సంపదను వీడి సన్యాసం తీసుకుంది!
వీక్షణం
ఎంత ఆధునికంగా తయారవుదాం, ఎంత విభిన్న తరహాలో ఎంజాయ్ చేద్దాం అంటూ ఆలోచించే యువత ఉన్న ఈరోజుల్లో... అందుబాటులో ఉన్న సౌకర్యాలన్నీ వద్దనుకుని... సన్యాసం పుచ్చుకుందో యువతి.
చైనా లోని జినన్ పట్టణానికి చెందిన టింగ్ అనే ఇరవై నాలుగేళ్ల యువతి... లగ్జరీ గూడ్‌స డిజైనింగ్‌లో శిక్షణ పొందు తోంది. సౌకర్యవంతమైన జీవితం, సరదాలు, షికార్లు... ఏ కొదువా లేదామెకి. అయితే ఏమయ్యిందో ఏమో... ఉన్నట్టుండి అన్నీ కట్టిపెట్టేసింది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం మానేసింది. బయట తిరగడం ఆపేసింది.
ఉన్నట్టుండి ఓరోజు మాయమైపోయింది కూడా! ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే... ఓ కొండ మీద కూర్చుని ధ్యానం చేసుకుంటోంది. గుండుతో, బౌద్ధ సన్యాస వస్త్రాలతో ఉన్న ఆమెను చూసి అవాక్కయ్యి ఏమిటిదంతా అంటే... ‘నాకు మనిషి పుట్టుక, మనుగడ, మరణాల లోతుల్ని తెలుసుకో వాలని ఉంది, ఈ ప్రపంచమంతా అసహజంగా, అవాస్తవంగా అనిపిస్తోంది, నన్ను వదిలేయండి’ అందట! ఎంత చెప్పినా వినకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు మౌనంగా ఉండి పోయారు. దాంతో పూర్తిగా బౌద్ధ సన్యాసిలా మారిపోయి, ధ్యానం చేసుకుంటూ గడిపేస్తోంది!