
తేనెటీగలు నానాటికీ తగ్గుతుండటంపై ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తేనెటీగలు అంతరించిపోతే, భూమ్మీద మానవులు కూడా అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా వారు హెచ్చరికలు చేస్తున్నారు. పట్టణీకరణ పెరుగుతుండటంతో అడవులు, అడవుల్లో ఉండే తేనెనిచ్చే పూలమొక్కలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా తేనెటీగల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
తేనెటీగలను కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే డచ్ డిజైనర్ మటిల్డా బోయల్‌హోవర్ తేనెటీగల మనుగడ కోసం కృత్రిమ పూలను తయారు చేశారు. జనావాసాలతో కిక్కిరిసి ఉండే నగరాల్లో ఈ పూలను ఇళ్లల్లోని పూలకుండీల్లో అమర్చుకోవడానికి వీలుగా రూపొందించారు.
ఈ పూలు వాననీటిని చక్కెరతో కూడిన ద్రవంగా మార్చగలవు. తియ్యగా ఉండే ఈ ద్రవం సహజమైన తేనె మాదిరిగానే తేనెటీగలను ఆకట్టుకోగలదు. తేనెటీగలతో పాటు ఈ పూలు వృక్షజాతుల్లో పరపరాగ సంపర్కానికి దోహదపడే సీతాకోక చిలుకలు, తుమ్మెదలు, కందిరీగలు వంటి కీటకాలను కూడా ఆకర్షించగలవని డిజైనర్ మటిల్డా చెబుతున్నారు.
(చదవండి: తేనెటీగల కోసం కృత్రిమపూలు)