‘‘లంఖణం పరమౌషధం’’ అనేది పెద్దవాళ్ల నోట తరుచూ వింటుంటాం! ఇది ఆషామాషీగా చెప్పింది కాదని, నిజంగానే ఉపవాసానికి, ఆరోగ్యానికి లంకె ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే వేళకు తిండి తినడం ఎంత ముఖ్యమో అప్పుడప్పుడూ ఉపవాసం ఉండడమూ అంతే శ్రేయస్కరం. అందుకే అప్పుడప్పుడూ కడుపును ఖాళీగా ఉంచుకోమంటుంటారు పెద్దలు, వైద్యులు. భారతీయ సంస్కృతిలో ఉపవాసానికీ చోటుంది. మహాశివరాత్రి, నాగుల చవితి లాంటి కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో ఒక రోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం చాలామందికి అలవాటు. దీని ద్వారా పుణ్యం, పురుషార్థం రెండూ కలసి వస్తాయి.
కాలం మారింది. శారీరక శ్రమ తగ్గి, చల్లటి గదుల్లో కూర్చొని పనిచేసే కొలువులు రావడం, వేళాపాళా లేని ఉద్యోగాలు, జంక్‌ఫుడ్ తదితర వాటి వల్ల ఊబకాయుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. దీనివల్ల రకరకాల వ్యాధులూ విజృంభిస్తున్నాయి. అందుకే అడ్డదిడ్డంగా తిండి తినే బదులు ఓ క్రమపద్ధతి అలవాటు చేసుకోవాలని, దీనికి ఉపవాసాన్నీ జోడించాలని తాజాగా అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడడం, జీవితకాలం పెరగడం జరుగుతాయని అంటున్నాయి. ఈ క్రమంలో ఆరు రకాల ఉపవాసాలు ఆరోగ్యానికి శ్రేష్ఠం అని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఆ ఆరింటి గురించి తెలుసుకుందామిలా.
1) 16/8 పద్ధతి
దీన్నే లీన్‌గెయిన్స్ ప్రొటోకాల్ పద్ధతి అని కూడా అంటారు. ఇందులో ఉదయం అల్పాహారం తీసుకోకూడదు. మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 8గంటల లోపల రెండు, లేదా మూడు అంతకంటే ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవచ్చు. అంటే రాత్రి ఎనిమిది నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 16గంటల పాటు ఉపవాసం ఉండాలి. మహిళలైతే 15గంటలు ఉంటే చాలు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తినకుండా ఉండలేని వాళ్లకు ఈ పద్ధతి పాటించడం కష్టం. కానీ అల్పహారం ఎగరగొట్టే వాళ్లకు సులభం. అయితే, ఫాస్టింగ్ సమయంలో నీళ్లు, కాఫీ, ఇతర జీరో కేలరీల పానీయాలు తీసుకోవచ్చు. దీనివల్ల భోజనంపై ధ్యాస కూడా తగ్గుతుంది. ఉపవాసం ముగిశాక తీసుకునే ఆహారం మాత్రం పూర్తి బలవర్థకంగా ఉండాలి. విపరీతంగా జంక్‌ఫుడ్ తినేవారికి, అధికంగా కేలరీలు ఉండే వారికి ఈ విధానంతో ఫలితం ఉండదు.
2) 5:2 డైట్!
దీన్నే ఫాస్ట్ డైట్ అని అంటారు. ఇందులో వారానికి ఐదురోజులు సాధారణ ఆహార నియమాలే పాటించాలి. అయితే, రెండు రోజులు మాత్రం ఉపవాసం ఉండాలి. ఈ రెండు రోజుల్లో మహిళలు 250 కేలరీల చొప్పున, పురుషులు 300 కేలరీల చొప్పున రెండు సార్లు ఆహారం తీసుకోవాలి. అంటే మహిళలు 500 కేలరీలు, పురుషులు 600 కేలరీలకు మించకుండా ఆహారం తీసుకోవాలి. ఈ విధానంలోని సానుకూల ఫలితాలపై ఇప్పటికీ సరైన పరిశోధనలు లేనప్పటికీ చాలామంది 5:2డైట్‌ను అనుసరిస్తున్నారు.
3) ఈట్ స్టాప్ ఈట్
కొన్నేళ్లపాటు బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని ఫిట్‌నెస్ నిపుణుడు బ్రాడ్ పిలాన్ ప్రవేశపెట్టారు. ఇందులో వారంలో 48గంటల పాటు ఉపవాసం ఉండాలి. అంటే ఓ రోజు రాత్రి డిన్నర్ చేశాక మరుసటి రోజు రాత్రి డిన్నర్ చేసేంతవరకు ఉపవాసం ఉండాలి. దీన్ని బ్రేక్‌ఫాస్ట్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ మధ్య ఉపవాసంగానూ చేసుకోవచ్చు. ఉపవాసం సమయంలో నీళ్లు, కాఫీ, జీరో కేలరీలు ఉండే ఇతర పానీయాలు తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఈ పద్ధతి అనుసరించేటట్లయితే ఆహారం తీసుకొనే దశలో మాత్రం సాధారణంగానే భోజనం ఉండాలి. నిజానికి 24గంటల పాటు ఉపవాసం ఉండడం చాలామందికి అంత సులభమైన విషయం కాదు.
4) రోజు మార్చి రోజు(ఆల్టర్నేటివ్ డే)
ఇందులో వారంలో మూడు రోజులు రోజు మార్చి రోజు ఉపవాసం ఉండాలి. లేదా 500 కేలరీల ఆహారం తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నప్పటికీ దీన్ని పాటించడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఉపవాసం రోజు రాత్రి ఖాళీ కడుపుతో నిద్రపోవడం అంత సులభం కాదు. అంతేకాదు, భవిష్యత్తులో ఈ విధానం వల్ల సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది.
5) ది వారియర్ డైట్
ఇందులో రోజూ తెల్లవారుజామున 4గంటల నుంచి మధ్యాహ్నం 12లోపు తక్కువ పరిమాణంలో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. తర్వాత సాయంత్రం 4నుంచి 8గంటల లోపు లార్జ్ మీల్ భుజించాలి. ఇది ప్రస్తుతం ఎక్కువ వాడుకలో ఉన్న విధానం.
6) స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్
ఇందులో వారంలో రెండు రోజులు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్ తీసుకోకూడదు. అయితే, ఏయేరోజు పాటించాలనేది మీ ఇష్టం. ఉదాహరణకు ఏదైనా రోజు ఆకలి లేనప్పుడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ సమృద్ధిగా తినాలి. ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి తినడానికి ఏమీ దొరకవు. అలాంటప్పుడు ఈ పద్ధతి అవలంబించుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని అన్ని రకాలు ట్రై చేయవద్దు. ఏదైనా సరే ఒక విధానం ప్రకారం అనుసరిస్తేనే మేలు. ఉపవాసం శ్రేయస్కరం కావచ్చు కానీ శ్రుతి మించితే ప్రమాదమని గుర్తుపెట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment