ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం... శివరాత్రి
కాలగమనంలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఎలా ఉన్నాయో, పూర్తి చీకటి– అమావాస్య వైపుకు తిరిగిన కాలంలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మ సంయమనం అనే మార్గాల ద్వారా ఈశ్వర తత్వానికి దగ్గరగా వెళ్లగలిగే సోపానాలే, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇవి మాసానికి ఒకమారు, సంవత్సరానికి ఒకమారు మనకు లభిస్తాయి. ఇది ఈశ్వరుడు మనకోసం ఎంచుకున్న కాలం.
అందుచేతనే ఆ రాత్రి ఆటవికుడు ఒకడు బిల్వవృక్షం మీద కూర్చొని క్రూరమృగం నోటికి దొరక కుండా, రాత్రంతా ఒక్కో దళం తుంచుతూ, తెలియకుండానే కింద ఉన్న శివలింగం మీద పడేస్తూ జాగారం ఉండడం చేత అనుకోకుండానే సాధన పూర్తి చేసి మోక్షం పొంది తరించాడని మనకు మహా శివరాత్రి కథ చెబుతోంది. ఉపవాసం, జాగరణ అనేవి ఇంద్రియ నిగ్రహం, సమత్వం ద్వారా మనలోని చీకటిని తొలగించుకుని ఈశ్వర తత్వాన్ని తెలుసుకునేందుకు మనకు ఇచ్చిన సాధనాలు. అలా అని నీరసంతో ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉపవాసాలు చేసి మరింత అనారోగ్యాన్ని తెచ్చుకోమని కాదు. అదేవిధంగా నాలుగు చలన చిత్రాల సందర్శనం చేసి మర్నాడు రోజంతా నిద్ర పొమ్మని కూడా కానే కాదు.
మహాశివరాత్రి రోజున జరిగే రుద్రాధ్యాయ పారాయణ నమక చమకంతో జరిపే అభిషేకాలు ఎంతో లాభదాయకాలు. సమస్త పాపక్షయానికి, అనావృష్టి నివారణకు, గోరక్షకు, అకాల మృత్యువు దోష నివారణకు, అభయానికి, నాయకత్వం పొందటానికి, వ్యాధి నివారణకు, సంతాన ప్రాప్తికి, కుటుంబ సంక్షేమం, తదితరాలకు మొదటి అనువాకం, ధనప్రాప్తికి, శత్రుక్షయానికి, విజ్ఞతప్రాప్తికి రెండవ అనువాకం, ఆరోగ్యానికి మూడవ అనువాకం, క్షయవ్యాధి నివారణకు, సంపూర్ణ ఆరోగ్యానికి నాల్గవ అనువాకం, మోక్షప్రాప్తికి అయిదవ అనువాకం, శివునితో సమానమైన పుత్రప్రాప్తికి అయిదు, ఆరు అనువాకాలు, ఆయువుకు ఏడవ అనువాకం, రాజ్యప్రాప్తికి ఎనిమిదవ అనువాకం, ధనకనక వస్తువాహనాలు, వివాహం జరగడానికి తొమ్మిదవ అనువాకం, సమస్త భయ నాశనానికి పదవ అనువాకం, తీర్థయాత్రలకు, జ్ఞానార్జనకు పదకొండవ అనువాకం, ఇలా సకల కార్యసిద్ధికోసం మహాశివరాత్రి అనువాకాలను ఉచ్చరిస్తూ అభిషేకం చేయడం ఆచారం. దీని తర్వాత శివునితో మమేకమవుతూ చమకంతో అభిషేకం జరుపుతారు.
ఆత్మసాక్షాత్కారానికి తొలిమెట్టు ఇంద్రియ నిగ్రహం. శాస్త్రాలు నిర్దేశించిన సమయాలు శక్తిమంతమైనవి. ఆయా సమయాలలో చేపట్టే అభ్యాసం చాలా మంచిది. శివుని నర్తనం, శివ శక్తుల సమ్మేళనం సృష్టిలోని అన్ని ప్రక్రియలకు, అస్తిత్వాలకూ మూలమని తెలుస్తోంది. తొలుత ఈ ప్రక్రియ మహాశివరాత్రి రోజున మహర్షులకు విదితమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆనంద నర్తనానికి తార్కాణం చిదంబరంలోని ఆకాశలింగం. ఇక్కడ ఉన్న చిత్ సభ, మానవుని శరీరంలోని నాడులు, వాటి నిర్మాణం, సకల విశ్వంలోని శక్తులు, వాటినుండి ప్రసారమయ్యే శక్తి, శబ్దబ్రహ్మం లయ విన్యాసం ఇత్యాదులను అనుసరించి నిర్మించటం జరిగింది. శివునికి రెండు స్వరూపాలు– చంద్రస్వరూపం, అగ్ని స్వరూపం. సామాన్యంగా మనం పూజించే శివుడిది చంద్రస్వరూపం.
కాలాన్ని శాసించే శివుడు, కాలాన్ని సూచించే చంద్రుడు కలిసిన స్వరూపం చంద్రశేఖర స్వరూపం. గ్రహదోషాలు, గ్రహదశలలో గల సమస్యలు, వాటి నివారణకు మహాశివరాత్రి రోజున జరిపే అభిషేకం ఎంతో ప్రధానమైనది. ఈరోజున ద్వాదశ జ్యోతిర్లింగాలలో లేదా పంచభూత లింగాలలో ఏ క్షేత్రమైనా గానీ లేదా ఇంటికి దగ్గరలో ఉన్న ఏ శివాలయాన్నైనా సందర్శించి మనసారా ఒక్కసారైనా పంచాక్షరి ఉచ్చరించిన వారికి ఎంతో ఫలితం ఉండగలదు. ఈశావాస్యోపనిషత్తు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్... ’ అని చెబుతుంది. పరమేశ్వర తత్వమొక్కటే పరిపూర్ణమైనది. ఒక వృత్తం తన ఆకారంలో చాలా గొప్పది. అది అనంతమైన మోతాదులో పెరుగుకుంటూ వెళ్లినా దాని కేంద్రం ఒక్కటే. పరిపూర్ణ తత్త్వమనేది ఒక గోళానికి చెందింది. పరిపూర్ణమైన దానిలోని భాగాలన్నీ, అణువులన్నీ పరిపూర్ణాలే అని తెలుసుకోవడమే సాధన!
సృష్టి యావత్తూ శివలింగమే– ఈ భూమిని కూడా ఒక లింగమేనని ధ్యానించాలి. సృష్టిలో ఒక చిన్న పరిపూర్ణత్వం ఈ ధరణి. అన్ని స్పందనలూ, చేతనలూ ఆయనలోనే, ఆయన వలనే! అటు అనంతం ఇటు అనంతం, పైన అనంతం, కింద అనంతం చుట్టూ తిరిగి చూస్తే సర్వం లింగాకారమే.. సర్వం శివమయం జగత్!
– వేదాంతం శ్రీపతి శర్మ