పుట్టుకతో వచ్చిన ముఖ ఆకారాన్ని ఫేషియల్ సర్జరీ చేసి సరిచేసిన దృశ్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఒకప్పుడు పుచ్చిన దంతాన్ని పీకే దంత వైద్యులుగానే పరిమితమైన వీళ్లు.. నేడు ఫేషియల్ రీ ప్లాంటేషన్ చేసే స్థాయికి ఎదిగి వైద్య రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ప్రమాదాల్లో ముఖం, దవడ ఎముకలు విరిగినా, నుదురు, తల ఎముకలకు పగుళ్లు వచ్చినా చికిత్స చేస్తూ ట్రామాకేర్ బృందంలో ముఖ్య సభ్యులుగా మారారు. నేడు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం
⇔ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వరుణ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలకు చికిత్స తీసుకుని, కోలుకున్నాడు గానీ, దవడ ఎముకలు విరగడంతో ముఖం మునుపటి రూపును కోల్పోయింది. అద్దంలో చూసుకుంటే తనను తానే గుర్తుపట్టలేని విధంగా తయారవ్వడంతో డిప్రెషన్‌కు గురయ్యాడు. తెలిసినవారి సలహాతో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్‌ను సంప్రదించాడు. కొద్దిరోజుల్లోనే తన మునుపటి స్థితిని మరలా పొందగలిగాడు.
⇔ గుంటూరు నగరానికి చెందిన ఎస్తేరు, తను బాల్యంలో గ్రహణంమొర్రి వ్యాధికి గురవడంతో, ముక్కు, నోరు వంకరపోయింది. బాల్యం నుంచి వేధిస్తున్న సమస్య తన వయసుకు లాగానే పెరిగి పెద్దదయింది. దీంతో అందంగా లేనని ఆత్మన్యూనత భావానికి గురయి, నలుగురిలో కలవలేకపోయేది. రోజూ అద్దంలో చూసుకుని మధనపడేది. తమ పాప బాధ చూడలేక పేరెంట్స్ ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ద్వారా లోపాన్ని సవరించగలిగారు.
సాక్షి, లబ్బీపేట(విజయవాడ): కృష్ణా, గుంటూరు జిల్లాలో సుమారు 50 మంది వరకూ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ సేవలు అందిస్తున్నారు. వీరిలో 30 మంది విజయవాడలోనే ఉన్నారు. నిత్యం ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరిగిన వారికి ఏడాదికి ఐదు వందల మందికి పైగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండగా, పొగాకు ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్ వచ్చిన 500 నుంచి 600 మందికి వీరు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సరిచేస్తున్నారు. ప్రమాదాల్లో దవడ ఎముకలతో పాటు కాస్మోటిక్ ఫేషియల్ సర్జరీలు, ఫేషియల్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీలు, ఫేస్ లిఫ్ట్, రైనో ప్లాస్టీ, బొటాక్స్, డెర్మో ఫిల్లర్స్ ద్వారా ముఖంపై ముడతలు తొలగించడం వంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫేషియల్ అంకాలజీ, గ్రహణం మొర్రి ఆపరేషన్‌లు, ప్రమాదాల్లో పళ్లు ఊడిన వారికి ఇంప్లాంట్ విధానంలో దవడ ఎముకకు శాశ్వత దంతాలు అమర్చుతున్నారు.
కొత్త పుంతలు తొక్కుతున్న వైనం
ఇప్పటి వరకూ గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అందరికీ తెలిసిందే. సరికొత్తగా ముఖాన్నే మార్చే ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది కిందట జరిగిన అంతర్జాతీయ సదస్సులో విజయవంతంగా ఫేషియల్ రీ ప్లాంటేషన్ చేసిన కేసుపై విశ్లేషణ చేయడం జరిగిందని వైద్యులు చెపుతున్నారు. ఒకప్పుడు పుచ్చిన దంతం పీకే వైద్యులుగా ఉన్న ఫేషియల్ సర్జన్‌లు నేడు ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే స్థాయికి ఎదిగారు. పుట్టుకతోనే ముఖం అందవిహీనంగా వున్న వారికి ఫేషియల్ సర్జరీలతో రూపురేఖలు మార్చేస్తున్నారు. దవట ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా వున్నా, ముక్కు వంకరగా ఉన్నా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ వాటిని సరిదిద్దేస్తున్నారు.
ఫేషియల్ సర్జన్ ప్రాధాన్యత పెరిగింది
ప్రస్తుతం వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్‌లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రమాదాల్లో దవడ, ముఖ ఎముకలు విరిగిన వారికి అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వబోధనాస్పత్రిల్లోని ట్రామాకేర్ బృందంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్‌లను నియమిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిత్యం యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతూ, ముఖ ఎముకలు విరిగి, ప్రవేటు ఆస్పత్రిలకు చికిత్సకోసం వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో అందుబాటులోకి తీసుకువస్తే మంచిది. గ్రహణం మొర్రి శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారు.
– డాక్టర్ మెహబూబ్ షేక్, ప్రొఫెసర్, ఓరల్‌అండ్ మాక్సిల్లో ఫేషియల్ విభాగం
రోడ్డు ప్రమాదంలో ముఖానికి గాయాలైన యువకుడికి సర్జరీ చేసి మునుపటి స్థితికి తెచ్చిన వైనం
Comments
Please login to add a commentAdd a comment