చే'నేత' | Malka activist ujramma | Sakshi
Sakshi News home page

చే'నేత'

Published Mon, Jul 9 2018 1:33 AM | Last Updated on Mon, Jul 9 2018 1:33 AM

Malka activist ujramma - Sakshi

మల్కా దారాల అల్లిక, చేనేత మగ్గాల విప్లవం. ఈ విప్లవానికి నాంది పలికింది ఉజ్రమ్మ. పత్తి రైతు, స్పిన్నింగ్‌ మిల్లు, చేనేతకారుడు... పరస్పర ఆధారితమై మనుగడ సాగించాలి. ఎవరూ ఎవరి మీదా పెత్తనం చేయరాదు... ఎవరూ ఎవరి ముందూ చేతులు కట్టుకోరాదు. నేతకారులను సంఘటితం చేస్తోందీ ఉక్కుమహిళ చేనేతను ప్రగతిబాట పట్టిస్తోందీ నేత.

మీరు హైదరాబాదీనా? నార్త్‌ ఇండియనా?
పుట్టింది హైదరాబాద్‌లోనే. పెరిగింది నార్త్‌లో. నాన్న రైల్వే ఆఫీసర్‌ కావడంతో నార్త్‌లో చాలా నగరాల్లో పెరిగాను. స్కూలు, కాలేజ్‌ కూడా నార్త్‌లోనే.

మీరేం చదివారు?
ఇంగ్లిష్‌ లిటరేచర్‌
     
మీ తరంలో అమ్మాయిల చదువుకి పెద్ద ఆంక్షలే ఉండేవేమో! ముఖ్యంగా ఇస్లాం సంప్రదాయ కుటుంబాల్లో...!

మాది అభ్యుదయ కుటుంబం, మా నానమ్మ ఆ రోజుల్లోనే బురఖాకు వ్యతిరేకంగా పోరాడింది. అలాంటి నేపథ్యంలో ఆడపిల్లల చదువు మీద ఆంక్షలు ఎందుకుంటాయి?
     
మీ చదువుకీ, మీరు చేస్తున్న సామాజిక ఉద్యమానికి సంబంధమే కనిపించడం లేదు?

మా చిన్నాన్న సజ్జద్‌ జహీర్‌ ప్రముఖ కమ్యూనిస్ట్‌ లీడర్‌. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. పర్సన్‌గా నా వికాసంలో చిన్నాన్నదే మెయిన్‌ రోల్‌. ఆయన నాకు రోల్‌మోడల్‌ కూడా.
     
ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో కెరీర్‌ ప్లాన్‌ చేయనేలేదా?

నాలాగ సోషల్‌ ఇష్యూస్‌ మీద స్పందించే వ్యక్తికి లిటరేచర్‌ ప్రొఫెషన్‌గా ఉపయోగపడదనిపించింది. పత్తి మీద, చేనేత మీద నేను చేసిన పనిని అక్షరీకరించడానికి ఆ చదువు ఉపయోగపడింది.
     
చేనేత రంగం మీద ప్రత్యేక ఆసక్తి ఎందుకు?

బ్రిటిష్‌ పాలన కాలంలో మనదేశపు పత్తి బ్రిటన్‌కు ఎగుమతి కావడం మొదలైంది. ఎగుమతికి అవకాశాలు పెరిగాయి సంతోషమే. అక్కడ మన ఉనికిని మనమే పణంగా పెట్టాల్సిన కుట్ర ఎవరికీ తెలియకుండా జరిగిపోయింది. బ్రిటన్‌లోని స్పిన్నింగ్‌ మిల్లులకు అనువుగా ఉండే పత్తి రకాలను పండించడానికి మన రైతుల్ని సిద్ధం చేసేశారు.

దాంతో మనదేశంలో ఉన్న వైవిధ్యతను కోల్పోయాం. దానికి తోడు మన చేనేతకారులకు దారం అవసరమైనంతగా అందడం లేదు. ఇటు పత్తి రైతు, అటు వస్త్రాన్ని నేసే నేతకారుడు ఇద్దరూ స్పిన్నింగ్‌ మిల్లు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇద్దరినీ నియంత్రించే స్థాయికి, నిర్దేశించే స్థాయికి చేరిపోయింది స్పిన్నింగ్‌ పరిశ్రమ.
   
ఈ ఉద్యమంలో మీ లక్ష్యం ఏమిటి?

సమన్యాయం. రైతు, చేనేత కారుడు, స్పిన్నింగ్‌ మిల్లు యజమాని... ముగ్గురూ సమాజంలో ఒకే రకమైన గౌరవాలను అందుకోగలగాలి. స్పిన్నింగ్‌ పరిశ్రమ ఉక్కు కౌగిలి నుంచి పత్తి రైతులు, చేనేత కారులు బయటపడాలి.

ఇంతకీ మల్కా అంటే ఏమిటి?
ఇది ఒకరకమైన ఫ్యాబ్రిక్‌. ఖాదీ వంటిదే. దారం నునుపుగా, మృదువుగా ఉంటుంది. మన్నిక కూడా ఎక్కువే. ఈ దారంతో చేసిన వస్త్రం చేతికి కొంచెం గరుకుగా తగులుతూ ఒంటికి హాయినిస్తూంటుంది. మన భారతీయ సంప్రదాయ నేత విధానానికి ఆధునిక టెక్నాలజీని మేళవించి రూపొందుతున్న వస్త్రం. మల్కా చీర కడితే కుచ్చిళ్లు చక్కగా అమరుతాయి.
     
నార్మల్‌ కాటన్‌కీ దీనికీ తేడా ఉంటుందా?

పాశ్చాత్య కంపెనీలు మన పత్తిని వాళ్ల దేశాలకు రవాణా చేయడానికి బేలింగ్‌ విధానం పాటిస్తాయి. పత్తిని గట్టిగా ఒత్తిడికి గురిచేసి నలుచదరంగా డబ్బాలాగ ప్యాక్‌ చేస్తారు. వాటినే మనం పత్తి బేళ్లు అంటాం. బేలింగ్‌లో కంప్రెస్‌ చేసినప్పుడు, తిరిగి స్పిన్నింగ్‌ మిల్లులో ఏకినప్పుడు పత్తి పోగుల్లో సహజంగా ఉండే సున్నితత్వం, మెరుపు తగ్గుతుంది.

మల్కా నేత కోసం పత్తిని బేల్‌ చేయరు. వదులుగా ప్యాక్‌ చేసి రవాణా చేస్తారు. చిన్న చిన్న నూలు మిల్లులు ఏర్పాటు చేసి, పత్తి రైతులు, చేనేత కారులకు అందుబాటులోకి ఉండేట్టు చూస్తున్నాం. వాటిని చేనేతకారులే సహకార సంఘాలుగా ఏర్పడి నడిపించుకుంటున్నారు. సిరిసిల్లలో 70 చేనేత కుటుంబాలు మల్కా ప్రోత్సాహక, పరిరక్షణ ఉద్యమంలో పని చేస్తున్నాయి. వాళ్లు పత్తిని రైతుల నుంచి కొని దారం తీస్తారు, వారే దుస్తులు నేస్తారు.
     
మన పత్తి పాశ్చాత్య కంపెనీల్లో దారంగా మారడం తప్పంటారా?

తప్పా ఒప్పా అనేది కాదిక్కడ. నాలుగు వేల ఏళ్ల మన వస్త్ర పరిశ్రమ మనది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పత్తి పండేది. వాటి నుంచి వచ్చే దారంలోనూ తేడా ఉంటుంది. దానిని బట్టి అక్కడ తయారయ్యే వస్త్రాల్లో వైవిధ్యత ఉండేది. పాశ్చాత్య కంపెనీలు... వాళ్ల మిషన్‌లకు అనువుగా ఉండే పత్తినే ప్రమోట్‌ చేస్తున్నాయి.

దాంతో ఒకే రకమైన దారంతో ఒకటే రకం కాటన్‌ తయారవుతోంది. మనకు పెద్ద ఆస్తిలాంటి వైవిధ్యత పోతోంది. అలాగే వాళ్లు సూచించే పత్తి వంగడాలకు మన వాతావరణంలో తెగుళ్లు ఎక్కువ. దాంతో మందులు ఎక్కువ చల్లాలి, రైతుకి ఖర్చు పెరుగుతుంది. ఈ నేలలో జీవం పోసుకున్న పత్తి వంగడం ఇక్కడి వాతావరణంలో తెగుళ్లను కూడా ఎదుర్కోగలుగుతుంది.
     
దేశీయ పత్తి, చేనేత గురించి ఇన్ని విషయాలు చెబుతున్నారు, చాలా స్టడీ చేసినట్లున్నారు!

స్టడీ కాదు, రీసెర్చ్‌ చేశాను. ‘పేట్రియాటిక్‌ అండ్‌ పీపుల్‌ ఓరియెంటెడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(పిపిఎస్‌టి)’లో పరిశోధన చేశాను. యూరప్, అమెరికాలు... అవి పాటిస్తున్న సైన్స్‌కి మోడరన్‌ సైన్స్‌ అనే పేరు పెట్టి మూడవ ప్రపంచదేశాల మీద ఆధిపత్యం చెలాయించడం, ఆయా దేశాల్లో అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న సైన్స్‌ను తుడిచిపెట్టే ప్రయత్నం చేయడం మీద మనదేశంలోని యువశాస్త్రవేత్తలు కొంతమంది డెబ్బైలలో ఒక ఫౌండేషన్‌గా ఏర్పడ్డారు. ఇండియాలో విస్తరించిన సైన్స్‌ను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అది.
     
మల్కా ఉద్యమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు?

పదేళ్ల కిందట, 2008లో. అంతకు ముందు ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరులో చేనేతకారుల కోసం పనిచేశాను. దస్తకార్‌ ఆంధ్రా మార్కెటింగ్‌ అసోసియేషన్‌ స్థాపన కోసం పని చేశాను. రాష్ట్రంలోని చేనేతకారులు సంఘటితంగా స్వయంగా మార్కెట్‌ చేసుకోవడానికి వేదిక అది. మల్కా మార్కెటింగ్‌ ట్రస్ట్‌ కూడా అలాంటిదే. తెలంగాణలో ఒకప్పుడు ఉండి ఇప్పుడు కనుమరుగవుతున్న డిజైన్‌లతో మల్కానేతలో ప్రయోగాలు చేస్తున్నాం. వస్త్రాన్ని మచిలీపట్నం పంపించి వాటి మీద సహజరంగులతో కలంకారీ అద్దకం చేయిస్తున్నాం. మన దేశీయ పత్తి, చేనేతకు మన అద్దకం మేళవింపు అన్నమాట.
     
మల్కాను ప్రమోట్‌ చేయడానికి సెలబ్రిటీ అంబాసిడర్‌లున్నారా?

మల్కా చీరను ధరించిన ప్రతి మహిళా మల్కాకు బ్రాండ్‌ అంబాసిడరే. ఒకసారి వీటిలో సౌకర్యాన్ని ఆస్వాదిస్తే ఇక వదిలిపెట్టరు.
     
మల్కా దుస్తుల ధర చాలా ఎక్కువ కదా?

కొంత వరకు నిజమే, కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. చెమటను పీల్చుకునే వస్త్రం ఒంటికి చేసే మేలు గురించి ఒకరు చెప్పాల్సి రావడం బాధాకరమే. «ధరే కాదు, మన్నిక కూడా ఎక్కువే.
     
మీ ప్రయత్నంలో విజయం సాధించారా? ఇది ముందు తరాలకు కొనసాగే అవకాశముందా?

ఇది విస్త్రృతమైన ప్రపంచం. నేను వేసిన అడుగులు కొన్నే. నేను చైతన్యపరిచిన చేనేతకారుల కుటుంబాల్లో ఈ వృత్తి జీవితాన్ని నిలబెడుతుందనే నమ్మకమైతే కుదిరింది. ఈ జర్నీ కొనసాగాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వాలు చేనేత రంగాన్ని సన్‌సెట్‌ ఇండస్ట్రీగా చూస్తున్నాయి.

ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలు ఉన్న కళను పరిరక్షించడానికే అరకొర అవుతున్నాయి. భవిష్యత్తు నిర్మాణానికి సరిపోవడం లేదు. నిజానికి ఇది భవిష్యత్తు ఉన్న గ్రీన్‌ ఇండస్ట్రీ. ప్రపంచంలో అత్యధికంగా చేనేతకారులున్న దేశం మనది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే చైనాను మించిపోతుంది ఇండియా. మన పత్తి నుంచి దాని నాణ్యత కోల్పోకుండా దారం తీయడానికి అనువైన యంత్రాల కోసం రీసెర్చ్‌ జరగాలి. మనకోసం మనమే యంత్రాలను తయారు చేసుకోవాలి.
     
చేనేత ఉద్యమంతోపాటు మీ హాబీలేంటి?

హాబీ కాదు కానీ, నా మరో ప్రొఫెషన్‌ జువెలరీ మేకింగ్‌. ఆభరణాల తయారీ కోర్సు చేశాను. ఇంట్లో వర్క్‌షాప్‌ ఉంది. బ్రాస్‌లెట్, నెక్లెస్, చెవిరింగులు, ఉంగరాల వంటివి కొత్త డిజైన్‌లు చేస్తుంటాను.
     
మరి... రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తారు?

నాకిప్పుడు 75 ఏళ్లు. ఈ వయసులో ఎన్ని గంటలు చేయగలను. మల్కా కోసం నాలుగు గంటలు, ఆభరణాల వర్క్‌షాప్‌లో రెండు గంటలు.
     
టూర్‌లను ఇష్టపడతారా?

ఇండియాలో, విదేశాల్లో ప్రదేశాలకు వెళ్లాను. కానీ నేను టూరిస్ట్‌ను కాదు. అక్కడి మనుషులను కలవడానికే వెళ్లాను తప్ప ప్రదేశాలను చూడడానికి కాదు. రాష్ట్రీయ చేనేత జనసమాఖ్యను కలవడానికి చీరాలకు వెళ్లాను. ఒరిస్సా, కర్ణాటక, కేరళలోని హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ను కలిశాను. లూమింగ్‌ రివల్యూషన్‌లో భాగంగా విస్తృతంగా పర్యటించాను.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి


పత్తి చరిత్ర
మట్టి నుంచి పత్తిని పండించే రైతు, పత్తి నుంచి దారం తీసే యంత్రం, దారంతో వస్త్రాన్ని రూపొందించే హస్తకళా నైపుణ్యం... ఈ మూడూ తోడుగా ఉండడమే ఆధునిక మానవుడి ఆహార్య రహస్యం. ఈ మూడింటిలో మొదటి అడుగే తప్పటడుగు అవుతుంటే... మిగిలినవి తప్పుటడుగులే అవుతాయి. ఇప్పటికే కొన్ని దశాబ్దాలుగా పడిన తప్పటడుగులను సరిచేయడమే మల్కా ఉద్యమం ఉద్దేశం.

దేశమంతటా పర్యటించి పరిశోధించిన సమాచారాన్ని ‘ఏ ఫ్రేడ్‌ హిస్టరీ : ద జర్నీ ఆఫ్‌ కాటన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో పుస్తకం రాశాను. ఈ పుస్తకంలో పత్తి చరిత్ర, పత్తిలో రకాలు, సాగు పద్ధతులు, దారం తీసే నైపుణ్యాలు, వస్త్రాన్ని నేయడంలో వివిధ ప్రాంతాల్లో అవలంబించే పద్ధతుల గురించి సమగ్రంగా చర్చించాను. నా తర్వాత ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ముందుకు వచ్చే వాళ్లకి ఇది పనికొస్తుంది. నేను చేసిన పనినే మళ్లీ వాళ్లు కూడా మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేకుండా ఈ పుస్తకం మార్గదర్శనం చేస్తుంది.

– ఉజ్రమ్మ, మల్కా ఉద్యమకారిణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement