నేర్చుకుంటూ....నేర్పుతూ!
చైనా రాజధాని బీజింగ్‌లో సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ యూనివర్శిటీ ఆఫ్ చైనాలకు చెందిన అధ్యాపకులతో పాటు వివిధ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలకు చెందిన అధ్యాపకులు చేసిన ‘షో’కు అద్భుతమైన స్పందన లభించింది. ‘789 ఆర్ట్ జోన్’లో జరిగిన ఈ ప్రదర్శనలో నలభై చిత్రాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. అవన్నీ ఇంక్ పెయింటింగ్‌లే.
‘‘పెయింటర్, టీచర్‌గా...వారికి రెండు బాధ్యతలు ఉన్నాయి. ఒకవైపు టీచర్‌గా చైనీస్ ఇంక్ పెయింటింగ్‌కు సంబంధించిన జ్ఞానాన్ని శిష్యులకు అందచేయడం. మరోవైపు పెయింటర్‌గా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరికొత్త ప్రయోగాలు చేయడం. ఈ రెండు బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు’’ అన్నారు ఎగ్జిబిషన్ క్యూరేటర్ హంగ్.
‘‘క్లాసురూమ్‌లో నిర్దిష్టమైన అంశాలను బోధించడం తప్ప ప్రయోగాలకు అవకాశం తక్కువ. పెయింటర్‌గా మాత్రం భిన్నమైన ప్రయోగాలు చేయవచ్చు. మేము వేసిన చిత్రాలను గురించి స్టూడెంట్స్‌కు వివరంగా చెప్పవచ్చు’’ అన్నారు సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌కు చెందిన ఒక టీచర్.
అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ యూనివర్శిటీ ఆఫ్ చైనాకు చెందిన మరో టీచర్ ఇలా అన్నారు:
‘‘నేను గీసిన చిత్రాలను చూసి నా శిష్యులు ఎంతో ఇన్‌స్పైర్ అయ్యారు. తాము కూడా ప్రయోగాత్మకంగా చిత్రాలు గీయడానికి పూనుకున్నారు. ఇంతకంటే ఆనందం ఏముంటుంది?!’’
‘‘బోధన అనేది యాంత్రికంగా మారిపోకుండా... ఇలాంటి ప్రయత్నాలు తోడ్పడతాయి. అధ్యాపకులు గీసిన చిత్రాలు వారి రోజువారి బోధనకు సృజనాత్మకతను జోడిస్తాయి’’ అన్నారు ఒక కళావిమర్శకుడు.
‘కళలో ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అంటారు పెద్దలు. ఒక వైపు శిష్యులకు నేర్పుతూ, మరోవైపు స్వయంసాధన ద్వారా సరికొత్త జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సొంతం చేసుకుంటున్నారు చైనాలోని ఫైన్ ఆర్ట్స్ అధ్యాపకులు.