
పార్సిల్‌లో సర్పరాజం ప్రత్యక్షమైన ఘటన ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలో చోటుచేసుకుంది.
భువనేశ్వర్ : గృహోపకరణాలతో కూడిన పార్సిల్‌ను ఓపెన్ చేస్తుండగా అందులోంచి పాము ప్రత్యక్షమైన ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ ప్రస్తుతం ఒడిషాలోని మయూర్‌భంజ్‌లోని రైరంగాపూర్‌లో ఉంటున్న తన నివాసంలో కొరియర్ నుంచి వచ్చిన పార్సిల్‌ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్‌లో పాము బయటపడ్డ విషయాన్ని ముత్తుకుమరన్ అటవీ అధికారులకు తెలపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పదిహేను రోజుల కిందట తాను ప్రైవేట్ కొరియర్ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్ చేశానని ముత్తుకుమరన్ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు.