శివ అంటే మంగళమని అర్థం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం. రూపరహితుడైన శివుడు, జ్యోతిరూపంలో, లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి ముఖ్యమైనది. శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చేయాలి.
స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివాలయానికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. ఏమీ తెలియకపోతే ఓం నమశ్శివాయ అని జపిస్తూ ఉండాలి.
భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తి పండితులకు, శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి.
ఉపవాసం: శివరాత్రికి అందరూ ఉపవాసం చేయాలంది శాస్త్రం. పిల్లలకు, వృద్ధులకు, రోగులకు, గర్భిణులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తల స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.
ఉపవాసం అనే పదానికి అర్థం భగవంతునికి దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించకూడదు. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించం కష్టం.
జీవారాధన: మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్థాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
మౌనవ్రతం: శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం కాదు. వ్రతంలో మనోవాక్కాయాలు ఏకం కావాలి. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు చదువుతున్న రుద్ర – నమకచమకాలను వినండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటికి వచ్చాక, కాళ్లూ చేతులూ ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.
అభిషేకం: శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై కాసిని నీరు పోసినా, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
జాగరణ: శివరాత్రి జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. తమస్సును తొలగిస్తుంది.
మంత్ర జపం: శివరాత్రి మొత్తం ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం/స్మరణతో మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు శివాలయాన్ని సందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి.
పంచాక్షరాలు... పంచోపచారాలు
మొదటిది విభూతి ధారణ. విభూతి ధారణ ఐశ్వర్యకరమని అంటారు.
రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు.
నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించడం.
అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment