పెయిన్‌కిల్లర్స్‌తో కిడ్నీకి ప్రమాదమా?
నా వయసు 62 ఏళ్లు. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాను. తట్టుకోలేక చాలాకాలం నుంచి నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) వాడుతున్నాను. దీనివల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – కృష్ణారావు, విజయవాడ
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడినట్లయితే కిడ్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నేరుగా మెడికల్ షాప్ నుంచి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వాడడం మంచిది కాదు. కొన్ని పెయిన్ కిల్లర్స్‌లో రెండు లేదా మూడు రకాల మందులు కలిపి ఉంటాయి.
ఇవి కిడ్నీకి చాలా హాని చేస్తాయి. పెయిన్ కిల్లర్స్ కాకుండా ఫిజియోథెరపీ వంటి ఇతర పద్ధతులతో నొప్పి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. రోజూ నీళ్లు ఎక్కువగా తాగండి. మీ భుజం నొప్పి తగ్గడం కోసం ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. మీ అంతట మీరే మందులు వాడకండి.
బీపీ చాలా ఎక్కువగా ఉంది... కిడ్నీ సమస్య వస్తుందా?
నా వయసు 32 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? – నవీన్‌కుమార్, మహబూబాబాద్
ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి.
ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు చాలా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి.
ఇంట్లోనూ డయాలసిస్ చేసుకోవచ్చు...
నా వయసు 68 ఏళ్లు. షుగర్‌వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. మూడు సార్లు ఫిస్టులా ఆపరేషన్ అయ్యింది. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. డయాలసిస్ కాకుండా ఇంకేమైనా పద్ధతులున్నాయా? – శ్యాంప్రసాద్, హైదరాబాద్
ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్–సీఏపీడీ) చేయించుకోవడం మేలు.
సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఇలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్‌కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ. కాబట్టి ఒకసారి మీ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించి ఈ వివరాలు తెలుసుకోండి.
- డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment