
ఒక అడవిలో ఆ సంవత్సరం ఎన్నడూ లేనంత భయంకరమైన చలి వ్యాపించి అనేక జంతువులు, జీవాలు చనిపోయాయి. నాయకుడికి తమ జాతిని రక్షించాల్సిన బాధ్యత ఏర్పడింది. ‘‘చలి అధికంగా వుండే రాత్రివేళల్లో మీరంతా ఒకరికొకరు వెచ్చగా ఉండేలా మూకుమ్మడిగా గడిపితే గాలి దూరే సందు లేక చలి ఉండదని, తెల్లారే వరకు ప్రాణాలు నిలుపుకుంటే, సూర్యుడి వెలుగుతో వేడి జనించి సౌకర్యంగా ఉండొచ్చని’’ చెప్పింది తమ వాళ్ళకి. ముళ్ళ పందులన్నీ ఆ సూచన పాటించాయి.
సందు లేకపోవడంతో రాత్రంతా వేడి పుట్టి ప్రాణం నిలబెట్టుకున్నాయి పందులు. కొన్ని ముళ్ళపందులు తోటి పందుల ముళ్ళు తగిలి ఇబ్బంది కలిగినట్టు నాయకుడికి ఫిర్యాదు చేసాయి. ‘‘చలి తట్టుకుని ప్రాణం నిలుపుకోవడం ముఖ్యం కాబట్టి ఇబ్బందిని మరచిపోయి సర్దుబాటు చేసుకుంటే మీ ప్రాణాలు నిలబడతాయి. ఇబ్బంది భరించలేమని అనుకుంటే మీ ఇష్టం’’ అంది నాయక పంది. ముళ్ళ పందులు సర్దుకుపోయి ప్రాణాలు నిలుపుకున్నాయి. సమాజంలో బతకాలంటే ఇరుగు పొరుగుల వేధింపులు, సాధింపులు, వెక్కిరింపులు, అవమానాలు, అనుమానాల ముళ్ళు గుచ్చుకుంటూనే వుంటాయి. సర్దుకుపోతే సమస్యలన్నీ తీరిపోతాయి. సమాజంలో జీవించడం సులభమౌతుంది.
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు