నెగడు-20
రచన: ఎం.వి.రమణారెడ్డి
దావానలం ఆరిన తరువాత, నిప్పు ఇంకా రగులుతూ ఉన్నప్పుడు, కాలుతున్న మాంసం దాపులకు రావడానికి ఇతర ఏ జంతువూ సాహసించదు. కర్రతో నిప్పును కుళ్లగించడం, కర్రతోనే నిప్పులను వేరుజేయడం, దూరం నుండే మాంసాన్ని దగ్గరికి లాక్కోవడం వంటి నైపుణ్యాలు తన చేతులకున్న కారణంగా, ఉడికిన మాంసాన్ని సమృద్ధిగా సంపాదించుకునే సౌకర్యం దానికి కలిసొచ్చింది.
ఆ నరవానరానికి కాలిన మాంసం రుచిగా తగిలుండొచ్చు; కానీ, ఆ మాంసం కోసం అది చేసిన అన్వేషణ కేవలం రుచి కోసం కాదు. అడవిమంట మూలంగా దొరికేది సులువైన సముపార్జన గాబట్టి. కానీ అది నిరవధికంగా దొరికే పదార్థంగాదు. కోరినప్పుడల్లా అడవులు మండుతూ కూర్చోవు. కాబట్టి ఏడాదిలో ఎక్కువభాగం వేటాడకా తప్పదు. పచ్చిమాంసం తినకా తప్పదు. నరవానరానికి ప్రథమంగా నిప్పుతో ఏర్పడిన అవసరం వంటకోసం కాదు; ఆత్మరక్షణ కోసం.
ఎంత పెద్దదైనా, ఎంత క్రూరమైనదైనా నిప్పు జోలికి ఏ జంతువూ రాలేదు. అనుభవంతో కలిగిన ఈ పరిజ్ఞానాన్ని ఆత్మరక్షణ అవసరాల కోసం అమలులోకి తీసుకురావడం మాత్రమే అప్పుడు జరిగింది. ఇది ఏడాదిలోనో, రెండేళ్ళలోనో జరిగిన జ్ఞానోదయం కాదు. ఈ కొద్దిపాటి ఆలోచనకు ఎంతలేదన్నా పదిలక్షల సంవత్సరాలు పట్టిందని మనం గుర్తుంచుకోవాలి.
అప్పటికి ఆస్ట్రలోపిథికస్, దాని తరువాతి పరిణామదశలు అంతర్థానమై, ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాలను ‘హోమో ఎరెక్టస్’ ఆక్రమించింది. అప్పటికింకా అటువంటి జీవి అమెరికా ఖండం చేరుకోలేదు. పరిణామక్రమంలో హోమో ఎరెక్టస్ మనకు దగ్గరి బంధువు కాబట్టి, ఇకమీదట ఆ జీవిని ‘అతడు’, ‘ఆమె’ అనేందుకు అభ్యంతరం ఉండగూడదు.చెత్తాచెదారం కువ్వేసి, చేత్తో విరిగే మండలూ మాకులూ ప్రోగేసి, మంటలు చల్లారిన అడవినుండి కొరివిని తీసుకొచ్చి నెగడు రగిలించడం పెద్ద సమస్యేంగాదు. అయితే, అలాంటి పదార్థాలు గప్పున మండి చప్పున ఆరిపోతాయి. మాటిమాటికీ నిప్పును తెచ్చుకునేందుకు దావానలం రోజూ జరిగే సంఘటన కాదు. కానీ, ఆ మంటల్లో కాలిన లావుపాటి కలపమొద్దులు ఎంతోకాలం ఆరిపోకుండా రగులుతుంటాయే, అలాంటి ఏర్పాటు అతనికి కావలసింది.
అడవులకు కొదువలేదు. కర్రకు కరువులేదు. లేనిదల్లా కొమ్మలు నరికే సాధనమే. అప్పుడు కొమ్మలు నరికేందుకు అనువైన పనిముట్టు అవసరమయింది. ఆ ప్రయోజనం కోసం రాయిని ఎలా చెక్కాలో, ఏ సైజు రాయిని ఎన్నుకోవాలో ఆ చిన్న మెదడు ఆలోచించింది. ఫలితంగా రూపొందిన పనిముట్టే రాతిగొడ్డలి. ‘గొడ్డలి’ అనగానే కర్రను దూర్చేందుకు మధ్యలో బెజ్జముండే మనతరం గొడ్డలిని ఊహించుకోలేం.
రాయిలో తొర్ర తొలిచే లాఘవం నేర్చేందుకు తిరిగి వేల సంవత్సరాలు పట్టింది. మొదట్లో తయారైన గొడ్డలి చేత్తో పట్టుకుని కొమ్మను నరికేందుకు పనికొచ్చేది మాత్రమే. ఆ తరువాత మరికొంత కాలానికి, కర్రకు రాతిగొడ్డలి కట్టి చేజంపునా కొమ్మ నరికేందుకు అనుకూలమైన తయారీ రంగంలోకొచ్చింది.
కర్రకు కట్టడమంటే - కట్టేందుకు తాడులాగా ఉపయోగపడే నార గురించి తెలిసుండాలి. రాయి గుణం, కర్ర గుణం, నిప్పు గుణం, నార గుణం అప్పటిదాకా సాధించిన అదనపు పరిజ్ఞానం. ఆనాటి మనిషికి అవన్నీ అతీంద్రియంగా పుట్టిన ఆలోచనలు కావు. అతీంద్రియంగా పుట్టే ఆలోచనకు వేల సంవత్సరాలూ లక్షల సంవత్సరాలూ అవసరముండదు.
కళ్ళతో చూసింది, చెవులతో వినింది, స్పర్శతో గ్రహించింది - ఎంతోకాలంగా ఈ ఇంద్రియాలు అందిస్తున్న సమాచారాన్ని అనుభవాలతో బేరీజు వేసుకోవడం కారణంగా కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. ‘ముందు తరం నుండి గ్రహించడం, తరువాతి తరానికి అందించడం’ అనే స్తన్యజంతువు ప్రాథమిక స్వభావం నరవానర జీవిత విధానాన్ని కొత్తపుంతలు తొక్కించింది.
కొరివితో వన్యమృగాలను భయపెట్టడం ఏనాడు తెలిసొచ్చిందో, ఆనాడే మనిషి నివాసం ఆరుబయలు నుండి గుహలోకి మారింది.
అంతకుముందు గుహలన్నీ ప్రమాదకరమైన జంతువుల నివాసాలు. హక్కు కోసం జరిగిన పోరాటంలో మానవుడు జయించాడు; క్రూరమృగాలను మారుమూల ప్రాంతాలకు కాందిశీకులను చేశాడు. నిప్పు మూలంగా మానవునికి ఏర్పడిన మొట్టమొదటి ఆస్తి ‘గుహ’. కాబట్టి, మనిషి మనిషిగా ఎదిగేందుకు రాతి పనిముట్టు తొలిమెట్టు కాగా, నిప్పు రెండవమెట్టు. సుమారు ఐదు వేల సంవత్సరాలప్పుడు రాతి పనిముట్టుతో మనిషికి అవసరం తీరిపోయింది గానీ నిప్పుతో అవసరం మాత్రం ఇప్పటికీ తీరలేదు.
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com