త్రీమంకీస్ - 49
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 49
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘రేపు రాత్రి లోగా మళ్ళీ అనేకసార్లు కలుసుకుందాం’’ చెప్పి మళ్ళీ వచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు.
మర్కట్ లడ్డూని మూడు ముక్కలు చేసి పంచాడు.
‘‘ఇక మనం రేపు రాత్రి పారిపోయే విషయం చర్చించుకుందాం. మనకో టార్చ్‌లైట్ కావాలి’’ కపీష్ చెప్పాడు.
‘‘దేనికి?’’ వానర్ అడిగాడు.
‘‘సొరంగంలో చీకటిగా ఉంటుంది కాబట్టి.’’
‘‘నీ ప్రియురాలు డాక్టర్ మూలిక దగ్గర అది తప్పకుండా ఉంటుంది. అడిగి తీసుకో’’ మర్కట్ సూచించాడు.
‘‘అలాగే. కాని అది ఒన్-వే-ట్రాఫిక్ మాత్రమే.’’
‘‘సరైన టైంకి బయలుదేరాలంటే మనకి వాచీ కూడా అవసరం. జెంట్స్ వాచీ ఆమె దగ్గర ఉండదు. తనది ఇస్తుందని నేను అనుకోను. నీకు మూలిక ఐదు వందలు ఇచ్చిందన్నావుగా? బయట నించి వాచీని తెచ్చిస్తాడేమో గార్డ్‌ని అడిగి చూడు. సెకండ్ హేండ్ వాచీ సరిపోతుంది’’ కపీష్ సూచించాడు.
‘‘అలాగే.’’
‘‘అవును. మన ముగ్గురిలో ఒకరికి టైం తెలిేన్త చాలు. మిగతా ఇద్దర్నీ అలర్ట్ చేసి తీసుకెళ్ళచ్చు’’ మర్కట్ చెప్పాడు.
పారిపోయే అంశం మీద కపీష్ వారికి మరి కొన్ని సూచనలు చేసాడు.
భోజనం అయ్యాక అంతా మళ్ళీ గంట విని తమ తమ సెల్స్‌కి చేరుకున్నారు. కాేనపు మర్కట్ ఆ చిన్న సెలో అటూ ఇటూ నడిచాడు. అతనికి విసుగ్గా ఉంది. వేమనని అడిగాడు.
‘‘దేవుడికి కూడా మనలా సమస్యలు ఉంటాయా వేమన గారు?’’
‘‘దేవుడి సమస్య ఒక్కటే. అదృశ్యంగా మాత్రమే ఉండగలగడం. కనపడటం ఆయనకి చేత కాదు. మనకి ఉన్న సమస్య ఒక్కటే. అదృశ్యంగా ఉండలేకపోవడం. కనపడకుండా ఉండగలిగితే మన చాలా సమస్యలు మాయం అవుతాయి.’’
‘‘దేవుడు మనకి ఎందుకు కనపడడు?’’ కాసేపాగి మర్కట్ ప్రశ్నించాడు.
‘‘నువ్వు కనపడు. నేను నిన్ను నమ్ముతా’ అంటాడు మనిషి. ‘కాదు. ముందు నువ్వు నమ్ము. తర్వాత నేను కనపడతా’ అంటాడు దేవుడు.’’
‘‘చైనా మొహాలన్నిటినీ దేవుడు ఒకేలా ఎందుకు చేసాడు?’’ కొద్దిసేపు ఆలోచించి అడిగాడు.
‘‘దేవుడు ప్రతీ దేశానికి వెళ్ళి మనుషుల్ని వేరువేరుగా తయారు చేశాక చైనాకి వెళ్ళేసరికి విసిగిపోయాడు కాబట్టి.’’
‘‘స్వామీ! దేవుడికి మన మీద ప్రీతి కలగాలంటే ఏం చేయాలి?’’ మర్కట్ అడిగాడు.
‘‘పెంగ్విన్ పక్షులకి ఆహారం వేయాలి.’’
‘‘అదేమిటి?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘దేవుడు భూమిని మనుషుల కోసం నిర్మించాడు. ఒక్క అంటార్కిటికా ఖండాన్ని మాత్రం పెంగ్విన్ పక్షుల కోసం నిర్మించాడు. ఎందుకంటే ఆయనకి ఆ పక్షులంటే ప్రేమ. కాబట్టి వాటికి ఆహారం పెడితే దేవుడికి ప్రీతి కలుగుతుంది’’ వేమన చెప్పాడు.
‘‘దేవుడ్ని నవ్వించడం ఎలా?’’
‘‘నీ భవిష్యత్ ప్రణాళికలని ఆయనకి చెప్పి.’’
ఇంకేం అడగాలా అని మర్కట్ ఆలోచిస్తూంటే వేమన శూన్యంలోకి చూస్తూ అకస్మాత్తుగా అడిగాడు.
‘‘నీ ఆత్మోన్నతికి నువ్వేం చేస్తున్నావు?’’
‘‘నన్నా?’’ మర్కట్ అడిగాడు.
‘‘ఇక్కడ ఆత్మధారులు మరెవరైనా ఉన్నారా?’’
‘‘చపాతీలో బగారా బైంగన్ నంచుకుని తినాలని అనుకుంటున్నాను.’’
వేమన అతని వంక జాలిగా చూసి, మళ్ళీ శూన్యంలోకి చూసి నిట్టూర్చి చెప్పాడు.
‘‘నీ జీవితాన్ని వృథా చేసుకుంటున్నావు.’’
‘‘ఇది ఆఖరి ప్రశ్న. మీరు బయట ఉన్నప్పుడు నిత్యం ఆలయానికి వెళ్తూండేవారా?’’
‘‘లేదు. ఆలయానికి దగ్గరయ్యే వారంతా దేవుడికి దూరం అవుతారు. మనం దేవుడితో మాట్లాడితే భక్తులం. దేవుడు మనతో మాట్లాడితే పిచ్చివాళ్ళం..’’
ఆయన తన బెర్త్ మీద పడుకుని చెప్పాడు.
‘‘వెన్ ఐ వజ్ ఎట్ బాంబే రైల్వేస్టేషన్, ఐ గాట్ ది ఇన్‌ఫర్‌మేషన్ దట్ ది మెట్రిక్యులేషన్ ఎగ్జామినేషన్ వజ్ ది గ్రేట్ బాదరేషన్ ఫర్ ది యూత్ జనరేషన్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ హూస్ ఆక్యుపేషన్ వజ్ కల్టివేషన్.’’
‘నేను నేను కాకుండా మరొకరైతే బావుండేది. నన్ను మరొకర్నిగా చెయ్యి’ అని మర్కట్ దేవుడ్ని ప్రార్థించాడా రాత్రి.
(వానర్‌కి డాక్టర్ మూలిక ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి?)