
త్రీమంకీస్ - 38
డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 38
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
‘‘డిజిపి భార్యని ‘జీవితాంతం దేవుడు లేడని నమ్మి చివరకి ఆయన ఉన్నాడని తెలుసుకోవడం మంచిదా? లేక జీవితాంతం ఆయన ఉన్నాడని నమ్మి చివరికి లేడని తెలుసుకోవడం మంచిదా? ఏది ఉత్తమ మార్గం?’అని ప్రశ్నిస్తే పబ్లిక్ న్యూసెన్స్ కేస్ కింద పట్టుకురాలేదా?’’
‘‘లేదే?’’
ఆ ఇద్దరిలో ఎవరు అబద్ధం చెప్పారా అని మర్కట్ అనుకుంటూంటే వేమన అన్న మాటలతో ఆ ప్రశ్నకి జవాబు దొరికింది.
‘‘అందుకేనేమో నా స్క్రూ లూజ్ అని అంటూంటారు. ఐనా నాకు దేవుళ్ళతో పేచీ లేదు. అతని ఫేన్ క్లబ్ సభ్యులతోనే పేచీ’’ వేమన మెల్లిగా చెప్పి ఓ పాట అందుకున్నాడు.
‘మాయజాలమున మునిగేవు నరుడా! దారీ తెలియక తడబాటులేలా?
జ్ఞాననేత్రమున వెదకీ చూడుమా! శాశ్వత జ్యోతీ కనుగొనుమా.’
10
రోల్ కాల్‌లో మర్కట్ చూపులు మళ్ళీ మహిళా రిమాండ్ ఖైదీల బృందం వైపు వెళ్ళాయి. నిన్నటి మహిళా గార్డ్ కనిపించింది. అతను ఆమెని చూసి నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. చేతిని ఊపాడు. ఈసారి ఆమె కూడా చేతిని ఊపింది. రోల్‌కాల్ అయ్యాక మర్కట్ ఆమె దగ్గరకి వెళ్ళాడు.
‘‘హలో! నా పేరు మర్కట్’’ పలకరించాడు.
‘‘నా పేరు వైతరణి’’ చెప్పింది.
‘‘ఈవాల్టికి నాలుగు రోజులైంది వచ్చి.’’
‘‘తెలుసు.’’
‘‘దేనికో తెలుసా?’’
‘‘ఇంకా తెలుసుకోలేదు. ఏం చదివావ్?’’
‘‘ఇంజనీరింగ్.’’
‘‘ఈ రోజుల్లో ఇక్కడికి ఇంజనీర్లు చాలామందే వస్తున్నారు.’’
‘‘చాలామంది ఇంజనీర్లకి ఉద్యోగాలు దొరకడం లేదు. డాక్టర్లైతే ఇంజక్షన్ చేసినా ఏభై రూపాయలు వస్తుంది. రోజుకో ఐదారు ఇంజక్షన్లతో హాయిగా బతికేయచ్చు. నీకీ ఉద్యోగం బావుందా?’’
‘‘జీతం రాళ్ళ కోసం ఏదో పని చెయ్యాలిగా?’’
‘‘నువ్వు ఎయిర్ హోస్టెస్ జాబ్‌కి సరిగ్గా సూట్ అవుతావు.’’
‘‘ఎలా తెలుసు?’’
‘‘ఊహల్లో ఈ యూనిఫాం విప్పి, చీర కట్టి చెప్తున్నాను.’’
‘‘ఏ చీర? కంచి, గద్వాల్, ఆరణి, ఉప్పాడ... ఏ పట్టు చీర?’’ ఉత్సాహంగా అడిగింది.
‘‘కాశ్మీర్ సిల్క్.’’
‘‘రిచ్‌గా ఊహించినందుకు థాంక్స్. నీకు ఇక్కడ బావుందా?’’ వైతరణి అడిగింది.
‘‘ఏదో తెచ్చి పడేశారు కాబట్టి గడపాలిగా. నా సెల్ నంబర్ రెండు వందల పదహారు. సెల్‌ఫోన్ నంబర్ కాదు. ఉంచే సెల్.’’
‘‘మమ్మల్ని మగాళ్ళ సెల్స్‌లోకి వెళ్ళనివ్వరు. మేం ఆడవాళ్ళ సెల్స్‌లోకే వెళ్ళాలి.’’
‘‘నేను ఆడదాన్ని అయి ఉంటే బావుండేదని అనిపిస్తోంది.’’
‘‘ఛ! నేను అలాంటి దాన్ని కాను. ఎప్పటికైనా విడుదల అవుతావుగా. అప్పుడు కలుద్దాం.’’
‘‘అలాగే. అంతదాకా రోజు నిన్నిక్కడ చూడచ్చుగా?’’
‘‘చూడచ్చు.’’
‘‘ప్లీజ్. నువ్వు ఎటూ జైల్లో గార్డ్‌వి కాబట్టి నీ హృదయం అనే జైల్లో నాకు యావజ్జీవ కారాగార శిక్షని విధించు.’’
‘‘బెయిల్‌కి అవకాశం లేని శిక్షని విధించాను‘‘వైతరణి సీరియస్‌గా చెప్పింది.
‘‘అమ్మయ్య! ఇంత కాలానికి శాంతిగా ఉంది. నీకోటి తెలుసా? పారిపోవడానికి అతి కష్టమైన జైలు నీ మనసే’’
‘‘నిన్ను చూడకమునుపు ఎవర్నైనా చూసినప్పుడు కారణం లేకుండా నవ్వడం అనేది ఎలాంటిదో నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది.’’
వాళ్ళు అలా మాట్లాడుకుంటూండగా ఓ దృశ్యం కపీష్ కంట పడింది. వెంటనే అతను వానర్‌కి దాన్ని చూపించాడు. మర్కట్ కోసం చూశారు. అతను మహిళా గార్డ్‌తో మాట్లాడుతూండటం గమనించి కపీష్ అతన్ని పక్కకి తీసుకెళ్ళి అడిగాడు.
‘‘చూశావా?’’
‘‘ఏమిటి?’’
‘‘మట్టి పోయడం. ఆ నలుగురిలో ఇద్దరు మళ్ళీ అక్కడ మట్టి పోశారు.’’
‘‘అలాగా? నేను చూళ్ళేదు.’’
‘‘నువ్వు ఇవన్నీ చూసే పరిస్థితిలో లేవని నిన్ను చూస్తూంటే తెలిసిపోతోంది. ఖచ్చితంగా వాళ్ళు సొరంగం తవ్వుతున్నారని నా నమ్మకం. దీనికి నాయకుడు దుర్యోధన్.’’
‘‘ఎలా తెలుసు?’’
‘‘వాళ్ళు వాడి మనుషులు.’’
‘‘ఐతే వాళ్ళల్లో ఒకడ్ని బాత్‌రూంలో ఒంటరిగా పట్టుకుని నాలుగు పీకి ఆచూకీ తీద్దామా?’’ మర్కట్ అడిగాడు.
‘‘ఒద్దు. ఈ రహస్యం మనకి తెలుసని వాళ్ళకి ఇప్పుడే తెలీకూడదు. లేదా మన మీద వాళ్ళు దాడి చేయచ్చు. పైగా దుర్యోధన్‌కి ఇక్కడ జైలర్, గార్డ్‌ల సపోర్ట్ ఉంది’’ కపీష్ చెప్పాడు.
‘‘మరి ఎలా తెలుసుకోవడం?’’
‘‘కొంత ఊహించగలను. ఆ నలుగురిలో ఇద్దరే మట్టి పోశారు. మిగిలిన ఇద్దరూ దాన్ని కాళ్ళతో చదును చేశారు. అంటే ఆ మట్టి పోసిన వారి సెల్‌లోనే సొరంగం తవ్వుతూండి ఉండచ్చు. పారిపోయేప్పుడు ఈ ఇద్దరూ కూడా వాళ్ళతో కలిసిపారిపోతారు అని ఊహించవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి.’’
‘‘అలాగే.’’
‘‘నువ్వు నీ ప్రియురాలికి ఈ విషయం చెప్పక.’’
‘‘ప్రియురాలా?’’
(జైల్లో ఉంటే ఏం సమస్యలు ఉండవు?)