
క్వార్టర్ ఫైనల్లో హరియాణా
మహిళల అండర్–23 వన్డే ట్రోఫీ
గువాహటి: డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ జాతీయ టోర్నీలో బంతితో మెరిసింది. మహిళల అండర్–23 వన్డే ట్రోఫీలో ‘హ్యాట్రిక్’ వికెట్లతో అదరగొట్టింది. దీంతో హరియాణా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హరియాణా జట్టు 6 వికెట్ల తేడాతో కర్ణాటకపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 49.3 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఇన్నింగ్స్ 44వ ఓవర్ వేసిన షఫాలీ వర్మ (3/20) ఐదో బంతికి సలోని (50 బంతుల్లో 30; 4 ఫోర్లు), ఆరో బంతికి సౌమ్య వర్మ (0)లను అవుట్ చేసింది. మళ్లీ 46వ ఓవర్ వేసిన ఆమె తొలి బంతికే నమిత డిసౌజా (1)ను బౌల్డ్ చేయడంతో ‘హ్యాట్రిక్’ పూర్తయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 42 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనింగ్ చేసిన షఫాలీ (18) తక్కువ స్కోరుకే పరిమితం కాగా, సోనియా (79 బంతుల్లో 66; 8 ఫోర్లు), తనీషా (77 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. ఇటీవలే ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో షఫాలీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున విశేషంగా రాణించింది. అయితే ఫైనల్లో ఢిల్లీ మళ్లీ ఓడి వరుసగా మూడోసారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్ రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను సాధించింది.
ఈ సీజన్ లీగ్ టాప్ స్కోరర్లలో ఆమె 304 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈమె కంటే ముందు వరుసలో నాట్ సివర్ (523), ఎలీస్ పెరి (372), హేలీ మాథ్యూస్ (307) ఉన్నారు. భారత బ్యాటర్లలో షఫాలీనే టాప్ స్కోరర్! గతేడాది టి20 ప్రపంచకప్ అనంతరం జట్టులో స్థానం కోల్పోయిన ఆమె తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేందుకు పట్టుదలగా రాణిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment