త్రీమంకీస్ 82 | malladi special story | Sakshi
Sakshi News home page

త్రీమంకీస్ 82

Published Thu, Jan 8 2015 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

త్రీమంకీస్ 82

త్రీమంకీస్ 82

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 82
మల్లాది వెంకటకృష్ణమూర్తి
 

 ‘‘మన పథకాన్ని నాశనం చేసేసింది. డాక్టర్ మూలిక మరణిస్తే, మా కట్టమైసమ్మకి సింహం బలి ఇస్తానని మొక్కుకున్నాను.’’
 ఖరీదైన ఏసీ టేక్సీలో దర్జాగా వచ్చిన ఆ ముగ్గురూ నంబర్ పదకొండు వాహనం ఎక్కి, అంటే రెండు కాళ్ళ మీద నడవసాగారు.
 ‘‘ప్రేమ అనే ఖైదులోంచి ఎవరూ తప్పించుకోలేరు. వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. చూస్తూండండి’’ వైతరణి ఏక్టివాని నడుపుతూ ఇద్దరు మితృరాళ్ళతో చెప్పింది.

 ‘‘అవును. నేను వానర్‌ని అంత గాఢంగా ప్రేమించాను’’ మూలిక చెప్పింది.
 ‘‘కపీష్ తిరిగి రావడం డౌటే. మగాళ్ళు నిజాయితీపరులు కారు’’ రుధిర చెప్పింది.
 ‘‘అధైర్యపడకు. జీవితం ఎప్పుడూ రెండో అవకాశం అనేది ఇస్తుంది. దాని పేరు రేపు’’ వైతరణి ధైర్యం చెప్పింది.
 ‘‘నేను ఒకప్పుడు మగాణ్ణే కాబట్టి నీ కన్నా నాకు మగాళ్ళ గురించి బాగా తెలుసు.’’
 ‘‘మర్కట్ కాకపోతే మరో డొర్కట్. వానర్ కాకపోతే మరో గీనర్. కపీష్ కాకపోతే ఇంకో గిపీష్. లోకం గొడ్డుపోయిందా?’’
 వాళ్ళ ఏక్టివా మలుపు తిరిగే దాకా చూశాక మర్కట్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు - ‘‘డబ్బు లేనప్పుడు మనతో ఉంటుంది. డబ్బు రాగానే ఉండమన్నా ఉండదు. అది ఇప్పుడు నన్ను చేరింది.’’
 ‘‘ఏమిటది?’’ వానర్ అడిగాడు.
 ‘‘ఆకలి. నాకు బాగా ఆకలిగా ఉంది.’’
 ‘‘ఒన్ సర్కిల్ టు సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ. ఒన్ సర్కిల్ టు సర్కిల్ రెక్టాంగిల్ ఏ తాగుదామా?’’ వానర్ చెప్పాడు.
 ‘‘అవును. మనకి ఇప్పుడు అదే కావాలి. వెళ్ళి ఆ వెండింగ్ మెషీన్‌లోంచి మూడు కోక్స్ తీసుకురా’’ కపీష్ చెప్పాడు.
 ‘‘సారీ! నా డబ్బంతా ఆ ఎయిర్ బేగ్‌లోనే ఉంది. జేబులో చిల్లిగవ్వ కూడా లేదు’’ వానర్ చెప్పాడు.
 ‘‘నీ సంగతేంటి?’’ కపీష్ మర్కట్‌ని అడిగాడు.
 ‘‘తర్వాతి నిమిషంలో కనుక నేను మరణించేట్లయితే నాకు జీవితాంతం సరిపడా డబ్బుంది.’’
 ‘‘డబ్బు ఉన్నట్లా? లేనట్లా?’’ వానర్ అడిగాడు.
 ‘‘లేదు. అంతా పోలీసుల అధీనంలోని ఆ ఎయిర్ బేగ్‌లో ఉంది. ఈ దరిద్రం ఉంది చూశారూ? అది భరించలేనిదని నేను ఒకప్పుడు కోటీశ్వరుణ్ణి కాబట్టి గ్రహించాను’’ మర్కట్ చెప్పాడు.
 ‘‘నా పర్స్ ప్రస్తుతం ఉల్లిపాయ లాంటిది. దాన్ని తెరిస్తే ఏడుపు వస్తుంది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘నేను ఎవర్నీ నిందించను. మంచివాళ్ళు ఆనందాన్ని ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు. అతి చెడ్డవాళ్ళు నీతి పాఠాన్ని బోధిస్తారు. ఉత్తములు జ్ఞాపకాలని ఇస్తారు. మనం బెటర్. కొందరు ధనవంతులు ఎంత బీదవాళ్ళంటే పాపం వారి దగ్గర డబ్బు తప్ప ఇంకేం ఉండదు’’ కపీష్ శూన్యంలోకి చూస్తూ చెప్పాడు.
 ‘‘వేమనలా వేదాంతం మాట్లాడక. నీకు పిచ్చెక్కిందని భయపడతాం’’ మర్కట్ విసుక్కున్నాడు.
 ‘‘ఈరోజు నా జీవితం మొత్తానికి చాలా చెడ్డ రోజు’’ వానర్ చెప్పాడు.
 ‘‘ఎన్నడూ జీవితంలోని ఏ రోజునీ నిందించక. ప్రతీరోజు ఏదో ఒకటి ఇచ్చే వెళ్తుంది. మంచిరోజు ఆనందాన్ని ఇస్తుంది. దానికి అంతా నవ్వుతారు. చెడ్డ రోజు అనుభవాన్ని ఇస్తుంది.’’
 ‘‘మళ్ళీ వేమనలా మాట్లాడద్దన్నానా?’’ మర్కట్ అరిచాడు.
 ‘‘నేను మాట్లాడలేదే?’’ కపీష్ ఖండించాడు.
 ‘‘మరి ఎవరు?’’
 ‘‘అవును. ఎవరు? నువ్వు చెప్పావా అది?’’ వానర్ మర్కట్‌ని అడిగాడు.
 ‘‘లేదు.’’
 ‘‘నువ్వు?’’ కపీష్ వానర్‌ని అడిగాడు.
 ‘‘ఊహూ.’’
 ‘‘మరి ఎవరా మాటలు అన్నది?’’ కపీష్ అర్థం కాక చుట్టూ చూశాడు.
 ‘‘నేను. ఓసారి నేను దేవుడ్ని కలిశాను. ఆయన తుమ్మాడు. అప్పుడు నేనేం అనాలో తెలీలేదు.’’
 విన్న గొంతులా ఉందనుకుని మర్కట్ తల తిప్పి చూశాడు.
 వేమన!
 ‘‘ఓ! మీరూ పారిపోయారా?’’ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘లేదు. నేను మీలా పారిపోనందుకు మేజిస్ట్రేట్ యమధర్మరాజు నా నిజాయితీని మెచ్చి నన్ను నిరపరాధిగా భావించి విడుదల చేశాడు. మీరంతా సొరంగంలోంచి పారిపోయారని అరిచి అందరికీ చెప్పింది నేనే. దాంతో దుర్యోధన్ గేంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు’’ అతను చెప్పాడు.
 ‘‘వేదాంతి అయిన మీరు ఈ పని ఎందుకు చేశారు?’’ కపీష్ అడిగాడు.
 ‘‘వేదాంతం అంటే విశాఖపట్నంలో తుఫాను వస్తే వారణాసిలో బట్టలు ఎండకపోవడం నాయనా. అర్థం చేసుకో.’’
 ‘‘మీరు ఎక్కడికి?’’ ఆయన జేబులోని బోర్డింగ్ కార్డ్‌ని చూసి వానర్ అడిగాడు.
 ‘‘ఢిల్లీకి. వేదాంత ప్రవచనం చెప్పడానికి. దేవుడు ఎవరని మొన్న అడిగావు. గుర్తుందా?’’ వేమన మర్కట్‌ని అడిగాడు.
 ‘‘అవును. తెలిసిందా?’’ మర్కట్ ప్రశ్నించాడు.
 ‘‘ఆ!’’
 ‘‘ఎవరు?’’ వానర్ అడిగాడు.
 ‘‘మా తాతయ్యే.’’
 ‘‘ఎలా తెలుసు?’’
 (ఎప్పుడూ ఆనందంగా ఉండేవాళ్లు అలా ఉండగలగటానికి కారణం కపీష్ ఏమని చెప్పాడు?)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement