ప్రతీకాత్మక చిత్రం
ప్రతీరోజూ మనం సుమారు 50 నుంచి 100 వెంట్రుకలను కోల్పోతూ ఉంటాము. తిరిగి అదే స్థాయిలో వెంట్రుకలు పెరగడం షరా మామూలే. మానవ శరీరంలో జరిగే అతి సహజమైన ప్రక్రియ ఇది. అయితే కొన్ని కారణాల వల్ల జుట్టు ఊడిపోయాక తిరిగి రాకపోతే క్రమంగా అది బట్టతలకు దారితీస్తుంది. దీని బారిన పడకుండా ఉండడానికి పలు రకాల ఖరీదైన షాంపూలు, హెయిర్ క్రీములు వాడుతూ ఉంటారు. అయితే జుట్టు రాలడం అనే సమస్య కేవలం వాడే షాంపూల మీదనే కాక తినే ఆహారం మీద కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడానికి ఐరన్ లోపం ప్రధాన కారణమని, మాంసాహారం తినకపోవడం వల్ల తగినంత ఐరన్ శరీరానికి అందడం లేదని పరిశోధనలో తేలింది. శాకాహారంలో కూడా ఐరన్ ఉన్నప్పటికీ శరీరానికి కావలసిన స్థాయిలో లేదని తెలిపారు.
అమెరికన్ అకాడెమీ ఆఫ్ డెర్మటాలజీకి చెందిన లియోనిడ్ బెంజమిన్ ట్రోస్ట్ 40 సంవత్సరాల నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించిన తర్వాతే జుట్టు రాలే సమస్యకు చికిత్స ప్రారంభించాలి. అప్పుడే మెరుగైన ఫలితాలు సాధించగలం’ అన్నారు.
అమెరికన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం మహిళలకు రోజుకు 18 మిల్లీగ్రాములు, పురుషులకు 8 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. ఈ శాతం కంటే తక్కువ తీసుకుంటే జుట్టు రాలడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
ఐరన్ ప్రధానంగా హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అని రెండు రకాలుగా ఉంటుందని.. ఆ రెండు రూపాలూ శరీరానికి అవసరమని తమ పరిశోధనలో వెల్లడైందని ట్రోస్ట్ తెలిపారు. శాకాహారంలో కేవలం నాన్ హీమ్ ఐరన్ మాత్రమే ఉంటుందని, హీమ్ ఐరన్ చాలా కొద్ది మొత్తంలో ఉంటుందని తెలిపారు. శాకాహారం స్వీకరించేవారు పుల్లటి పళ్లతో కలిపి తీసుకుంటే ఐరన్ శరీరానికి వంటబడుతుందని అన్నారు. ఐరన్ కోసం టాబ్లెట్స్ వాడాల్సి వస్తే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment