దితీ లాహిరి (ఎడమ), మార్షనీల్ సిన్హా (కుడి)
‘రక్తం నీటి కంటే చిక్కనైనది, అందుకే రక్త సంబంధం ముందు మరే బంధమూ నిలవలేదు’..ఇదీ ఇప్పటి వరకు మనం నమ్ముతున్న నిజం. ఇప్పుడు మరో నిజం ఈ నానుడిని తుడిచి పెట్టేసింది. కుటుంబ బంధం చేయలేని పనిని ఆఫీస్‌లో సహోద్యోగి చేసింది. కొలీగ్ మార్షనీల్ సిన్హా కోసం కిడ్నీ ఇచ్చేసింది దితీ లాహిరి!
మార్షనీల్ సిన్హాది జార్ఖండ్‌లోని బొకారో. ఆమె బెంగళూరులో ఐటీసీ ఇన్‌ఫోటెక్‌లో ఉద్యోగి. ఆమె తరచూ అనారోగ్యం పాలవుతుంటే మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ కిడ్నీలు విఫలమయ్యాయని తెలిసినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె అలాగే ఉద్యోగం చేస్తోంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మార్షనీల్ మనోధైర్యానికి ఆశ్చర్యపోయారు. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఆఫీస్‌లో పూర్తి సమయం సీట్లో కూర్చోవడం కూడా కష్టంగా మారింది. అప్పుడు ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఇంటి నుంచి ఆఫీస్ పని చేయడానికి)కు అనుమతించింది సంస్థ. సొంతూరు బొకారోకి వెళ్లి పోయి ఇంటి నుంచే ఉద్యోగం చేసింది మార్షనీల్. ఆమెకి అప్పగించిన ప్రాజెక్ట్ గురించి తరచూ ఫోన్‌లో కాంటాక్ట్‌లో ఉండేది దితీ లాహిరి. మార్షనీల్ డయాలసిస్ చేయించుకుంటూ కూడా ఆఫీస్ పని చేస్తోందని తెలిసినప్పుడు లాహిరి కదిలిపోయింది. అప్పుడడిగింది మార్షనీల్‌ని పూర్తి వివరాలు చెప్పమని.
మార్షనీల్‌కి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలని చెప్పారట డాక్టర్లు! ఆమెకు కిడ్నీ ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు, కానీ వాళ్లిద్దరికీ ఆరోగ్య సమస్యలున్నాయి. కాబట్టి కిడ్నీ ఇవ్వగలిగిన పరిస్థితి కాదు వారిది. ఇక మిగిలింది మార్షనీల్ అక్క. ఆమె కూడా సిద్ధంగానే ఉంది. అయితే అత్తగారింట్లో ససేమిరా అన్నారు. ఆ ఇంటికి కోడలయ్యాక ఇక ఆమె దేహం మీద అధికారాలు కూడా తమవే అన్నట్లుంది వాళ్ల ధోరణి. మార్షనీల్ సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోనూ కిడ్నీ దాతల కోసం అభ్యర్థించింది. ప్రయత్నాలైతే జరిగాయి కానీ కిడ్నీ ఇచ్చే దాత దొరకలేదు. అదీ ఆమె పరిస్థితి. అప్పుడు మార్షనీల్ మెడికల్ రిపోర్టులను తెప్పించుకుని తనకు తెలిసిన డాక్టర్‌ను సంప్రదించింది లాహిరి. ఆ డాక్టర్ కూడా కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని చెప్పడంతో.. తన కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైంది!
నిబంధనలు కఠినతరం
మార్షనీల్ కోసం కిడ్నీ ఇచ్చే దాత దొరకడమే కష్టం అనుకున్నారు అప్పటి వరకు. ప్రభుత్వ నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయనేది లాహిరి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన తర్వాత తెలిసింది. రక్తసంబంధీకులు కాకుండా మరెవరి నుంచయినా కిడ్నీ తీసుకోవాల్సి వస్తే లెక్కకు మించినన్ని నియమాలు. అంతకంటే ఎక్కువ దర్యాప్తులు. అవయవాల అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించిన నేపథ్యంలో నిబంధనలు ఎక్కువయ్యాయి. తాను స్వచ్ఛందంగానే కిడ్నీ ఇవ్వదలచుకున్నట్లు పోలీసులకు అఫిడవిట్ దాఖలు చేసింది లాహిరి. ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. కలెక్టర్‌కు తనకు సంబంధించిన పూర్తి వివరాల డాక్యుమెంట్లను సమర్పించింది. మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఇందుకోసం తొమ్మిది నెలలు పట్టింది. ఇవన్నీ పూర్తి చేసుకుని హాస్పిటల్‌కు వెళ్లిన తరవాత అక్కడ ‘తన కిడ్నీని మార్షనీల్ కోసం ఇవ్వదలుచుకున్నానని, డాక్టర్లు తన దేహం నుంచి కిడ్నీ తీసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని సంతకం చేసింది. ఇదంతా పూర్తయి ఈ నెల మూడవ తేదీన కోల్‌కతాలోని ఫోర్టిస్ హాస్పిటల్ అండ్ కిడ్నీ ఇన్‌స్టిట్యూట్‌లో లాహిరికి, మార్షనీల్‌కి సర్జరీ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైందని, ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరగా కోలుకుంటున్నారని ప్రకటించారు డాక్టర్లు.
అమ్మను చూస్తున్నాను
మార్షనీల్ ఎంతో తెలివైన అమ్మాయి. చక్కటి వ్యక్తిత్తం ఆమెది. ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి అనారోగ్యం పాలవడం బాధనిపించింది. అలా దయనీయ స్థితిలో ప్రాణాలు పోతాయని తెలిసీ చూస్తూ ఊరుకోలేకపోయాను. నా నిర్ణయం విన్న వెంటనే అమ్మానాన్న విచిత్రంగా చూశారు. మా అమ్మ స్కూలు టీచరుగా పనిచేసి రిటైరైంది. ఆమె త్వరగానే అర్థం చేసుకుంది. మరో విషయం ఏమిటంటే... అమ్మ చాలా ఏళ్లుగా ఒక కిడ్నీతోనే జీవిస్తోంది. మా కంటే చురుగ్గా ఉంటుంది కూడా. అందుకే నాకు ఆరోగ్యం పట్ల భయం లేదు.
– దితీ లాహిరి, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ఇన్‌ఫోటెక్, బెంగళూరు
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment