వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు! | Kathua victim's lawyer wins Mother Teresa Award-2018 | Sakshi
Sakshi News home page

ఏదో ఒకరోజు.. వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు!

Published Mon, Nov 5 2018 12:29 AM | Last Updated on Mon, Nov 5 2018 4:53 PM

Kathua victim's lawyer wins Mother Teresa Award-2018 - Sakshi

న్యాయం కోసం పోరాటం దీపికా రజావత్‌

నువ్వొక జాతి వ్యతిరేక శక్తివి. నీ ఆరేళ్ల కూతురికి, నీకు అదే గతి పడుతుంది. ఛీ.. అసలు వీళ్లతో మనకు మాటలేంటి? నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాం.. 
– ఇవి అత్యాచార ఘటనలో బాధితురాలి తరపున వాదిస్తున్నందుకు ఓ మహిళా న్యాయవాదికి వస్తున్న బెదిరింపులు, ఈసడింపులు.

నల్లకోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ న్యాయవాది అనిపించుకోరు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టేవారే నిజమైన న్యాయవాదులు. ఇందుకు  ఉదాహరణ దీపికా రజావత్‌. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్నారు ఆమె.

అడుగడుగునా అవరోధాలే
ఈ కేసులో బాధితురాలి తరపున వాదిస్తానని చెప్పగానే దీపికకు బెదిరింపుల పర్వం మొదలైంది. సంప్రదాయ కశ్మీరీ పండిట్‌ కుటుంబంలో జన్మించిన దీపికా.. ఓ గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలిక తరపున వాదించడమేమిటని కొంతమంది అసహ్యించుకుంటే... మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి దీపికను, ఆమె కూతురిని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రాణంగా ప్రేమించే దీపికా ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు.

చంపేస్తారు.. నాకు తెలుసు
‘‘ప్రతీరోజూ ఇంటికి చేరుకోగానే మెయిన్‌ గేటు నుంచి ఇంట్లో వరకు గల పరిసరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటాను. నా కూతురు, భర్త గురించి ఏ క్షణాన.. ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతాను. కథువా ఘటన జరిగి 10 నెలలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతోంది. నా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేసింది. అయితే ఒకటి మాత్రం నిజం.. వాళ్లు ఏదో ఒకరోజు కచ్చితంగా నన్ను చంపేస్తారు. నాకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. సరైన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయినా పర్లేదు. ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు’  అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు దీపికా.  

‘‘అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయేముందు ఎంత నరకయాతన అనుభవించిందో ఓ మహిళగా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మానవ హక్కుల కార్యకర్తగా, ఓ న్యాయవాదిగా బాధితుల తరపున పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ కేసు వాదించేందుకు నాకు నేనుగా ముందుకు వచ్చాను. ఈ కారణంగా నా తల్లిదండ్రులు కూడా చాలా వేధింపులు ఎదుర్కొన్నారు.

నన్నో జాతి వ్యతిరేక శక్తిగా నాపై ముద్ర వేసినపుడు వారి బాధ వర్ణనాతీతం. నా తోటి న్యాయవాదులు కూడా నా పట్ల ఇదే భావన కలిగి ఉండటం నన్ను మరింతగా బాధిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే వారిలో కాస్త మార్పు కన్పిస్తోంది. కానీ అది నిజమైనదో కాదో పోల్చుకోలేకపోతున్నాను’’ అంటూ ‘వోగ్‌ క్రూసేడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’–2018’గా ఎంపికైన సందర్భంగా దీపికా రజావత్‌ తన అనుభవాలను పంచుకున్నారు.
 

కథువా ఘటన
కశ్మీర్‌లోని కథువా సమీపంలో గల రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికకు డ్రగ్స్‌ ఇచ్చి, ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను అంతమొందించారు కొందరు. బాకర్‌వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన ఆ చిన్నారి శవం ఈ ఏడాది జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది.

ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, తమ ఫిర్యాదు స్వీకరించి ఉంటే కూతురిని పోగొట్టుకునేవాళ్లం కాదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించడంతో చలించిన కశ్మీర్‌ ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 21వ తేదీన దీపు భయ్యాగా  పిలిచే 15 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు.

హీరానగర్‌ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానే పాపమూ చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. పంజాబ్‌లోని పఠాన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది.

– సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement