దీపం వెలిగించాడు!
సొంత విజయంతోనే సంతృప్తి పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్.
కార్తికేయన్ విజయకుమార్ చెన్నైలో స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో సీనియర్లు బిట్స్ పిలాని గురించి గొప్పగా మాట్లాడుతుండేవారు. అక్కడ చదవాలనే కోరిక అలా మొదటిసారిగా కలిగింది. కేవలం కల కనడానికే పరిమితం కాకుండా దాన్ని నిజం చేసుకున్నాడు కార్తికేయన్. అక్కడ తనకొక విశాల ప్రపంచం పరిచయం అయింది. సీనియర్లు ఎందరో తనకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పేవాళ్లు. ‘‘భవిష్యత్‌లో నేను విజయవంతమైన వ్యాపారిని కావాలి’’ అనుకోవడానికి ఈ మాటలు తోడ్పడ్డాయి.
చదువు పూర్తయిన తరువాత తన మిత్రుడితో కలిసి అరవైవేల రూపాయలతో ‘ఎక్సెడోస్’ పేరుతో బిజినెస్ కన్సల్టింగ్ సంస్థను ప్రారంభించాడు. సంవత్సర కాలంలోనే లాభాలు చేతికందాయి. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఆఫీసు ఉండేది కాదు. రెండు ల్యాప్‌టాప్‌లతో తమ గది నుంచే వ్యాపారాన్ని కొనసాగించేవారు. సంవత్సరం తరువాత మాత్రం వివిధ ప్రాజెక్ట్‌లలో తమ దగ్గర వందమంది ఉద్యోగులు పనిచేశారు.
తన విజయంతోనే సంతృప్తిని పడకుండా... పేద విద్యార్థులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ‘దీపం’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించి సేవారంగంలోకి అడుగుపెట్టాడు కార్తికేయన్. ‘‘కొందరికి ప్రతిభ ఉన్నా సౌకర్యాలు ఉండవు. వాటిని అందేలా చేస్తే గొప్ప విజయాలు సాధించగలరు’’ అంటాడు కార్తికేయన్.
పేద విద్యార్థులకు కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్‌లలో తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. తన తీరిక సమాయాన్ని వినోదానికో, విహారానికో వెచ్చించకుండా పేద విద్యార్థులతో గడపడానికి వెచ్చించేవాడు. ‘దీపం’కు సంబంధించి మరెన్నో కార్యక్రమాల రూపకల్పనలో తలమునకలై ఉన్నాడు ముప్పైరెండు సంవత్సరాల కార్తికేయన్ విజయకుమార్.