పూర్వం బనీ ఇస్రాయీల్ జాతికి చెందిన ఒక వ్యక్తికి వెయ్యి బంగారు నాణేలు అత్యవసరపడ్డాయి. దాంతో తనకు బాగా తెలిసిన ఒక వ్యాపారిని అప్పివ్వమని అభ్యర్థించాడు. ఆ వ్యాపారి అల్లాహ్ పై నమ్మకం ఉంచి అతనికి వెయ్యి బంగారు నాణాలను అప్పుగా ఇచ్చాడు. ఫలానా గడువులోగా తిరిగి ఇచ్చేయాలని షరతు కూడా పెట్టాడు. బంగారు నాణేలను తీసుకుని సముద్ర మార్గాన్ని దాటి తన ప్రాంతానికి వెళ్లిపోయాడు. తీసుకున్న డబ్బుతో అవసరాలు తీర్చుకున్నాడు. అంతలోనే అప్పు తీర్చే గడువు రానేవచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు నాణాలను తీసుకుని అప్పు తీర్చే ఉద్దేశంతో ప్రయాణానికి సిద్ధమయ్యాడు. సముద్ర తీరం దగ్గర నిలబడి పడవ కోసం ఎదురుచూడసాగాడు.
ఎంతసేపటికీ పడవ వచ్చే జాడకానరావడం లేదు. ఎలాగైనా ఈ బంగారు నాణేలను ఈరోజు అతనిదాకా చేర్చాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు. ఇచ్చిన మాట తప్పుతున్నానని కుమిలిపోసాగాడు. సముద్రం ఒడ్డున పడి ఉన్న ఒక కర్రను అందుకున్నాడు. దాన్ని రెండుగా చీల్చి అందులో అప్పుగా తీసుకున్న వెయ్యి బంగారు నాణాలను నింపాడు. చీల్చిన కర్రను అతికించాడు. ‘‘ఓ అల్లాహ్ రుణాన్ని తీర్చే మార్గం కానరావడం లేదు. కాబట్టి ఈ నాణాలు నా రుణదాత వరకు చేర్చు ప్రభూ’’ అని వేడుకుంటూ నాణేల కర్రను సముద్రంలో వదిలాడు. అటువైపు ఆ రోజు తనవద్ద అప్పు తీసుకున్న వ్యక్తి కోసం వ్యాపారి సముద్రం ఒడ్డున ఎదురుచూడసాగాడు.
ఎంతసేపటికీ ఎవ్వరూ వచ్చే జాడకానరాలేదు. అయితే అంతలోనే ఒక కర్ర సముద్రంలో కొట్టుకువచ్చింది. పొయ్యిలో కనీసం కట్టెగానైనా పనికొస్తుందనే ఉద్దేశంతో ఇంటికి తీసుకువచ్చాడు. కర్రను పొయ్యిలో పెట్టేందుకు కర్రను చీల్చి చూసినప్పుడు; అందులోంచి వెయ్యి బంగారు నాణాలు నేలపై రాలిపడ్డాయి. అందులో ఉన్న ఉత్తరాన్ని చదివాక అతనికి అసలు విషయం అర్థమయ్యింది. తర్వాత కొంతకాలానికి మళ్లీ ఆ వ్యక్తి అప్పు తీర్చే ఉద్దేశంతో వ్యాపారి ఇంటికి వెళ్లాడు. ‘‘దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఆరోజు నీకిచ్చిన మాటప్రకారం అప్పు తీర్చే ఉద్దేశంతో సముద్ర తీరానికి చేరుకున్నాను. కానీ పడవలు అందుబాటులో లేకపోవడంతో నీదాకా రాలేకపోయాను.
ఇప్పుడు నీ అప్పును నయా పైసాతో సహా చెల్లిస్తున్నాను. అందుకో’’ అంటూ బంగారు నాణేల సంచిని అందించబోయాడు. ‘‘నువ్వు ఆరోజు సముద్రంలో నాకోసం కర్రలో పెట్టి పంపిన నాణాలు నాదాకా చేరాయి. మళ్లీ ఎందుకు’’ అంటూ తిరిగి ఇచ్చేశాడు. ‘‘ఆరోజు నీకిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వేరే మార్గంలేక సముద్రంలో కర్రలో పెట్టి వదిలాను. అవి నీకు ఇంకా చేరలేదేమోనని’’ ఆ వ్యక్తి చెప్పాడు. అప్పు తిరిగి ఇచ్చే ఉద్దేశంతో తీసుకుంటే రుణం తీర్చడంలో అల్లాహ్ తోడ్పడతాడన్నది ఈ గాథలో నీతి. రుణదాతలైనా, రుణ గ్రహీతలైనా మంచి మనస్సు కలిగి ఉండాలన్నదే ఇందులోని సందేశం.
– ముహమ్మద్ ముజాహిద్
Comments
Please login to add a commentAdd a comment