QR code on tomb tells the story of young doctor in Kerala - Sakshi
Sakshi News home page

25 ఏళ్లకే కొడుకు ఆకస్మిక మరణం! సమాధిపై క్యూఆర్‌కోడ్‌తో తండ్రి నివాళి

Published Wed, Mar 29 2023 9:56 AM | Last Updated on Wed, Mar 29 2023 10:54 AM

QR Code On Tombstone Tells The Story Of Young Doctor In Kerala - Sakshi

జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోదు. ఎక్కడో ఒక చోట ఒక అగాధాన్నో లేక విషాధాన్నో ఒక పరీక్షలా పెడతాడేమో దేవుడు. మనిషి సహనానికి పరీక్ష లేక ఇంకేదైనా గానీ దాన్నుంచే కొత్త ఆలోచనలు లేదా కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి ఒక్కొసారి. ఇక్కడ ఒక తండ్రి విషాధ గాథలో కూడా అలానే చోటు చేసుకుంది. అన్నింటిలోనూ అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు ఆకస్మిక మరణం తన జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసింది. అదే అతన్ని తన కొడుకు గురించి ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు పురిగొల్పింది. అందులోంచి పుట్టుకొచ్చిందే సమాధిపై క్యూఆర్‌కోడ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన. అసలు ఏంటి ఇది? డిజిటల్‌ చెల్లింపులకు ఉపయోగించే క్యూఆర్‌ కోడ్‌ సమాధిపై ఎందుకు? ఎందుకోసం ఇలా అని అందరిలోనే ఆలోచనలు రేకెత్తించేలా చేశాడు కొడుకుని కోల్పోయిన తండ్రి.  

అసలేం జరిగిందంటే..కేరళలోని త్రిస్సూర్‌ జిల్లా కురియాచిరాకు చెందిన ఫ్రావిన్స్‌ అనే వ్యక్తికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన వృత్తిరీత్యా ఒమన్‌లోని ఐబీఎం కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలు కేరళలోని కురియాచిరాలో ఉంటారు. ఐతే కొడుకు ఐవిన్‌ ప్రావిన్స్‌ చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటల్లోనూ, సంగీతంలోనూ టాపర్‌. ఏ కాంపిటీషన్‌లో పోటీ చేసిన ప్రైజ్‌ అతడిదే. ఎంబీబీఎస్‌ చేశాడు. కోజికోడ్‌లోని మలబార్‌ మెడికల్‌ కాలేజీలో జనరల్‌ డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు కూడా. అలాగే కూతురు ఒక పెద్ద కార్పోరేటర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ..నెలకు లక్షరూపాయాల దాక సంపాదిస్తోంది. ఒక తండ్రికి ఇంతకంటే కావల్సింది ఏమి లేదు కూడా.

ఇక అతను కూడా ఉద్యోగానికి రిజైన్‌ చేసి ఇండియా వచ్చి సెటిల్‌ అయిపోవాలనుకున్నాడు. ఇక కూతురు పెళ్లి కూడా చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒకరోజు ప్రావిన్స్‌ తన బాస్‌తో మీటింగ్‌లో ఉండగా తన కూతురు ఎవెలిన్‌ ఫ్రాన్సిస్‌ నుంచి పదే పదే కాల్స్‌ వచ్చాయి. ఫ్రావిన్స్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో ప్లీజ్‌ డాడీ అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్‌ లిఫ్ట్‌ చేయండి అని ఒక మెసేజ్‌ పెట్టింది కూతురు. దీంతో మీటింగ్‌ మధ్యలోనే బయటకు వచ్చి కాల్‌ చేయగా.. అన్నయ బ్యాడ్మింటన్‌ ఆడుతూ చనిపోయాడని చెబుతుంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఫ్రాన్సిస్‌. అతడి బాస్‌ ఈ విషయం తెలసుకుని అతడిని ఓదార్చి.. ఇండియా వెళ్లేందకు ఫ్లైట్‌ టికెట్టు ఏర్పాటు చేసి మరి పంపించాడు. ఎంతో హాయిగా సాగిపోతున్న తన జీవితంలో కొడుకు మరణం అతన్ని దారుణంగా కుంగదీసింది. కోలుకోవడానికే నెల పట్టింది.

25 ఏళ్లకే చిన్న వయసులో మరణించిన కొడుకు ఐవిన్‌ 100 ఏళ్లకు సాధించే అన్ని విజయాలను అతను సాధించాడు. తన కొడుకు ఐవిన్‌కి వచ్చిన అవార్డులు, రివార్డులు పెట్టడనినకి ఒక గది కూడా సరిపోదు. అలాంటి అత్యంత ప్రతిభావంతుడైన కొడుకు గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలనుకున్నాడు. వాస్తవానికి ఐవిన్‌ ఎంత ప్రతిభావంతుడంటే గిటార్‌ దగ్గర నుంచి బ్యాడ్మింటన్‌, కబడ్డీ వరకు అన్నింటిల్లోనూ టాపర్‌. కొత్త కొత్త ఆవిష్కరణలంటే అతనికి అత్యంత ఇష్టం. పైగా వ్యక్తుల ప్రోఫైల్స్‌తో క్యూఆర్‌ కోడ్‌లు క్రియేట్‌ చేస్తాడు కూడా. అంతేగాదు తన తండ్రి పనిచేస్తున్న ఐబీఎం కంపెనీ కొత్త టెక్నాలజీని తీసుకురాకమునుపే తన తండ్రిని ఆ టెక్నాలజీ గురించి అప్రమత్తం చేసేవాడు. అలాంటి తన కొడుకు చిన్న వయసులో మరణించడం అనేది ఏ కుంటుంబానికైనా కోలుకోలేని వ్యధే.

అందుకే అతడి  గురించి, తన టాలెంట్‌ గురించి తెలసుకునేలా.. అతడి జీవితాన్నే సమాధిపై పొందుపర్చాలనుకున్నాడు ఫ్రాన్సిస్‌. ఒకవైపు సెయింట్‌ జోసఫ్‌ చర్చి వద్ద అతడి సమాధి నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అయితే అతడి గురించి, అతని సాధించిన విజయాల గురించి సమాధిపై రాయించడానికి ప్లేస్‌ సరిపోదని కూతురు ఎవెలిన్‌ చెప్పింది. అందుకని తన అన్నయ్య క్రియేట్‌ చేసిన క్యూఆర్‌ కోడ్‌తోనే ఇది చేయాలనే ఆలోచనకు వచ్చింది. దానికోసం అతడి అన్నయ్య ప్రోఫెల్‌తో వెబ్‌ పేజి క్రియేట్‌ చేసి..దాంట్లో అతడి సాధించిన విజయాలు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపిన క్షణాలన్నింటిని పొందుపరిచారు.

ఈ వెబ్‌పేజిని క్యూఆర్‌ కోడ్‌కి లింక్‌ చేసి ఐవిన్‌ సమాధిపై ఏర్పాటు చేశారు అతడి కుటుంబ సభ్యులు. దీన్ని చూసిన అక్కడి వాళ్లంతా సమాధిపై క్యూఆర్‌ కోడ్‌ ఏంటి అని స్కాన్‌ చేసి చూసేందుకు ఆసక్తి కనబర్చడమే గాక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సమాధిపై ఐవిన్‌ ఫోటో, దిగువన జనన, మరణ తేదిలు, కింద అడాప్ట్‌ అనే ఒక పదం దానికింద ఈ క్యూఆర్‌కోడ్‌ ఉంటుంది. అడాప్ట్‌  అంటే ఏదైనా కొత్త సాంకేతికను స్వీకరించడం అని అర్థం. అదే ఐవిన్‌ నినాదం కూడా. కొత్త సాంకేతికకు ఎప్పటికప్పుడూ అడాప్ట్‌ అయిపోతుండాలని ఐవిన్‌ చెబుతూ ఉండే వాడని అతడి తండ్రి ఫ్రాన్సిస్‌ చెబుతున్నారు.

(చదవండి: కర్నాటక అసెంబ్లీ ఎలక్షన్స్‌: నేడు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement