
అక్కచెల్లెళ్లు: కేశిని, మీనాక్షి, ఊర్వశి
దేశంలో అనేక చోట్ల సరస్వతీ నిలయాలు ఉన్నాయి. అయితే హర్యానాలోని ఒక ‘సరస్వతీ నిలయం’ వాటికి భిన్నమైనది. ఆ నిలయం నుంచి ఆదివారం నాడు హర్యానా ప్రభుత్వం మరొక మహిళను తన కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించుకుంది. ఆ మహిళ పేరు కేశిని ఆనంద్ ఆరోరా. అంతకుముందు అదే ఇంటినుంచి మీనాక్షీ ఆనంద్ చౌదరి (2005–06), ఊర్వశీ గులాటి (2009–12) ఆ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శులు అయ్యారు. ఈ ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. పెద్దమ్మాయి మీనాక్షి, రెండో అమ్మాయి ఊర్వశి. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయిన కేశిని మూడో అమ్మాయి. ఆ ఇంటిలో అంతా చక్కగా చదువుకుని, ముఖ్యంగా ఆ ఇంట్లోని అమ్మాయిలు ముగ్గురూ సరస్వతీ పుత్రికలై ఉన్నత పదవిని అలంకరించారు కనుకనే ఆ ఇంటిని సరస్వతీ నిలయం అనడం.
కేశిని ఆనంద్ అరోరా 1983 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి. నాలుగేళ్లుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి.ఎస్.దేశి పదవీ విరమణతో ఆయన స్థానంలోకి వచ్చారు కేశిని. హర్యానాలో ఇప్పటి వరకు నలుగురు మహిళలు ఈ హోదాలో పని చేశారు. ఊర్వశి తర్వాత (వెనువెంటనే కాదు) ప్రమీలా ఇస్సార్ అనే మహిళ కొంతకాలం ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన కేశిని.. హర్యానాలో సీనియర్ మోస్ట్ ఐఏఎస్. మరో పద్నాలుగు నెలలు మాత్రమే సర్వీస్ మిగిలి ఉన్న కేశిని.. సాధారణ పరిపాలన, సిబ్బంది వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శిక్షణ, పాలనా సంస్కరణ శాఖలను చూస్తారు.
కేశినీ ఆనంద్ గురించి మరికొంత
- హర్యానా ప్రభుత్వ తొలి మహిళా డిప్యూటీ కమిషనర్
- ఆస్ట్రేలియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ సిడ్నీ’ నుంచి ఎంబీఏ డిగ్రీ
- వయోజన విద్యావ్యాప్తికి కృషి
- మండల్ కమిషన్ అల్లర్లు, అలజడుల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ
- ఉడాయ్ (ఆధార్) ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్
- ఆన్‌లైన్‌లో టీచర్‌ల బదలీ విధానానికి రూపకర్త
- నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరు
Comments
Please login to add a commentAdd a comment