త్రీమంకీస్ - 81 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ - 81

Published Wed, Jan 7 2015 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

త్రీమంకీస్ - 81

త్రీమంకీస్ - 81

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 81
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
‘‘అదింకా అర్థం కాలేదా అంకుల్! విమానాశ్రయ అధికారులకి ఫోన్ చేసి మీరు ముంబై వెళ్ళే విమానంలో బాంబ్ పెట్టామని చెప్పాం తప్ప పోలీసులకి ఫోన్ కొట్టి పారిపోయిన ముగ్గురు ఖైదీలు ఆ విమానంలో ఉన్నారని చెప్పలేదు అంటే ఇంకా మీమీద మాకు కొద్దిగా ప్రేమ ఉండబట్టే కదా!’’

 ‘‘అసలు మీకు మా ప్లాన్ మొత్తం ఎలా తెలుసు?’’ కపీష్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘మగాడి చేతిలో మోసపోయిన ఆడది సీబీఐ కన్నా సమర్ధవంతంగా పని చేస్తుంది. ఇంక మేం మగాడ్ని నమ్మకూడదని నిశ్చయించుకున్నాం. గుర్తుంచుకోండి. ఇందిరాగాంధీ, సోనియా, మమత బెనర్జీ, జయలలిత నించి మేం ఓ పాఠం నేర్చుకున్నాం. తమని డిస్టర్బ్ చేసే భర్త లేకపోవడం వల్లే చక్కగా జీవించగలమని వాళ్ళు ఋజువు చేశారు’’ వైతరణి చెప్పింది.
 ‘‘నిజమే. కాని భారతీయులు కూడా ఆ నలుగురు ఆడవాళ్ళ నించి ఓ పాఠం నేర్చుకున్నారు. అది వాళ్ళు కోట్లాది మంది భారతీయులని డిస్టర్బ్ చేస్తున్నారనే పాఠం. మీరూ అ పని చేయద్దని భారతీయుల తరఫున కోరుతున్నాను’’ మర్కట్ కోరాడు.
 ‘‘మీ ముగ్గురికీ ఓ ఉచిత సలహా ఇచ్చి వెళ్తాం. అన్ని వ్యాధులకి మందు నవ్వు’’ వైతరణి చెప్పింది.
 ‘‘నవ్వని వారు ఉన్నంతకాలం లోకంలో డాక్టర్లు ఉంటూనే ఉంటారు’’ మూలిక చెప్పింది.
 ‘‘కారణం లేకుండా నవ్వేవారికి మాత్రం మందు అవసరం’’ రుధిర చెప్పింది.
 ‘‘మా ముగ్గురి మనసులోని మాటని నేను చెప్తా వినండి. ‘మీతో మాకు పెళ్ళయితే మా ఇల్లే జైలు. మా భార్యే జైల్ వార్డెన్’’ మర్కట్ కసిగా చెప్పాడు.
 ‘‘అవును. అది మా మనసులోని మాటే’’ కపీష్ చెప్పాడు.
 ‘‘నేనూ కన్‌ఫం బటన్‌ని నొక్కాను’’ వానర్ కూడా చెప్పాడు.
 ‘‘ఏమిటి గొణుగుతున్నావు? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావనా?’’ డాక్టర్ మూలిక అడిగింది.
 ‘‘లేదు. నేను నిన్ను ద్వేషించడం లేదు. నువ్వు జీవించడం నాకు నచ్చడం లేదని అంటున్నాను’’ వానర్ అరిచాడు.
 ‘‘కుక్కలకి కుక్కభాషలోనే చెప్తాను. వినండి. మీరు లక్ష రూపాయలు పెట్టి కొన్నా ఓ కుక్క మిమ్మల్ని చూసి తోకాడించదు. అది మీ స్వంతం కాకపోయినా మీరు దాన్ని ప్రేమతో చూస్తేనే అది మిమ్మల్ని చూసి తోకాడిస్తుంది’’ వైతరణి చెప్పింది.
 ‘‘ఈమె కుక్కల రాణి’’ మర్కట్ ఎకసక్కెంగా చెప్పాడు.
 ‘‘సగటు మనిషి కంటే సగటు కుక్క మంచిదని ఋజువు చేశావు. నువ్వు ఎందుకు నిజాయితీగా ప్రవర్తించలేదో నేను అర్థం చేసుకోగలను మర్కట్! నువ్వు మనిషివే తప్ప కుక్కవి కావు’’ వైతరణి కోపంగా అరిచింది.
 ‘‘నువ్వు మా మనుషుల్ని అవమానిస్తున్నావు’’ మర్కట్ ఎర్రబడ్డ మొహంతో చెప్పాడు.
 ‘‘నిజం చెప్తున్నాను. ఆకలికి అన్నం పెట్టిన కుక్క ఎన్నటికీ పెట్టిన వాళ్ళని కరవదు. బహుశా మీ ముగ్గురూ పందుల్ని పెంచుతున్నారని నా అనుమానం’’ వైతరణి చెప్పింది.
 ‘‘ఎందుకని? మీ ఇంట్లో నేను ఎక్కువ తిన్నానా?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘కాదు. కుక్కకి రోజూ తల దాచుకోడానికి చోటిచ్చి రోజూ ఇంత అన్నం, కాసిని మంచినీళ్ళు, కాస్తంత ప్రేమ ఇస్తే మనల్ని దేవుడిగా భావిస్తుంది. అదే పంది అలాంటి వారిని తనతో సమానంగా చూస్తుంది. మీరు పందుల్లాంటి వాళ్ళు కాబట్టి పందినే పెంచారని అనుకున్నాను. మీలాంటి వారు సమాజంలో చీడపందులు.’’
 ‘‘మేమేం చీడపందులం కాము. మేం ముగ్గురం మూడు మొక్కలని నాటాం.’’
 ‘‘అంటే?’’
 ‘‘తన గురించి ఆలోచించేవాడు కుక్కని పెంచుతాడు. సమాజం గురించి ఆలోచించేవాడు మొక్కని పెంచుతాడు’’ వానర్ అరిచాడు.
 ‘‘పందులతో మనకేంటే మాటలు. పోదాం పద’’ రుధిర చెప్పింది.
 చంద్రుని మీదికి ఆర్మ్‌స్ట్రాంగ్‌ని పంపించి ఇవాళ్టికి సరిగ్గా ఏభై మూడేళ్లయింది. దారి కనుక్కున్నాక మగాళ్ళందరినీ అక్కడికి పంపించొచ్చుగా?’’ డాక్టర్ మూలిక గొణిగింది.
 వాళ్ళు ముగ్గురూ వైతరణి ఏక్టివా ఎక్కి పోలీసుల పక్క నించి వెళ్ళిపోయారు.
 ‘‘చీర విప్పిన వీర వనిత పథకం ఇదంతా’’ వానర్ కోపంగా చెప్పాడు.
 ‘‘నన్నడిగితే చీర కట్టిన వీర వీరుడు అనడం సబబు.’’
 ‘‘ఎవరిదైనా నష్టపోయింది మనమేగా. ఇంకా నయం. మన మీద బాంబుల్ని వేయడమో, ఏసిడ్ చల్లడమో చేయలేదు’’ కపీష్ చెప్పాడు.
 ‘‘అది మగాళ్ళు చేేన... నిజమే. రుధిరకి ఆ ఆలోచన వచ్చి ఉండదు.’’
 ‘‘ఆఖరి క్షణంలో అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. పోన్లే. నువ్వు ఓ పాఠం నేర్చుకున్నావు’’ మర్కట్ వానర్‌తో చెప్పాడు.
 ‘‘మనల్ని ప్రేమించిన ఆడదాన్ని వదిలి వెళ్ళకూడదనా?’’ వానర్ ప్రశ్నించాడు.
 ‘‘కాదు. ఏర్‌పోర్ట్‌లో ఒంటరిగా కూర్చున్న అమ్మాయి పక్క సీట్ ఖాళీనా అని అడక్కూడదని.’’
 కళ్ళు మూసుకుని చేతులు జోడించి వానర్ ఏదో ప్రార్థించడం చూసి కపీష్ అడిగాడు - ‘‘ఏమిటా ప్రార్థన?’’.
 (ఏమని జవాబిచ్చి ఉంటాడో ఊహించండి)
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement