బ్రిటన్ అంతఃపుర తోడికోడళ్లు మేఘన్ మార్కెల్, కేట్ మిడిల్టన్
బ్రిటన్ రాచకుటుంబంలోకి కొత్తగా ఎవరు అడుగు పెట్టినా అంతఃపుర సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవలసిందే. ఏం తినాలి, ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎలా మాట్లాడాలి... ఇలా ప్రతి విషయంలోనూ ఆచారం, వ్యవహారం ఉంటుంది. ఇవి కాకుండా మరికొన్ని నిబంధనల్ని స్వయంగా బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ విధిస్తారు. మొదటిది వస్త్రధారణ. అందుకు తగ్గట్లుగా మహారాణి దగ్గరకు వెళ్లేటప్పుడు ఆ కుటుంబంలోకి కొత్తగా వెళ్లిన మేఘన్ మార్కల్ (ప్రిన్స్ హ్యారీ భార్య) ఇప్పుడు ఎత్తు చెప్పులు ధరించడం లేదు. మార్కల్‌కు ఎత్తు చెప్పులంటే ఇష్టం అయినప్పటికీ రాణి గారికి ఇష్టం లేదు. అందుకే అధికార కార్యక్రమాలలో రాణిగారు లేని సమయంలో మాత్రమే తోడికోడళ్లిద్దరూ ఎత్తుచెప్పులు వేసుకుంటున్నారు. గత మే నెలలో మేఘన్ రాజప్రాసాదంలోకి ప్రవేశించాక, ఎత్తు చెప్పులతో ఫొటోలకు చిక్కలేదు కానీ ఇటీవల తన తెలియనితనంతో రాయల్ ఫ్యామిలీ ఆగ్రహానికి గురికావలసి వచ్చింది!
బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘన్ రెండు తప్పులు చేసినట్లుగా గుర్తించారు. ఆ కార్యక్రమంలో రాణిగారు ఆసీనులై ఉన్న వరుసలోనే కూర్చున్న మేఘన్ కాలు మీద కాలు వేసుకోవడం ఒక తప్పు. అయితే చాలా త్వరగానే ఆమె తన తప్పును సరిచేసుకున్నారు. ఇంకో తప్పేమిటంటే.. రాణి గారు ఉండగానే ప్రిన్స్ హ్యారీ చేతిని తన చేతిలోకి తీసుకోవడం. దీనిపై ఇప్పుడు బ్రిటన్‌లో పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ‘తెలియని పిల్ల’ అని రాణిగారు సరిపెట్టుకున్నట్లున్నారు. మేఘన్ రాజకుటుంబంలో కొత్త సభ్యురాలయ్యాక తెలుసుకున్న ఇంకో సంగతి ఏంటంటే.. భోజనంలో వెల్లుల్లి తీసుకోకూడదు. నలుగురితో కలిసి తింటున్నప్పుడు వెల్లుల్లి వాసన రాకూడదనే ఈ నిషేధం విధించారు. అయితే మేఘన్ తాను ఒంటరిగా భోజనం చేసేటప్పుడు కావలసినంత వెల్లుల్లి తినడానికి అనుమతి ఉంది. ఇలాంటి వాటన్నిటికీ ఇప్పుడిప్పుడే మేఘన్ అలవాటుపడుతున్నారు.
– రోహిణి
Comments
Please login to add a commentAdd a comment