు హెయిర్‌ కట్‌ చేసుకుని, జీన్స్, టీ షర్టులు వేసుకున్నారు. రాజు, దీపక్‌ అని పేర్లు పెట్టుకున్నారు. ఊరికి దూరంగా హైవేకు దగ్గరగా ఉన్న సెలూన్‌ కావడంతో కస్టమర్లలో సొంతూరి వాళ్లకంటే బయటి వాళ్లే ఎక్కువ. అమ్మాయిలే అబ్బాయిలుగా మారారనే వాస్తవం త్వరగానే మరుగున పడిపోయింది. ఊర్లో ఉన్న వంద కుటుంబాల వాళ్లకూ వీళ్లు అబ్బాయిలు కాదు అమ్మాయిలని తెలుసు. ఆ నిజాన్ని పనిగట్టుకుని సెలూన్‌కి వచ్చే వాళ్లకు చెప్పి ఆడపిల్లల పొట్టకొట్టే అనైతికానికి ఎవరూ పాల్పడలేదు.

చదువును కుంటుపడనివ్వలేదు
దీపక్, రాజు (జ్యోతి, నేహ)ల సంపాదన రోజుకు నాలుగు వందలు. ఇంట్లో నలుగురూ కడుపు నిండా తింటున్నారు, ధృవ నారాయణకు మందులకూ డబ్బులు ఉంటున్నాయి. ఇదే మాట చెబుతూ ‘‘ఆడపిల్లలను సెలూన్‌కి పంపించేటప్పుడు మనసు మెలిపెట్టినట్లయింది. ఇప్పుడు నా కూతుళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది. సెలూన్‌ నడుపుతూ మమ్మల్ని పోషించడమే కాదు, వాళ్లు చదువుకుంటున్నారు కూడా’’ అని సంతోషిస్తున్నారు ధృవ నారాయణ.  జ్యోతి డిగ్రీ పూర్తి చేసింది. నేహ ఉదయం కాలేజీకెళ్లి, మధ్యాహ్నం నుంచి సెలూన్‌లో పని చేస్తుంది. ‘‘మగవాళ్లకు హెయిర్‌ కటింగ్, షేవింగ్‌ చేస్తున్నామని, మగవాళ్లలాగ హెయిర్‌ కట్‌ చేసుకుని, షర్టు–ప్యాంటు వేసుకుంటున్నామని మమ్మల్ని వెక్కిరించిన వాళ్లున్నారు. వాళ్లు వెక్కిరించారని పని మానుకునే పరిస్థితి కాదు మాది. అందుకే ఎవరు ఏమన్నా ఈ పనిని కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మేము ఎవరికీ భయçపడటం లేదు. ధైర్యంగా పని చేసుకుపోతున్నాం. మాకు అబ్బాయిల్లా నటించాల్సిన అవసరం కూడా లేదిప్పుడు. మేము అమ్మాయిలం అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అక్క కూడా జుట్టు పెంచుకుంటోందిప్పుడు’’ అంటోంది నేహ. వీళ్లకు ఒక అవార్డు కూడా వచ్చింది! ఆ వివరాలు చెబుతూ ‘‘ఓ రోజు గోరఖ్‌పూర్‌ నుంచి ఓ విలేఖరి ఇటువైపు వచ్చినప్పుడు మా సెలూన్‌కొచ్చారు. మమ్మల్ని చూసి ఆశ్చర్యంగా మా వివరాలడిగారు. మా కథనాన్ని పత్రికలో రాశారు. ఆ క«థనాన్ని చూసిన ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి అభినందించారు.అది మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది’’ అంటోంది జ్యోతి.ఆర్థిక అవసరాలు వెంటాడినప్పుడు మహిళలు ఇంటి అవసరాలను తీర్చడానికి ఎన్నో పనులు చేస్తుంటారు. గ్రామాల్లో పొలం పనులకు పోతుంటారు.ప్రభుత్వాలు కూడా మహిళలకు ఉపాధి అనగానే కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ ట్రైనింగ్‌ అనే అనుకుంటాయి. ఈ అమ్మాయిలు వాళ్ల ఇంటి వృత్తిలోనే ఉపాధి పొందుతున్నారు. తండ్రికి వారసులుగా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కొత్త మార్గాన్ని నిర్మించుకున్నారు. 

చేసింది చిన్న యుద్ధం కాదు
జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను మించిన శత్రువులుండరు. ఆ శత్రువుతో పోరాడాలంటే దృఢమైన సంకల్పబలం ఉండాలి. టీనేజ్‌ దాటని ఈ అమ్మాయిలు చేసిన యుద్ధం చిన్నది కాదు. స్ఫూర్తిదాయకమైన ఈ సిస్టర్స్‌ గురించి సమాజానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది.
 – అభిషేక్‌ పాండే,  అవార్డును అందజేసిన ప్రభుత్వాధికారి 
– మంజీర

అవార్డు అందుకుంటున్న అక్కచెల్లెళ్లు : నేహ (ఎడమ), జ్యోతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement