
సలి కోటు...
మెట్రో కథలు
సలిగా ఉందా సిన్నీ అంది.
వాడేం మాట్లాడలేదు. తల్లికి తెలియకూడదు అని అనుకున్నాడేమో లోపల ఉన్న వొణుకును అణచుకోవడానికి చూశాడు. కాని బక్కగా ఉన్న పక్కటెముకలు కొంచెం అదిరాయి. ఏడేళ్ల పిల్లవాడు. సన్నగా బలహీనంగా అయిదేళ్ల పిల్లవాడిలా కనిపిస్తున్నాడు.
సలిగా ఉందా నాయనా అని మళ్లీ కొంచెం దగ్గరికి జరిగి మొత్తం శరీరాన్ని ఒంటికి కరుచుకుని ఒంట్లో ఉన్న వేడి ఇవ్వడానికి చూసింది.
కళ్లు మూసుకుని ఉన్నాడు.
పెదాలు కొంచెం ఎండిపోయి ఉన్నాయి.
గాలి ఒదులుతుంటే ముక్కు నుంచి వేడిగా వచ్చి తగులుతూ ఉంది.
బయట లారీలు చాలా వేగంగా అప్పుడొకటి అప్పుడొక్కటి వెళుతున్న రొద తప్ప చీమ చిటుక్కుమనడం లేదు. కాంట్రాక్టర్‌కి స్థలం చూపవయ్యా అంటే ఇదే చూపించాడు. మైదానం. ఇక్కడ పాలిథిన్ షీట్లను కట్టుకుని ఇంకో వారం రోజులు ఉండాలి. పది రోజుల కేబుల్ వర్క్ పనికి ఇంత అని ఇస్తాడు. తీసుకొని ఊరికి వెళ్లిపోవడమే. పనుంటే మళ్లీ రావాలి.
ఇంతకు ముందు ఈ పని తెలియదు. పొలం పనులకు వెళ్లేది. మొగుడు కూడా వెళ్లేవాడు. కాని రానురాను పనులు తగ్గాయి.
జగానంతా రొయ్యలూ సేపలే తింటున్నట్టున్నారు... నేల కానరాకుండా తవ్వి నీళ్లు నింపి మురికి సేత్తున్నారు... రొయ్యలే కావాలంటే గోదారి లేదా... అంతలావు సవుద్రం లేదా అన్నాడు మొగుడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా వచ్చే కూలి పోయింది. ఉనికీ పోయింది. అదీ కోపం. ఎవరో ఈ పని చెప్పారు. సిటీలో పని. అక్కడితో పోలిస్తే మూడింతలు కూలి. మూడేళ్లుగా ఇందులో దిగారు. కుటుంబాలతో సహా ఎక్కడకు రమ్మంటే అక్కడకు దిగిపోవడం. చూపించిన చోట ఉండిపోవడం. గుంతలు తవ్వి కేబుల్ పరిచి వెళ్లిపోవడం.
పోయినసారి కంటే ఈసారి ఈ స్థలం నయంగానే ఉందనిపించింది.
పోయినసారి ఉప్పల్ దగ్గర ఏదో పాడుబడ్డ స్థలం చూపించారు. సరే ఏదో ఒకటి అది దిగితే రెండు రోజులు బాగానే ఉంది. మూడోరోజు తెల్లారి పక్క పాలిథిన్ గుడిసె నుంచి ఒకటే ఏడుపు. మూడేళ్ల పిల్లవాణ్ణి పాము కరిచి పోయింది. రాత్రి ఎప్పుడు దూరిందో. తల్లి ఏడుస్తుంటే తండ్రి కూడా గుండెలు బాదుకున్నాడు. ఇంకో గంటకి తండ్రి కూడా పోయాడు. ఇద్దరిని కరిచిపోయింది ఆ మాయదారి పాము.
అందుకే ఈసారి జాగ్రత్తగా చూసి మరీ మొగుడి చేత పాలిథిన్ షీట్లు గట్టిగా కట్టించింది. వెతికి వెతికి ఇటుకరాళ్లు తెచ్చి అంచులు లేవకుండా బరువుతో బంధించింది. వస్తూ వస్తూ సుబ్రహ్మణ్య స్వామి పటం తెచ్చుకోవడం కూడా మర్చిపోలేదు. కాని ఈసారి చలి పాములా బుస కొడుతుందని మాత్రం ఊహించలేదు.
ఈ టైమ్‌లో ఆ పక్కంతా సలంట కదయ్యా అంది బయల్దేరే ముందు.
ఎహె... ఏం సలి. పోదాం పదా. నాలుగు డబ్బులొస్తే పండక్కి పనికొస్తాయి అన్నాడు.
ఆ మాట నిజమే. సంక్రాంతి ఇంకో రెండు మూడు వారాల్లో ఉంది. డబ్బులొస్తే పండక్కి నిజంగానే అక్కర కొస్తాయి. బయల్దేరింది. తీరా ఇక్కడికొచ్చాక ఈ చలి దాక్షారామం, రామచంద్రాపురం చలిలా లేదు. అసలు ఇలాంటి చలి ఎరగదు. ఇలాంటి చలికి ఏం కప్పుకోవాలో తెలియదు. ఒకవేళ తెలిసినా అలాంటి ఒక్క గుడ్డముక్క కూడా లేదు.
నేల మీద రెండు చాపలు పరిచింది. ఒకదాని మీద మొగుడు స్వాధీనం లేకుండా పడి నిద్ర పోతున్నాడు. ఎనిమిది నుంచి నాలుగు దాకా పని చేసి వచ్చాక పెందలాణ్ణే కొంచెం తిని తినేముందు ఒళ్లు నొప్పులకు కాసింత తాగి పడుకుంటాడు. ఇక పిడుగులు పడినా లేవడు. ఒంటి మీద ఉండేది పెద్ద చెడ్డీ చొక్కానే. కాని సలి అనే మాటే అనడు. అంత మొద్దయిపోయాడు. కాని పిల్లవాడు?
మళ్లీ ఒణికాడు.
సలిగా ఉందా బంగారూ కప్పిన పాత చీరనే మళ్లీ కప్పుతూ ఇంకా దగ్గరకు జరిగింది.
మూమూలుగా అయితే ఐద్రాబాదు వస్తున్నారంటే పిల్లలందరికీ హుషారు. పోయిన వేసవిలో వచ్చినప్పుడు బాగా ఆడుకున్నారు. ఉదయాన్నే మగవాళ్లంతా పనికి పోతారు. ఆడవాళ్లు వంటలో పడతారు. అదిలించేవాళ్లు ఒక్కరూ ఉండరు. ఇక చెట్ల కింద మట్టిలో పుల్లలేరుకుంటూ గోలీలాడుకుంటూ వాళ్లిష్టం. అలా అనుకునే ఈసారి వచ్చారు. రెండు రోజులు గడిచే సరికి మెత్తగా అయిపోయారు. ప్రతి పిల్లదీ పిల్లవాడు తెల్లారాక గుడిసె నుంచి బయటికొచ్చి ఎండలో మజ్జుగా కూచోవడమే. రాత్రంతా చలి వాళ్ల గొంతు పిసికిందని వాళ్లకేం తెలుసు?
ఒణకడం ఆపలేదు.
తెల్లారి మోపెడ్ డాక్టర్‌ని పంపించేసి తప్పు చేశానా అనిపించింది. అమా... ఒళ్లెచ్చగా ఉందిమా అని అంటుండగానే మోపెడ్ డాక్టర్ వచ్చాడు. ఇలా కూలి పనుల కోసం వచ్చి దిగేవాళ్ల గుడిసెల చుట్టూ తిరుగుతూ వాళ్లకు మందూ మాకూ ఇస్తుంటాడట. ఆర్‌ఎంపి అయి ఉండాలి. చూపిస్తే ఇది చలిజ్వరము ఇంజెక్షన్ చేయాలి నూటేబై అవుతుంది అన్నాడు. యాబై ఇస్తాను ఏం చేస్తావో చేయి అంది. ఎగాదిగా చూసి వెళ్లి పోయాడు.
కాస్త వేడివేడి అన్నం రెండు ముద్దలు తినిపించింది. ఎండలో కూచోబెట్టింది. బజారుకు నడుచుకుంటూ వెళ్లి మాత్ర తెచ్చి మింగించింది. తగ్గుతుందిలే అనుకుంది. తగ్గలేదు.
నిన్న ఒంటి నిండుగా స్వెటర్ వేసుకొని మంకీ క్యాప్ పెట్టుకుని చేతిలో పొన్నుకర్రతో ఆ దారిన వాకింగ్‌కు వెళుతున్న ఒక పెద్దాయన ఆ తెల్లారి పూట అంత చలిలో ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా గుడిసెల బయట మందకొడిగా తిరుగుతున్న పిల్లలను చూసి ఇంతకు మించి చోద్యముందా అన్నట్టుగా ఆగిపోయాడు.
రాత్రి ఎంత చలి కొట్టిందో తెలుసు.
ఇంత చలిలో ఈ పిల్లల్నేసుకొని ఎలా ఉన్నారమ్మా?
ఏం చేస్తాం సామీ. రాత.
ఆయన వాకింగ్ మానేసి వెనక్కు వెళ్లిపోయి గంట తర్వాత తెచ్చాడు.
ఇంట్లోవి తెచ్చాడో వాళ్లనూ వీళ్లనూ అడిగి తెచ్చాడో పిల్లల బట్టలు కొన్ని ఒకటి రెండు దుప్పట్లు ఇంకేవో మగవాళ్ల బట్టలు తెచ్చాడు. కాని పిల్లలకు మాత్రం చేతిలో ఉన్న మూడు నాలుగు స్వెటర్లే కనిపించాయి.
పరిగెత్తుకుంటూ వెళ్లి చొక్కాలు చడ్డీలు ఇస్తుంటే కాదని స్వెటర్ల కోసం వెంట బడ్డారు.
గబగబా పంపించింది.
పో సిన్నీ... నువ్వు కూడా తెచ్చుకోపో.
అందరూ మూగారు.
అయ్యా... సలికోటు.... నాక్కావాలి సలికోటు.... నాకు... నాకు.... అయ్యా... ఒక్క సలికోటు...
ఉన్నవి అయిపోయాయి. ఒక కనకాంబరం రంగు చొక్కా మాత్రం దక్కింది. కొంచెం లూజుగా ఉన్నా అందులో అందంగా ఉన్నాడు. ముద్దు పెట్టుకుంది. జవాబు చెప్పడని తెలిసినా మళ్లీ అడిగింది... సలిగా ఉందా సిన్నీ...
బయట చీకటి చలిలా ఉంది. చలి చీకటిలా ఉంది. బాగా పెరిగిందో ఏమో తిరిగే లారీలు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయినట్టున్నాయి. ఎప్పుడోగాని రొద వినిపించడం లేదు.
అమా... అన్నాడు.
సెప్పు సిన్నీ.....
అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. ఒణుకుతున్నాడు. మొగుడివైపు చూసింది. ఇద్దో... నిన్నే.... కదిలితే కదా. గురక పెడుతున్నాడు. ఒణుకు పెరిగింది. లేచి ట్రంకుపెట్టెలో ఉన్న ఒకటి అరా గుడ్డల్ని కూడా వాడికి చుట్టింది. ఎన్ని చుడితే మాత్రం ఏం లాభం. పైన ఉన్నది ఒక పలుచటి పాలిథిన్ షీట్. కాని ఆకాశం కింద పడుకున్నట్టే. ఊ.. ఊ... మూలుగుతూ ఉన్నాడు.
సిన్నీ... సిన్నీ....
నేల జిల్లుమంటోంది. చాప జిల్లుమంటోంది. చుట్టబెట్టిన గుడ్డముక్కలు జిల్లుమంటున్నాయి.
సిన్నీ... బంగారూ....
ఏం చేయాలో తోచక వెచ్చగా ఉన్న బుగ్గల మీద వెర్రిగా ముద్దుల మీద ముద్దులు కురిపించింది.
బయట ఆకాశం మీద అతి శీతలంగా ఉన్న గండభేరుండం ఒకటి ఎగురుతూ ఉంది. అది ఇవాళ తన బిడ్డను ముక్కున కరుచుకుపోనుంది. కుదరదు. తన కంఠంలో ప్రాణం ఉండగా కుదరదు. ఏం మిగిలి ఉందో తెలుసు. దానిని విప్పేసింది. పిల్లాడి ఒంటి నిండా చుట్టేసింది. తిను... నన్ను తినవే... నగ్నంగా ఉన్న ఒంటిని చూసుకుంటూ చలిని దెప్పి పొడిచింది.
ఇప్పుడు తన బిడ్డకు తనే సలికోటు.
మోకాళ్ల మీద ఒంగి అటోకాలు ఇటో కాలు వేసి మొత్తంగా మీదకు వాలుతూ ఒక గొడుగులాగా దుప్పటిలాగా కప్పులాగా వెచ్చటి రగ్గులాగా మీదకు వాలిపోయింది.
తెల్లారింది.
మరో గంటలో చాలా న్యూస్‌చానళ్లకు మంచి మేత దొరికింది. జనం తండోపతండాలుగా వచ్చారు. లీడర్లు వచ్చారు. ఎన్.జి.ఓలు వచ్చారు. నిజంగా మామూలు మనుషులు కూడా ఇళ్లల్లో ఉన్న స్వెటర్లు రగ్గులు తెచ్చి ఆ గుడిసెలన్నీ నింపేశారు.
పిల్లవాడికి వైద్యం అందింది.
ఎవరో పూలపూల సలికోటు కూడా అందించారు.
కాని- ప్రాణమున్న సలికోటును మాత్రం ఎవ్వరూ తెచ్చివ్వలేకపోయారు.
- మహమ్మద్ ఖదీర్‌బాబు