రాకెట్‌ని నిలబెట్టిన మన అమ్మాయి | Kanika Gakhar Special Story on Spacex Rocket Launch | Sakshi
Sakshi News home page

రాకెట్‌ని నిలబెట్టిన అమ్మాయి మన ఇండియన్‌

Published Tue, Jun 2 2020 8:51 AM | Last Updated on Tue, Jun 2 2020 12:44 PM

Kanika Gakhar Special Story on Spacex Rocket Launch - Sakshi

భూమి నుంచి 408 కి.మీ. ఎత్తులో ఆకాశంలో అంతరిక్ష కేంద్రం ఉంది. అది ఆమెరికా వాళ్లది. రష్యా వాళ్లది. జపాన్‌ వాళ్లది, ఐరోపా వాళ్లది. కెనడా వాళ్లది. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు నిరంతరం పైన ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో ఏడుగురు అంతరిక్ష పరిశోధకులు ఉన్నారు.. నాసా నుంచి ఈ ఆదివారం వెళ్లిన డో హర్లీ, బాబ్‌ బెన్కెన్‌ లను కూడా కలుపుకుని. అయితే ఆ ఇద్దరిని ‘నాసా’ గానీ, మిగతా నాలుగు అంతరిక్ష సంస్థలు గానీ పైకి పంపలేదు. ‘స్పేస్‌ ఎక్స్‌’ అనే ఒక అమెరికన్‌ ప్రైవేటు సంస్థ పంపింది! అంతరిక్షయాన చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ ఇలా రోదసీలోకి మనుషుల్ని పంపడం ఇదే మొదటిసారి. వాళ్లను ‘క్రూ డ్రాగన్‌’ అనే వ్యోమనౌకలో పైన వదిలిపెట్టిన ‘ఫాల్కన్‌ 9’ రాకెట్‌ వెంటనే భూమి మీదికి తిరిగి వచ్చేసింది కూడా! టు అండ్‌ ఫ్రో.. రాకెట్‌ ప్రయాణం సక్సెస్‌. ఆ సక్సెస్‌లో కణిక అనే 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని వాటా కూడా ఉంది! కణిక లక్నో అమ్మాయి. ప్రస్తుతం బోస్టన్‌లోని ఎం.ఐ.టి.లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది.  2018లో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థినిగా ఉన్నప్పుడు ‘స్పేస్‌ ఎక్స్‌’ లో ఇంటెర్న్‌గా పని చేసింది. భూమిపై నుంచి లేచేందుకు, తిరిగి భూమి మీద దిగేందుకు ఫాల్కన్‌ 9కు బలమైన కుదురు కాళ్లను (ల్యాండింగ్‌ లెగ్స్‌) డిజైన్‌ చేసిన ఆనాటì  స్పేస్‌ ఎక్స్‌ బృందంలోని ఎనిమిది మందిలో కణికా గఖర్‌ కీలక సభ్యురాలు!(చరిత్ర సృష్టించిన స్పేస్‌ ఎక్స్‌)

లక్నోలోని ఇందిరానగర్‌లో 86 ఏళ్ల వయసున్న కణిక బామ్మగారు రాజకుమారి ఇప్పుడు కణిక ఇండియా రాక కోసం చూస్తున్నారు. ‘ఆ రాకెట్‌ను డిజైన్‌ చేసింది నా మనుమరాలే’ అని ఇప్పటికే ఆ బామ్మ గారు తన ఆనందాన్ని తెలిసిన వారందరితోనూ పంచుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు. ‘స్పేస్‌ ఎక్స్‌’ తక్కువ సంస్థేమీ కాదు. ‘నాసా’కు యంగర్‌ వెర్షన్‌. అందులోనే మూడు నెలలు ఇంటెర్న్‌గా చేశారు కణిక. ఫాల్కన్‌ 9  ల్యాండింగ్‌ లెగ్స్‌ డిజైనింగ్‌లో ప్రధానమైన బాధ్యతలు ఆమెకే అప్పగించారు. మూడుసార్లు దరఖాస్తు చేసి, మూడుసార్లు ఇంటర్వ్యూకు వెళితేగానీ సాధించలేకపోయిన ఇంటెర్న్‌షిప్‌ అది. అందుకే పెద్ద బాధ్యత అని భయపడలేదు కణిక. టీమ్‌లో సీనియర్స్‌ ఉన్నారన్న తడబాటు లేకుండా టీమ్‌ని నడిపించారు. ఇంటెర్న్‌గా ఉన్నప్పుడు ‘స్పేస్‌ ఎక్స్‌’ యజమాని ఎలాన్‌ మస్క్‌తో, ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు డో హర్లీ, బాబ్‌ బెన్కెన్‌తో కూడా ఫాల్కన్‌ 9 డిజైనింగ్‌లోని మార్పు చేర్పుల గురించి తరచు మాట్లాడేవారు కణిక. ‘‘వాళ్లిచ్చే మోటివేషన్‌ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో చెప్పలేను’’ అని ఎం.ఐ.టి.లోని సహ విద్యార్థులతో అంటుంటారు కణిక. ఈ ఏడాది ఆగస్టులో ఆమె చదువు అయిపోతుంది. వెంటనే ఉద్యోగం. ఎక్కడో కాదు. తనకెంతో నచ్చిన ‘స్పేస్‌ఎక్స్‌’లోనే!

పిల్లలందరికీ ఎగరాలనే ఆశ ఉంటుంది. కణిక కూడా ఐదేళ్లకే ఆకాశం వైపు చెయ్యి చూపించింది. ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని ప్రతి తల్లీ తండ్రి అడిగినట్లే నాన్న సందీప్, అమ్మ సిమీ అడిగినప్పుడు ‘రాకెట్‌లో రయ్‌న ఎగిరిపోతా’ అంది కణిక. అదిప్పుడు ఇంకోలా నెరవేరింది. రాకెట్‌ను రయ్‌న ఎగరనిస్తోంది! కణిMý, కణిక అక్క (ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో డాక్టర్‌) యు.ఎస్‌. చదువుల కోసం తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హ్యూస్టన్‌ వచ్చేశారు. పదవ తరగతి వరకు బెంగళూరులోనే చదివారు కణిక. తర్వాత సింగపూర్‌లో ఐ.బి.స్కూల్‌లో చేరారు. టెక్సాస్‌లోని ఎ అండ్‌ ఎం యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. కణిక బామ్మగారు పెద్దగా చదువుకోలేదు. అయితే చదువు ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో మనవరాలు ఎప్పటికప్పుడు తనకు పంపే వీడియోలలో చూస్తుంటారు. ‘‘ఆ చిన్న పిల్ల ఇంత పెద్దదయిందా..’ అని.. ఆకాశంలో ఎప్పుడైనా కనిపించే పెద్ద నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయే చిన్నపిల్లలా.. బుగ్గలు నొక్కుకుంటుంటారు బామ్మగారు. ఇప్పుడా పెద్ద నక్షత్రం బుగ్గలు పుణకడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

స్పేస్‌ ఎక్స్‌.. ఎలాన్‌ మస్క్‌

‘స్పేస్‌ ఎక్స్‌’ అనేది అమెరికాలోని ప్రఖ్యాత ప్రైవేటు అంతరిక్షయాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ. కాలిఫోర్నియాలోని హాథోర్న్‌లో ఉంది. ఆ సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌. ఏరోస్పేస్‌ టెక్నాలజీ అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది. స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌకల్ని తయారు చేస్తుంది. అంతరిక్షయానానికి ఏర్పాట్లు చేస్తుంది. అంగారకుడిలో మానవుల కోసం ఒక కాలనీ నిర్మించేందుకు, అక్కడికి భూగోళం నుంచి మనుషుల్ని తీసుకెళ్లేందుకు ఏళ్లుగా స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగాలు చేస్తోంది. ‘నాసా’ వంటి సంస్థే తన వ్యోమగాముల్ని రోదసీలోకి పంపేందుకు స్పేస్‌ ఎక్స్‌ సహకారం తీసుకుందంటే ఎలాన్‌ మస్క్‌ ఏ స్థాయి అంతరిక్ష పారిశ్రామికవేత్తో స్పష్టం అవుతోంది. 48 ఏళ్ల ఎలాన్‌ మస్క్‌ పద్దెనిమిదేళ్ల క్రితం ‘స్పేస్‌ ఎక్స్‌’ను స్థాపించారు. అంటే తన ముప్పై ఏళ్ల వయసులో! అతడికి మూడు దేశాల పౌరసత్వం ఉంది. (దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా). టెస్లా కార్ల తయారీ కంపెనీ అతడిదే. ఇంకా రాబడినిచ్చే అనేక వాణిజ్య సంస్థలు, వ్యాపకాలు ఉన్నాయి. ఆరుగురు పిల్లలు. మొదటి భార్య రచయిత్రి. రెండో భార్య బ్రిటిష్‌ నటి. ఇద్దరికీ విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రైమ్స్‌ అనే కెనడా గాయనితో కలిసి ఉంటున్నాడు. గ్రైమ్స్‌కి మే 4న మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు అంకెలు, ఆల్ఫాబెట్స్‌ కలిపి ‘ఎక్స్‌ యాష్‌ ఎ ట్వెల్‌’ అని ఎలాన్‌ పేరు పెట్టుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement