
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నా వయస్సు 24. చిన్నప్పటి నుంచి మా నాన్న నా ఇష్టానికి తగ్గట్టే అన్నీ ఇచ్చారు.
లవ్ డాక్టర్
హాయ్ సర్! నా వయస్సు 24. చిన్నప్పటి నుంచి మా నాన్న నా ఇష్టానికి తగ్గట్టే అన్నీ ఇచ్చారు. నాకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు కూడా నా మనసులో ఎవరైనా ఉన్నారా? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నా మనసులో ఎవరూ లేరు. దాంతో మా బావకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. చదువు పూర్తి చేసుకుని జాబ్ చేసే సమయంలో పరిచయమైన ఒక అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అతడు చూపించే కేరింగ్ మా డాడ్‌ని గుర్తు చేస్తోంది. పైగా తనకు నేనంటే ప్రాణం. అందుకే తనతో చెప్పేశాను నువ్వంటే ఇష్టమని. ఇక మా బావతో ఎప్పుడూ గొడవలే. ఎప్పటికీ తను నాకు సూట్ కాడని అర్థం అయింది.
ఇదే మాట మా డాడ్‌కి చెప్పాలంటే భయమేస్తోంది. సమాజం, బంధువులు ఇలా ఎన్నో విషయాలతో ముడివడిన ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలో అర్థం కావడంలేదు. నాకు మా డాడ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అందుకోసం నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమే. కానీ, మా బావతో నేను సంతోషంగా ఉండలేను అనే భయం వెంటాడుతోంది. ఇరవై నాలుగేళ్లుగా ఏ రోజూ నాపైన చిన్న రిమార్క్ కూడా లేదు. ఇప్పుడు ఈ విషయం మా డాడ్‌కి చెబితే ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయం ఓ వైపు, ఇష్టపడ్డానని చెప్పినంత ఈజీగా ప్రేమించిన వ్యక్తితో లైఫ్ షేర్ చేసుకోలేకపోతున్నాననే బాధ మరో వైపు నన్ను వెంటాడుతున్నాయి. తనేమో ఇంట్లోంచి వచ్చెయ్యి, ఒన్ ఇయర్‌లో అంతా సర్దుకుంటుంది అంటున్నాడు. ప్లీజ్ సర్ సలహా ఇవ్వండి.
– సుమ
ప్రేమించే ముందు నాన్నను అడగలేదు. ప్రేమించాక నాన్నకు చెప్పలేదు. బావేమో ఏమోగా ఉన్నాడు. లవర్ ‘ఎనీ డౌట్స్’ అని కాలర్ ఎగిరేస్తున్నాడు. నాన్న... ప్రేమతో బావను సెట్ చేశారు. నాన్నకు ప్రేమతో నువ్వు అబ్బాయిని గిప్టుగా ఇద్దామనుకుంటున్నావు.
రిలేటివ్స్ గోల ఉన్నదే..! క్యా కర్నా? ఏమి చెయ్యాలి? వాట్ టు డు, వాట్ నాట్ టు డు..? చాలా సింపుల్. నాకు చెప్పినట్టు నాన్నకు చెప్పెయ్యి. ఈ ప్రపంచంలో నిన్ను నాన్న ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. అనుమానాలు, భయాలు పక్కన పెట్టు.
విపరీతమయిన లాజిక్‌లతో తల పాడు చేసుకోకు.
డాడీ జిందాబాద్! చెప్పేసెయ్యి. ఇక మిగిలింది లవర్ గారు. ప్రేమ గుడ్డిది. ఒకసారి లవర్ గారిని, డాడీ గారు పిలిచి మాట్లాడితే బెటర్..! ‘అరటిపండ్లు గెలలు గెలలు లాగించి మీ బుద్ది షార్ప్‌నెస్ తగ్గింది. మొత్తం ఆన్సర్‌లో ఒక్క జోకు లేదు, ఒక్క క్రాకు లేదు... ఎందుకు చదువుతారు సార్..?’ ప్రేమ రోడ్డు మీద తొక్కలు వేసుకుని మరీ నడుస్తోంది నా చెల్లెలు. జారిపడకుండా ఉండాలని ఆన్సర్ చెప్పాను. నవ్వించానంటే జీవితం ఏడుస్తుంది. అమ్మాయి పెళ్లి కుదిరాక, వెళ్లి మరీ ఒక అరటి జోక్ చెప్పొద్దాంలే నీలాంబరీ.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com