పాదుషా గారు తన తలపై నుంచి కిరీటాన్ని ఒక్క క్షణం పాటు కూడా తొలగించే వారు కాదు. మంత్రులు, సన్నిహితులు పాదుషా గారిని కాసేపు కిరీటం తీసి ఉపశమనం పొందండి అని చెప్పినా ససేమిరా అనేవారు. ఒకరోజు పాదుషా గారికి అత్యంత సన్నిహితుడైన మంత్రి ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు పాదుషాగారిని గుచ్చిగుచ్చి అడగడం మొదలెట్టాడు. పాదుషా గారు ఎంతగా దాటవేయాలనుకున్నా కుదరలేదు. చివరికి ఒక షరతుతో తన రహస్యాన్ని చెప్పారు. ‘‘నా తలపై ఒక కొమ్ము మొలిచింది అందుకే నేను ఎప్పుడూ కిరీటం తీయడానికి ఇష్టపడను’’ అని చెప్పారు. ఈ సంగతి మూడో మనిషికి చెప్పకూడదనే షరతుతో మంత్రిగారి ముందు బట్టబయలు చేశారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే రాజ్యమంతా ఈ విషయం దావానలంలా పాకింది. అది తెలిసి పాదుషా గారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే ఫలానా మంత్రిని హాజరుపరచాలని హుకుం జారీచేశారు. తన షరతును ఉల్లంఘించినందుకు శిక్షించేందుకు పాదుషాగారు ఒరలోనుంచి కత్తిని తీసి మంత్రిపై ఒక్క వేటు వేయబోయారు. అంతలోనే మంత్రి ఆ కత్తిని అడ్డుకుని ‘‘మీరు పాదుషా అయి ఉండి కూడా మీ వ్యక్తిగత రహస్యాన్ని గుట్టుగా ఉంచలేకపోయారు. మరి మేమెలా ఈ రహస్యాన్ని గుట్టుగా ఉంచగలుగుతామనుకున్నారు? నన్నెలా శిక్షించదలిచారో మీకూ అంతే శిక్ష పడాలి.’’ అని అన్నాడు. పాదుషాగారు ఆలోచనలో పడ్డారు. మాట, విల్లునుంచి వదిలిన బాణం తిరిగి రాలేవు. అంతరంగంలో ఉన్నంతవరకూ మాటలు మన బానిసలవుతాయి. అవి బయటికి రాగానే వాటికి మనం బానిసలవ్వాల్సి ఉంటుందన్నది ఇందులోని నీతి.
– ముహమ్మద్ ముజాహిద్
మాటకు బానిస
Published Fri, Nov 2 2018 12:12 AM | Last Updated on Fri, Nov 2 2018 12:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment