సాక్షి, హైదరాబాద్: ఈ ఫొటోలోని వ్యక్తి పేరు మను.. కేరళలోని కొచ్చికు చెందిన ఆయన రైలు ప్రమాదంలో రెండు చేతులనూ కోల్పోయారు. చాలా కాలంపాటు కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికాడు. కానీ ఇప్పుడు ఆయనకు రెండు చేతులూ ఉన్నాయి. అందరిలాగే తానూ పనిచేసుకుని బతుకుతున్నాడు. కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఆయనకు ఈ కొత్త జీవితాన్ని కల్పించింది.
ఈ ఆస్పత్రికి చెందిన తల, మెడ, ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విభాగాధిపతి సుబ్రమణ్యం అయ్యర్ దేశంలోనే తొలిసారిగా మనుకు చేతి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఒక వ్యక్తికి చెందిన రెండు చేతులను తీసుకుని మనుకు అమర్చారు. ఇందుకోసం క్లిష్టమైన సర్జరీ చేయడంతోపాటు ఆరు నెలల పాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మను తన ‘కొత్త’చేతులను మామూలుగా వినియోగించడం మొదలుపెట్టారు. ఈ చేతి మార్పిడి తర్వాత.. మరెంతో మంది ఇలాంటి చికిత్సల కోసం వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు.
కొన్ని ఆస్పత్రుల్లోనే ఈ చికిత్సలు
మన దేశంలో కిడ్నీ, లివర్, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చాలా ఆస్పత్రులలో జరుగుతున్నాయి. కానీ ఏదైనా ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయిన వారికి ఇతరుల చేతులను అమర్చే శస్త్రచికిత్సలు ఐదారు ఆస్పత్రుల్లో మాత్రమే జరుగుతున్నాయి. అందులో మొట్టమొదటగా కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో జరిగింది.
ఎక్కువ చికిత్సలూ అక్కడే చేశారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 40 మంది రోగులకు చేతులు మార్పిడి చేయగా.. అందులో 14 మంది రోగులకు అమృత ఆస్పత్రిలోనే జరిగాయి. ఈ 14 మందికి కలిపి 26 చేతులను మార్పిడి చేశారు. ఇద్దరికి భుజాలు దెబ్బతినడంతో ఒక్కో చేతిని మాత్రమే మార్పిడి చేశారు. ఇలాంటి ఇన్ని చికిత్సలు చేయడం ప్రపంచంలోనే అమృత ఆస్పత్రిలో ఎక్కువని అక్కడి వైద్యులు చెప్తున్నారు.
నాలుగు వైద్య బృందాలతో..
చేతుల మార్పిడి శస్త్రచికిత్స కోసం నాలుగు వైద్య బృందాలు కలిసి పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. రెండు బృందాలు రోగికి చేతిని అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తాయని.. మరో రెండు బృందాలు బ్రెయిన్‌డెడ్ వారి నుంచి చేతులను తీసుకోవడానికి సిద్ధం చేస్తాయని వివరించారు. మొత్తంగా దాదాపు 16 గంటల పాటు శస్త్రచికిత్స జరుగుతుందని.. తర్వాత రోగి కొన్నినెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ఫిజియో థెరపీ, ఇతర చికిత్సలతో అమర్చిన అవయవం సరిగా పనిచేస్తుందో లేదో చూస్తారని వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికే చెయ్యి మార్పిడి చేయవచ్చని, చికిత్సకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు.
నాలుగు రోజుల్లో పనిచేయడం మొదలవుతుంది
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచే వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు చేతులను స్వీకరిస్తాం. ఆ వ్యక్తి, అమర్చే వారి బ్లడ్ గ్రూప్ ఒకటే అయి ఉండాలి. చెయ్యి మార్పిడి చికిత్స చేసిన నాలుగు రోజుల్లో రోగి ‘కొత్త’చేతులతో మంచినీటి గ్లాసు పట్టుకోగలరు. పూర్తి స్థాయిలో చెయ్యి పనిచేయాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులకు అవసరమైన మేర అవయవాలు దొరకడం లేదు. బ్రెయిన్‌డెడ్ అయిన పేషెంట్ల కుటుంబ సభ్యులు దానానికి ముందుకు రావాలి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన రావాల్సి ఉంది.
– డాక్టర్ సుబ్రమణ్యం అయ్యర్, అమృత ఆస్పత్రి వైద్యుడు
చెయ్యి తెగితే.. మరొకరి చెయ్యి అతికిస్తారిక్కడ
Published Tue, Jun 6 2023 5:03 AM | Last Updated on Tue, Jun 6 2023 3:00 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment