
చాలామంది అరుదైన పూల మొక్కలను పెరటితోటల్లో పెంచడానికి ఆసక్తి చూపుతుంటారు. తోటపని మీద అభిరుచి ఉన్నవారు కొత్త కొత్త మొక్కలను సేకరించి, పెరటితోటల్లో పెంచుతుంటారు. పెరటితోటల్లో అలా పెంచే మొక్కలు స్థానిక జాతులకు చెందినవైతే ఫర్వాలేదు గాని, ఎక్కడివో విదేశీ మొక్కలను తెచ్చి పెంచితే మాత్రం తేనెటీగల మనుగడకే అవి ముప్పుగా పరిణమించగలవని బ్రిటిష్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
స్థానిక వాతావరణంలో సహజంగా పెరిగే మొక్కల నుంచి సేకరించే తేనెకు తేనెటీగలు తరతరాలుగా అలవాటు పడి ఉంటాయని, విదేశీ మొక్కల నుంచి సేకరించే తేనె వాటి జీర్ణప్రక్రియకు సమస్యలు తెచ్చి పెడుతుందని ‘గ్రీన్‌పీస్’ సంస్థ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధన జరిపిన బృందానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఫిలిప్ డాంకెర్‌స్లీ చెబుతున్నారు. బ్రిటన్‌లో కొందరు తమ తోటల్లో దక్షిణ అమెరికా, ఆసియా దేశాలకు చెందిన పూల మొక్కలను పెంచుతూ ఉంటారని, అలాంటి పూలతోటలు ఉన్నచోట జరిపిన పరిశోధనల్లో వాటి పరిసరాల్లోని తేనెటీగలు జీర్ణాశయ సమస్యలతో అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.