కరోనా కారణంగా వేలకొలదీ వివాహాలు వాయిదా పడ్డాయి. జూమ్ ఆప్‌లో చాలామంది జంటలు ఉంగరాలు మార్చుకుంటున్నారు. బంధువులు, స్నేహితులు సైతం జూమ్‌లోనే శుభాకాంక్షలు అందచేస్తున్నారు. పెళ్లయితే చేసుకోలేరు కదా... గోల్డీది అదే పరిస్థితి. వివాహం గురించి కలలు కన్న గోల్డీ వయసు 20 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉంటుంది. కనౌజ్‌లో ఉండే వీరేంద్ర కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. మే 4వ తేదీకి ముహూర్తం నిశ్చయించారు. లాక్‌డౌన్ కారణంగా అనివార్యంగా వివాహం వాయిదా పడింది. వివాహం నిశ్చయమైన నాటి నుంచి ఇద్దరి ఇళ్లకు రాకపోకలు సాగుతున్నాయి. లాక్‌డౌన్ తరవాత ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఒకసారి కాదు రెండుసార్లు వీరి వివాహం వాయిదా పడటంతో, వారికి నిరాశగా అనిపించింది.
ఇప్పుడు లాక్‌డౌన్ సడలించిన తరవాత, తమ వివాహం జరిపించమని తల్లిదండ్రులను కోరింది. వారు అక్కరలేని అభ్యంతరాలు చెప్పడంతో మరోమారు వాయిదా పడింది. ఇక లాభం లేదనుకుని, తన వివాహం తానే చేసుకోవాలనుకుని సంకల్పించుకుంది. బుధవారం మధ్యాహ్నం గోల్డీ కాన్పూర్‌లోని లక్ష్మణ్‌పూర్ తాలూకాలోని గ్రామం నుంచి కనౌజ్‌కు నడక ప్రారంభించింది. 80 కి.మీ. నడిచింది. కనౌజ్ చేరింది. చెప్పాపెట్టకుండా గోల్డీ రావటంతో, వారి వివాహం వెంటనే చేయక తప్పలేదు వీరేంద్రకుమార్ తల్లిదండ్రులకు. ఒక పాత దేవాలయంలో వీరి వివాహానికి ఏర్పాట్లు చేశారు. భౌతిక దూరం పాటించారు. ఇద్దరూ మాస్కులు ధరించారు. పెళ్లికూతురు ఎరుపు రంగు చీర, పెళ్లికొడుకు తెల్లరంగు డెనిమ్ చొక్కా ధరించారు. ఈ వివాహానికి ఒక సోషల్ వర్కర్ కూడా హాజరయ్యారు. ఏది ఏమైతేనేం, గోల్డీ రుక్మిణి కంటె ఘనురాలే. ఆవిడ రథం మీద పారిపోతే, ఈ అమ్మాయి తన పాదాలనే నమ్ముకుంది.
Comments
Please login to add a commentAdd a comment