కల్పనా చావ్లా
మనసులోని హద్దుల్ని చెరిపేసుకుంటే ఈ విశ్వంలోని ప్రేమంతా మన చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది.
కల్పనా చావ్లా రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. ఒకసారి మాత్రమే భూమి మీదకు తిరిగొచ్చారు! (మొదటిసారి 1997 నవంబరులో, రెండోసారి 2003 జనవరిలో) రెండోసారి ఆమె ప్రయాణిస్తున్న వ్యోమనౌక ‘కొలంబియా’ భూమి మీదకు తిరిగి వస్తుండగా ఫిబ్రవరి 1న పేలిపోయి, మిగతావాళ్లతో పాటు కల్పన చనిపోయారు. రెండో ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతుండగా మొదటి ప్రయాణం గురించి కల్పనను ఎవరో అడిగారు. ‘‘స్పేస్‌లోకి వెళ్లొచ్చాక జీవితం పట్ల మీ దృక్పథం మారిందా?’’ అని. ‘‘మారకుండా ఉంటుందా? ఈ అనంత విశ్వంలో మనం ఎంతటివాళ్లమో తెలుసుకున్నపుడు... వేటికోసమైతే నిత్యం మనమిక్కడ గొడవలు పడుతున్నామో అవి ఏమంత ప్రాముఖ్యమైనవి కావని తెలుస్తుంది’’ అన్నారు కల్పన.
‘మీకు ఇన్‌స్పిరిషన్ ఎవరు?’’ అని ఇంకొక ప్రశ్న. ‘‘ఒకరని ఎలా చెప్పడం! పని చేస్తూ కనిపించే ప్రతి ఒక్కరూ నాకు స్ఫూర్తిని ఇస్తారు. డ్యూటీ అవర్స్ దాటి పని చేసేవారు నన్ను మోటివేట్ చేస్తారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తుండేవారు, నిరంతర అన్వేషకులు, గిరిగీసుకుని బతకనివారు, సర్వస్వాన్నీ పనికి ధారపోసేవారు.. వీరంతా నన్ను నడిపించేవారే’’ అని చెప్పారు కల్పన. కల్పన తొలి ప్రయాణంలో టకావ్ డోయి అనే మిషన్ స్పెషలిస్టు కూడా కల్పనతో ఉన్నారు. ‘మీ ఇండియన్స్‌కి నిగ్రహం ఎక్కువ కదా’ అనేవారట డోయి. కల్పన తన అయిష్టాన్ని, ఇబ్బందుల్నీ వ్యక్తం చేసేవారు కాదట. అందుకని ఆయన అలా అడిగేవారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ... నేను ఇండియనా? వ్యోమనౌక పైభాగంలో లైట్లను మసకబరిచి నక్షత్రాలను చూస్తూ కూర్చున్నప్పుడు నేను ఏ ఒక్క భూభాగానికో పౌరురాలిని కాదనిపించేది. నేనొక పాలపుంత పౌరురాలిననిపించేది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కల్పన.
Comments
Please login to add a commentAdd a comment