
వాషింగ్టన్ : ధ్యానంతో గుండెజబ్బులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. గుండె జబ్బులతో బాధపడేవారు ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి వైద్యంతో పాటు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే ముప్పు తగ్గుతుందని అమెరికా పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాలం పాటు ధ్యానం చేసిన వారి మెదడు పనితీరు ఎలా ఉంటుంది..? గుండె జబ్బులను తగ్గించే క్రమంలో ధ్యానం ఉపయోగపడుతుందా? అనే దానిపై అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన పరిశోధకులు పలు సమీక్షలు జరిపిన తర్వాత తాజా నిర్ణయానికి వచ్చారు. మామూలుగా కూర్చుని చేసే ధ్యానం వల్ల గుండె సంబంధ వ్యాధులు, పనితీరుపై ప్రభావాన్ని గుండెజబ్బుల నిపుణులు పరిశీలించారు. దీనిలో తాయిచి, యోగా వంటి వాటితో గుండె జబ్బుల ముప్పు తగ్గుతున్నట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. విపాసన, జెన్, రాజయోగ వంటి పద్ధతులను ఆచరించే వారిని పరిశీలించగా వారిలో ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు స్థాయిలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అంతేకాదు, కంటినిండా నిద్ర పోవటంతో పాటు మంచి జీవనం గడుపుతున్నట్లు తేలింది.
రక్తపోటు స్థాయిలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. అయితే, ఎంతమేరలో రక్తపోటు తగ్గుతుందనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. అంతేకాదు, గుండె జబ్బులకు ప్రధాన కారణంగా భావించే పొగతాగే అలవాటు కూడా ధ్యానం వల్ల తగ్గినట్లు తేలింది. మొత్తమ్మీద గుండెజబ్బు బాధితులను ప్రమాదం నుంచి కాపాడే ఒక సాధనంగా ధ్యానాన్ని గుర్తించవచ్చని వెల్లడించారు. ‘ఏ ప్రాంతానికి చెందిన వారికైనా ధ్యానం అనుకూలమైన విధానం. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుబాటులో ఉన్న రకరకాల పద్ధతుల్లో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. చక్కని జీవన విధానం, వైద్య చికిత్సలతో పాటు ధ్యానం ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయి.’ అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ పేర్కొంది. క్రీస్తు పూర్వం 5000 వ సంవత్సరం నుంచి వివిధ పద్ధతుల్లో ధ్యానాన్ని ప్రజలు ఆచరిస్తున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. దీనికి పలు మతాలు, తాత్విక ఆలోచనలతో సంబంధాలున్నాయి. అయినప్పటికీ లౌకిక విధానంగా, ఒక వైద్య విధానంగా కోట్లాదిమంది ఆచరిస్తున్నారు.