త్రీమంకీస్ - 48 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 48

Published Fri, Dec 5 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

త్రీమంకీస్  -  48

త్రీమంకీస్ - 48

 డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 48
 
 - మల్లాది వెంకటకృష్ణమూర్తి    
 
 తాబేలు ఓటమిని అంగీకరించలేదు. ఆలోచించి కుందేలుని మళ్ళీ పోటీకి పిలిచింది. ఈసారి కుందేలు వేగంగా పరిగెత్తి ఫినిష్ లైన్‌కి ముందున్న ఓ చెరువు దగ్గర ఆగిపోయింది. దానికి ఈత రాదు. తాబేలు నింపాదిగా వచ్చి, చెరువులోకి దూకి, ఈది అవతల ఒడ్డున ఉన్న ఫినిష్ లైన్‌కి చేరుకుని గెలిచింది. ఈసారి నీతి ఏమిటి? గెలుపు కోసం నీ మార్గాన్ని మార్చుకో.

 ‘‘కథ ఇంకా పూర్తి కాలేదు బ్రదర్. ఇది ముఖ్యమైన కథ. సరే. కుందేలు తాబేలుని మళ్ళీ పరుగు పోటీకి పిలిచి, తాబేలుతో - ‘చెరువు గట్టు దాకా నువ్వు నా భుజాన కూర్చో. చెరువుని దాటేప్పుడు నీ భుజం మీద నేను కూర్చుంటాను’ అని చెప్పింది. అందుకు తాబేలు ఒప్పుకుంది. ఆ ప్రకారం కుందేలు, దాని భుజం మీది తాబేలు చెరువు దాకా చేరుకున్నాయి. చెరువులోని నీళ్ళల్లో ఈదే తాబేలు వీపు మీద కుందేలు కూర్చుని చెరువుని దాటింది. ఆ రెండూ సమానంగా ఒకేసారి ఫినిషింగ్ లైన్‌ని చేరి రెండూ గెలిచాయి. నీతి ఏమిటి? ఎవరినైనా ఓడగొట్ట లేకపోతే వాళ్ళతో చేతులు కలిపి నెగ్గు. నన్ను నువ్వు నెగ్గలేవు. సఖ్యత వల్ల ఇద్దరికీ మంచిదే. శతృత్వం వల్ల నీకు మాత్రమే నష్టం. ఏమంటావు?’’
 మర్కట్, వానర్‌లు ఆ మాటల్ని మెచ్చుకుంటూ వెంటనే చప్పట్లు కొట్టారు.
 ‘‘సరే’’ కోపాన్ని దిగమింగుకుని దుర్యోధన్ చెప్పాడు.
 ‘‘జాగ్రత్త. మాట తప్పితే జైల్లోంచి ఒక్కరూ బయటకి వెళ్ళలేరు. జైల్లోంచి అంతా గమనిస్తూంటాం. రేపు రాత్రి పథకం ఏమిటి?’’ కపీష్ అడిగాడు.
 ‘‘రేపు రాత్రి గార్డ్ మా అందరి సెల్స్ తాళాలు తెరుస్తాడు. పోలీసులు మర్నాడు కట్టి పడేసిన అతన్ని చూస్తారు. తేలు తేలు అని అరిచినందుకు తెరిచానని చెప్తాడు’’ దుర్యోధన్ చెప్పాడు.
 ‘‘ఇందాక నువ్వు ఫోన్ చేసింది అతనికే నన్నమాట.’’
 ‘‘అదీ తెలుసా?’’ దుర్యోధన్ ఉలిక్కి పడ్డాడు.
 ‘‘మాకు అంతా తెలుసు. నువ్వు ఎన్ని మిల్లీ లీటర్ల మూత్రం పోసావో కూడా మాకు తెలుసు. ఏ సెల్ లోంచి సొరంగం తవ్వారు?’’ వానర్ అడిగాడు.
 ‘‘టు నాట్ టు సెల్ లోంచి’’ దుర్యోధన్ ఓడిపోయిన వాడి మొహం పెట్టి చెప్పాడు.
 ‘‘సొరంగం ఏ మేరకి తీశారేమిటి?’’ కపీష్ అడిగాడు.
 ‘‘దేనికి?’’ దుర్యోధన్ కోపంగా ప్రశ్నించాడు.
 ‘‘నేను చదివింది ఇంజనీరింగ్ కోర్స్. సొరంగం చుట్టు కొలత మూడు అడుగులు ఉంటే అంతకు రెట్టింపు సీలింగ్ పైన ఉండాలి. అంటే మూడడుగుల సొరంగానికి కనీసం ఆరు అడుగుల మట్టిపైన ఉండాలి. లేదా అది కూలే ప్రమాదం ఉంది. అదీ లెక్క.’’
 ‘‘నాకా లెక్కలు తెలీవు కాని నా చిన్నప్పుడు నేను మా నాన్నతో దొంగతనాలకి వెళ్ళేవాడిని. ఆయన కన్నపు దొంగ. ఇలాంటి వాటిలో నాకు అనుభవం ఎక్కువ. నేను తీసిన ఏ సొరంగం ఇంత దాకా కూల్లేదు.’’
 ‘‘ఇంకేం?’’
 అతను దూరంగా వెళ్ళాక మిత్రులు ముగ్గురూ తమకి జైల్లో తారసపడ్డ ముగ్గురు భామల గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు.
 ‘‘డాక్టర్ మూలిక ప్రవర్తన మీతో ఎలా ఉంది?’’ వానర్ అడిగాడు.
 ‘‘మామూలుగానే ఉంది. ఏం?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘నాతో మాత్రం పేషెంట్ - డాక్టర్‌ల మధ్య సంబంధంలా లేదు...’’ తన అనుభవాన్ని వివరించాడు.
 వెంటనే మర్కట్ సన్నగా ఈల వేసి చెప్పాడు.
 ‘‘నిన్ను రోజూ పిలుస్తోందా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి మూలిక నీతో ప్రేమలో పడింది అని తెలుస్తోంది. ఏమంటావ్?’’
 ‘‘అవును. నాతో కూడా ఒకరు ప్రేమలో పడ్డారు. పేరు రుధిర’’ కపీష్ రుధిర గురించిన విషయాలు చెప్పాడు.
 ‘‘నా జోడీ గురించి మీ ఇద్దరికీ తెలుసు. ఆమె పేరు వైతరణి అని కూడా మీకు తెలుసు’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘మనం పారిపోయేందుకు వాళ్ళేమైనా ఉపయోగిస్తారేమో చూద్దాం. లేదా కనీసం మనకి బెయిల్ అయినా ఇప్పించవచ్చు. కాబట్టి వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచుదాం’’ కపీష్ చెప్పాడు.
 జైలర్ రోల్ కాల్ తీసుకున్నాక విజిల్ ఊది చెప్పాడు.
 ‘‘అంతా మీ మీ సెల్స్‌కి వెళ్ళండి.’’
 13
 ఆ రాత్రి మెస్‌లో గార్డ్‌లు ఎప్పటిలా ఖైదీల మీద ఓ కన్నేసి ఉంచారు. భోజనాల దగ్గర ఎప్పటిలా మిత్రులు ముగ్గురూ ఒకేచోట కూర్చుని గొంతు తగ్గించి మాట్లాడుకోసాగారు.
 ‘‘అడుగో దుర్యోధనుడు. నేను వెళ్ళి మేజిక్ నేర్పి వస్తాను’’ చెప్పి కపీష్ లేచాడు.
 దుర్యోధన్ ముందు కూర్చుని చెప్పాడు.
 ‘‘నేనో మేజిక్ చేయనా? ఈ లడ్డూ ఉంది చూశావు? దీన్ని నువ్వు స్పెషల్ ఖైదీ అని పెట్టి ఉంటారు. దీన్ని ఎలా మాయం చేస్తున్నానో చూడు’’ చెప్పి దాన్ని కుడి చేత్తో అందుకుని, బల్ల కింది ఎడం చేతిలోకి దాన్ని పడేసి కుడి చేతిని పైకి విసిరేసి పైకి చూడసాగాడు. అంతా కూడా పైకి చూస్తూండగా ఆ లడ్డూని విసిరేస్తే మర్కట్ దాన్ని పట్టుకున్నాడు.
 ‘‘మాయం! లడ్డూ మేజిక్ బాలేదూ? కావాలంటే నన్ను వెతకండి’’ నవ్వుతూ రెండు చేతులూ పైకి ఎత్తి పెట్టి లేచి నిలబడుతూ చెప్పాడు. వాళ్ళల్లో కదలిక లేదు.
 అంతా కపీష్ ధైర్యానికి, దుర్యోధన్ స్పందించకపోవడానికి ఆశ్చర్యపోయారు. గుసగుసలు మొదలయ్యాయి.
 (దేవుడ్ని నవ్వించడం ఎలా?)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement