చేతుల్లో వస్తువులు మాయం చేసి మస్కా కొడుతూ తాను భగవత్ స్వరూపునిగా అభివర్ణించుకుంటుంటారు కొందరు. నిమ్మకాయ కోసి రక్తం చూపి తమను తాము దైవాంశ సంభూతులమనుకొమ్మంటారు మరికొందరు. చేతబడులకు తిరుగుబడి చేస్తే జ్వరాలు తగ్గుతాయంటూ కోళ్లు, కానుకలు దండుకుంటుంటారు ఇంకొందరు. ముఖ్యంగా గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యత అడ్డం పెట్టుకుని కొందరు స్వాములు పబ్బం గడుపుకుంటున్నారు. ఇలాంటి వారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఇంద్రజాలాన్ని అస్త్రంగా వాడుతున్నారా ముగ్గురు. వారే మ్యాజిక్ సిస్టర్స్ అయిన మౌనిక, సుస్మిత. వారి తండ్రి జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). మ్యాజిక్ సహోదరీమణుల ఆ ద్వయం... తమ తండ్రితో కలిసి త్రయంగా ఏర్పడి... మూఢనమ్మకాలు తొలగించాలని పడుతున్న తాపత్రయం వారిది. వాళ్ల జీవిత‘ఆదర్శం’ ఆ అక్కాచెల్లెళ్ల మాటల్లోనే...
ఇంద్రజాలంతో ఎందరో మోసగాళ్లు అమాయకులను మోసం చేస్తుంటారు. అదే ఇంద్రజాలంతో మోసాన్ని మాయం చేస్తున్నారు ఈ అక్కాచెల్లెళ్లు...
మా నాన్న పేరు జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి (చారి). విజయనగరం పట్టణంలోని గంటస్థంభం దగ్గర కానుకుర్తివారివీధిలో నివాసం. నాన్న న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్. బీవీ పట్టాభిరామ్ వంటి ప్రముఖుల షోలు చూసి తానూ మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు నాన్న. తన పదహారేళ్ల వయసులో తొలి ప్రదర్శనను తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న ఎమ్మార్ కళాశాలో ఇచ్చారు.
అప్పటి నుంచి గత 32 ఏళ్లుగా ఆయన దాదాపు 10 వేల ప్రదర్శనలిచ్చారు. మా అమ్మ పేరు రమణి. పెళ్లి తర్వాత ఆమె సహకారంతో తన ప్రవృత్తికి మరింత పదును పెట్టి మూఢనమ్మకాలపై కత్తి దూశారు. కొరడా ఝుళిపించారు. మేమింకా మ్యాజిక్ యవనికపైకి అడుగుపెట్టకముందే ఒక ఇంద్రజాలికునిగా పది వేలకు పైగా ప్రదర్శనలిచ్చి జాతీయ అవార్డు అందుకున్నారు మా తండ్రి.
మాది సమాజం హర్షించే మాయ
అవును... మేమూ మాయ చేస్తున్నాం. కాకపోతే మాది సమాజం హర్షించే మాయ. నిజం చెప్పాలంటే మా మాయతో మేము మూఢనమ్మకాలను మాయం చేస్తున్నాం. అంధ విశ్వాసాలను అంతం చేస్తున్నాం. మాయలతో మోసపుచ్చే మాయగాళ్ల గారడీ చేతబడికి తిరుగుబడి చేస్తున్నాం. ఇందుకు తగిన కారణమూ, నేపథ్యమూ ఉంది. మా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమూ, అక్కడ అమాయక గిరిజనులు ఎక్కువ.
అప్పట్లో క్యాన్సర్, గుండె జబ్బు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైనా మరణిస్తే ప్రజలకు వాటి గురించి పెద్దగా తెలియకపోవడం వల్ల చేతబడి, చిల్లంగి, బాణామతి వంటి క్షుద్ర ప్రయోగం వల్ల చనిపోయి ఉంటారని అపోహ పడేవారు. అవన్నీ కేవలం మూఢనమ్మకాలంటూ మేము మ్యాజిక్ సాయంతో నిరూపిస్తున్నాం.
విజయనగరం జిల్లాలోని సాలూరు, పి కోనవలస, నీలకంఠాపురం, మొండెంకళ్లు, చినమేరంగి, కురుపాం, మక్కువ, కూనేరు, పార్వతీపురం, పెదబొండపల్లి, పాచిపెంట, మామిడిపల్లి, గుమ్మలక్ష్మీపురం, ఇంగిలాపల్లి, బొద్దాం, అలమండ, కొత్తవలస, కొట్యాడ, ఎస్‌కోట ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రదర్శనలిచ్చాం.
మాయను మాయతోనే ఎలా ఛేదిస్తామంటే...
మా ప్రాంతంలోని మాయలోళ్లు అమాయకులను బుట్టలో వేసుకోడానికి రకరకాల ప్రదర్శలను ఇస్తుంటారు. వాటి సాయంతో తమకు మహిమలున్నాయని చెప్పుకుంటుంటారు. మహిమల పేరు చెప్పి వారు చేసేవన్నీ మేమూ చేస్తాం.
నిమ్మకాయ నుంచి రక్తం రావడం, కొబ్బరి కాయలో నుంచి పువ్వులు, రక్తం రావడం, నాలుకపై త్రిశూలం గుచ్చుకోవడం, నోట్లో బ్లేడులు వేసుకుని నమిలి, మింగిన తర్వాత తోరణంగా వాటిని బయటకు తీయడం, విభూది సృష్టించడం, మెడలో కత్తి గుచ్చుకోవడం, తాడుమీద కొబ్బరికాయను అటూ ఇటూ నడిపించడం, దయ్యాలు, భూతాలపై భయాన్ని పోగొట్టేందుకు మనిషిని హిప్నటైజ్ చేసి తలపై మంటపెట్టి పాలు, నీరు మరిగించడం వంటి విద్యలను ప్రదర్శిస్తాం.
అవి కేవలం సైంటిఫిక్‌గా ప్రదర్శించే విద్యలే తప్ప మహిమలు కాదని చాటి చెబుతాం. ఊరూరా కేవలం ఈ ప్రదర్శనలే కాకుండా కళ్లకు గంతలు కట్టుకుని రోడ్లపై మోటార్ సైకిల్ నడిపి ప్రజల్లో మూఢనమ్మకాలను పారద్రోలే ప్రయత్నాలూ మా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి.
మాది సఫల ప్రయత్నం.. అందుకు ఇదీ ఉదాహరణ!
మా ప్రదర్శనలు ఎంతో విజ్ఞానవంతమైనవి. మరింత చైతన్యపరిచేవి. మా ప్రయత్నం ఎంత సఫలమో చెప్పేందుకు ఉదాహరణ ఒకటుంది. మా నాన్నగారు మ్యాజిక్ చేస్తుండగా విజయనగరం జిల్లాలోని జియమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మా నాన్న దగ్గరికి వచ్చాడు. తాను చిల్లంగి చేస్తున్నాననే నెపంతో కొందరు తన భార్యను పొట్టనబెట్టుకున్నారట.
తననూ చంపేస్తామంటున్నారంటూ బోరున విలపించాడు. ఇవే ప్రదర్శనలు తమ గ్రామంలో ఇచ్చి తన ప్రాణాలు నిలపమంటూ నాన్నను ప్రాధేయపడ్డాడు. నాన్న కారణంగా తన ప్రాణం దక్కుతుందంటూ కన్నీళ్లతో నమస్కరించాడు. ఇలా మా ప్రదర్శనలతో ప్రజలు చైతన్యవంతం కావడమే కాదు... చాలామంది ప్రాణాలూ నిలిచాయి. కొన్ని జీవితాల్లో మార్పులూ వచ్చాయి.
వినోదంతో పాటు సామాజిక బాధ్యత
మా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో శిశుమరణాలు ఎక్కువ. గర్భిణీ ఆరోగ్యం విషయంలో వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సరైన మందులు, వైద్యం కూడా అందదు. ఇక పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం కూడా ఉండదు. ఈ కారణంగా బిడ్డలు పౌష్టికాహార లోపంతో చిన్న వయసులోనే మృత్యువాత పడుతుంటారు. కనీసం వారికి తల్లిపాలైనా సరిగ్గా ఇస్తే కొంతమందినైనా బతికించుకోవచ్చు.
ఈ నేపథ్యంలో తల్లిపాల విశిష్టత, శిశువులకు పౌష్టికాహార ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గిరిజనులు తమ పిల్లలను బడికి పంపకుండా, కూలీ పనులకు పంపిస్తుంటారు. అలా చేయడం వల్ల వారి జీవితాల్లో వెలుగులు ఎన్నటికీ రావంటూ, విద్య ఆవశ్యకతపైనా ప్రదర్శనలిస్తుంటాం. ఆడపిల్లను చంపుకుంటే ఇంటి లక్ష్మిని చంపుకున్నట్టేనంటూ మా ఇద్దరినీ ఉదాహరణగా చూపిస్తూ.. భ్రూణహత్యలు, స్త్రీ శిశు హత్యలకు వ్యతిరేకంగా చైతన్యం తెస్తుంటారు నాన్న.
చిన్నారి పొన్నారి చిరు వయసు నుంచే...
మా ఇద్దరిలో మూడున్నర ఏళ్ల వయసప్పుడు నాచేత ప్రదర్శన ఇప్పించారు నాన్న. నన్ను చూసి చెల్లెలు రెండున్నర ఏళ్లున్నప్పుడే వేదిక ఎక్కడానికి ఉత్సాహం చూపింది. తాను అంత చిన్న వయసు నుంచే మ్యాజిక్ మొదలుపెట్టింది. అలా నాన్నతో పాటు మేమిద్దరమూ 28కి పైగా జాతీయ, రాష్ట్రీయ అవార్డులు ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నాం. మాది ఒక్కటే కోరిక. సమాజంలోని మూఢనమ్మకాలు అంతమైపోవాలి. అందుకు మా మ్యాజిక్ ఉపయోగపడి... అది మూఢనమ్మకాలను మాయం చేసేస్తే మాకు అంతకంటే ఏం కావాలి?
జాతీయ స్థాయి గుర్తింపు
ఇంద్రజాల ప్రదర్శనలో ప్రతిభకు వచ్చిన జాతీయ అవార్డు అందుకోవడానికి 2006లో మా అక్కాచెల్లెళ్లమిద్దరమూ ఢిల్లీకి వెళ్లాం. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ నుంచి అవార్డు తీసుకుంటుండగా మా విజిటింగ్ కార్డును ప్రధానికి ఇచ్చి ‘హమారా ఐడెంటిటీ కార్డ్’ అన్నాం. వెంటనే స్పందించిన మన్మోహన్‌సింగ్ ‘తుమ్‌హారా ఐడెంటిటీకార్డ్!’ అంటూ ఆశ్చర్యంగా అడుగుతున్నట్లు ముఖం పెట్టి ఆయన ఫక్కున నవ్వేశారు. విజిటింగ్ కార్డుకి ఐడెంటిటీ కార్డుకీ తేడా తెలియని వయసులో ఇంద్రజాలంలో జాతీయ అవార్డు అందుకున్నాం మేం. బహుశా ఇలా అక్కాచెల్లెళ్లిద్దరూ ఇంద్రజాలం ప్రదర్శించే మ్యాజిక్ సిస్టర్స్ మేమే కాబోలు.
లాయర్‌ని అవుతా
నాన్న కోర్టులో జూనియర్ అసిస్టెంట్ కావడంతో తరచుగా అక్కడికి తీసుకువెళ్లేవారు. దాంతో న్యాయవాద వృత్తిని చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మరి కొద్ది నెలల్లో ఎల్‌ఎల్‌బి పట్టా అందుకోబోతున్నాను. ఆటబొమ్మల బదులు మ్యాజిక్ వస్తువులు ఇచ్చి నాన్న ఆడుకోమనేవారు. ఆలా ఇంద్రజాలాన్ని ఉగ్గుపాలతోనే అలవాటు చేశారు. చెల్లి కూడా నాతో జతకలిసిన తర్వాత ఏ ప్రదర్శన చేసినా ఇద్దరం కలిసే చేస్తున్నాం. – మౌనిక, ఇంద్రజాలికురాలు, విజయనగరం
షార్ట్ ఫిల్మ్స్‌కు ఎడిటర్‌గా చేస్తున్నా
మానవ వనరులను సబ్జెక్ట్‌గా తీసుకుని డిగ్రీ చదువుతున్నాను. యానిమేషన్‌పై ఇష్టంతో అదీ నేర్చుకుని ఫ్రెండ్స్ ఫిల్మ్స్ అనే యూ ట్యూబ్ చానెల్ ద్వారా స్నేహితులతో కలిసి తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్‌కి ఎడిటర్‌గా కూడా చేస్తున్నాను. చిన్నప్పుడు అక్క మ్యాజిక్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టడం చూసి నాకూ మ్యాజిక్ చేయాలనిపించింది. నాన్న అక్కకూ, నాకూ దానిలో మెళకువలు నేర్చించారు. ఒకప్పుడు మేం చేస్తుంటే విమర్శించిన వారు ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. – సుష్మిత, ఇంద్రజాలికురాలు, విజయనగరం
చాలా విమర్శలు ఎదుర్కొన్నా
ఆడపిల్లల ముఖానికి రంగేసి తిప్పుతున్నానని, పెళ్లి చేయకుండా ఈ గారడీ ప్రదర్శనలేంటని బంధువర్గంలో సూటిపోటి మాటలు బాధించేవి. మ్యాజిక్‌ను చాలా చులకనగా చూసేవారు. ఒకానొక దశలో క్షుద్ర విద్యలు నేర్పుతున్నాననేవారు. ఇది క్షుద్రవిద్య కాదని, ఇంద్రజాలం అనేది ఓ కళ అని నమ్మిన నేను ఎవరు ఎన్ని మాటలన్నా, ఎంతగా నిరుత్సాహ పరిచినా వెనుదిరిగి చూడలేదు. వాళ్లన్న క్షుద్ర విద్యలు, మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ప్రదర్శనలిస్తున్నాం. – జవ్వాది వరాహలక్ష్మి నరసింహాచారి, తండ్రి, ఇంద్రజాలికుడు, విజయనగరం
– బోణం గణేష్, సాక్షి, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment