లిప్‌స్టిక్... | Metro stories | Sakshi
Sakshi News home page

లిప్‌స్టిక్...

Published Sun, Oct 4 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

లిప్‌స్టిక్...

లిప్‌స్టిక్...

మెట్రో  కథలు
 
షూటింగ్ నుంచి వస్తున్నారా? డోర్ తీస్తుంటే అడిగింది. అబ్బే... లేదండీ... మేకప్ ఉన్నట్టు అనిపిస్తేనూ...  నవ్వుతూ డోర్ తీసుకుని లోపలికి వచ్చింది. లోపల రెండు ఫొటోలు అలౌ చేస్తామన్నారు. కొడుకుదీ మనవరాలిదీ వేలాడదీద్దామనుకుంది. కాని మనసొప్పలేదు. ఇద్దరు నటుల ఫొటోలు అమర్చుకుంది. సినిమా వాళ్లు కాదు. నాటకాల వాళ్లు. తనకు అన్నం పెట్టిన గురువులు.  ఏ.సి. ఆన్ చేసింది. మళ్లీ మనసు మార్చుకుని ఆఫ్ చేసి కర్టెన్లు తీసి విండో డోర్‌ను స్లైడ్ చేసింది. ఇంకా పూర్తిగా చీకటి పడలేదు. వేడి తగ్గలేదు. కాని గాలి మాత్రం చనువుగా వచ్చి తాకుతూ ఉంది. నుదుటిని... కళ్లను... పెదాలను... పెదాల మీద ఉన్న లిప్‌స్టిక్‌నూ. టొమాటో కలర్‌ది. ముందు నుంచి అదే అలవాటు.

మూడు నెలలైంది ఏదైనా షూటింగ్ చేసి. ఇంకో నెల దాకా కూడా ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇద్దరు ముగ్గురు డెరైక్టర్లకు కాల్ చేసింది. అయ్యో.. అమ్మా... మీరు చేయాలా... మీకు యాప్ట్ అయ్యే కేరెక్టర్ ఉంటే మిమ్మల్ని దాటి పోనిస్తామా... అందరూ అదే చెప్పారు. నిజంగానే చెప్పారు. అందరికీ తనంటే ఇష్టమే. టేకులు తినదు. న్యూసెన్స్ చేయదు. ముఖ్యంగా ప్రామ్టింగ్ అవసరం లేకుండా ఒత్తులూ పొల్లులూ ఎగరకొట్టకుండా డైలాగ్ చెప్పగలిగే అచ్చ తెలుగు ఆర్టిస్టు. నిజమే కానీ షూటింగ్ లేకుండా ఉంటే విసుగ్గా ఉంటుంది. మేకప్ వేసుకోకపోయినా విసుగ్గా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా లిప్‌స్టిక్ పూసుకోకపోతే చాలా విసుగ్గా ఉంటుంది. అందుకే కొద్దిపాటి మేకప్‌తో ఉండటం అలవాటు. పడుకోబోయే ముందు తప్ప కొంచెం లైట్‌గా అయినా లిప్‌స్టిక్ వేసుకొని ఉండటం అలవాటు.
 మీ అమ్మకు ఇదేం అలవాటండీ అందట కోడలు ఒకరోజు.

చెప్పలేక చెప్పలేక చెప్పాడు. నవ్వి ఊరుకుంది. కొడుకు పెళ్లి అయ్యేవరకు చాలా చిన్న ఫ్లాట్‌లో ఉండేది. పేరుకు టూ బెడ్‌రూమ్ కాని ఎయిట్ హండ్రెడ్ ఎస్‌ఎఫ్‌టి కూడా ఉండదు. పెళ్లికి ముందే కొంచెం అవస్థలు పడి పెద్ద ఫ్లాట్ కొంది. మరేం చేయడం? వయసులో ఉన్నప్పుడు పేమెంట్స్ లేవు. పేమెంట్స్ పెరిగినప్పుడు వయసు లేదు. ఇప్పుడైనా గుడ్‌విల్ పని చేయబట్టి ఒకరిద్దరు నిర్మాతలు కాస్త చేయి వేయబట్టి సాధ్యమైంది. మీ అమ్మకు ఆ నిర్మాతలు అంత క్లోజా ఏమిటండీ అందట కోడలు. ఆ మాట మాత్రం చెప్పలేదు. షూటింగ్ ఉంటే ఉదయాన్నే వెహికల్ వస్తుంది. మళ్లీ రాత్రి దింపేసి పోతుంది. మేకప్ బాయ్ వస్తాడు. అటెండెంట్‌గా ఇంకో కుర్రాణ్ణి పెట్టుకుంది. నిజంగా వీళ్లను మోయలేదు. కాని ఇంత హంగామా చేస్తే తప్ప పాత్ర పుట్టదు. వీళ్లుగాక సీనియర్ ఆర్టిస్టనీ నాటకాల బ్యాక్‌గ్రౌండ్ ఉందనీ కొత్త డెరైక్టర్లు వచ్చి పోతుంటారు. కథలు చెప్తుంటారు. కాస్టింగ్ ఏజెంట్లు వస్తుంటారు. కమిషన్లు చెబుతుంటారు. సాటి ఆర్టిస్టులు- ఆడ సరేగాని మగ కూడా వచ్చి కాసేపు కూర్చుని పోతుంటారు.

ఇల్లు అన్నపూర్ణా స్టుడియోలాగుందండీ అందట ఒకరోజు. ఆ మాట అయినా ఎలా చెబుతాడు?  ఎలా ఉన్నారు అత్తయ్యా... ఏం చేయమంటారు అత్తయ్యా...  కోడలు  అడిగిన పాపాన పోలేదు. తనూ బలవంతపెట్టలేదు. ఏం బలవంత పెడుతుంది? వేలు ఖర్చు పెట్టినా అంతంత మాత్రమే చదివాడు. అంతంత మాత్రపు ఉద్యోగమే తెచ్చుకున్నాడు. సంబంధం వెతకడం ఒక కష్టం. మనుషులు వచ్చిపోయే ఇంటికి కోడల్ని తీసుకురావడం ఇంకా కష్టం. కాకుంటే ఒకటి. మూడో నెలకంతా నెల తప్పాను అత్తయ్యా అంది. ఆ మాట చాలు ఎన్ని తప్పులు చేసినా క్షమించేయడానికి. మనవరాలు పుడితే ఆర్భాటంగా బారసాల చేసిందిగాని వచ్చినవాళ్లంతా అచ్చు నానమ్మ నోట్లో నుంచి ఊడిపడింది అంటుంటే కాస్త భయపడింది. అవును. అచ్చు తనలాగే ఉంది. పెద్ద పెద్ద కళ్లు. మంచి కనుబొమలు. రంగు. ముఖ్యంగా పెదాలు.... అవన్నీ ఉంటే ఏమవుతుందో తెలుసు.  దూరంగా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న కొడుకు వైపు చూసింది. చూస్తూ గమనించింది.ఎవరి పోలిక ఉంది వాడిలో?

పెళ్లైన మూడేళ్లకు పారిపోయిన భర్త. చచ్చిందా బతికిందా పుట్టిన పిల్లాడు ఉన్నాడా పోయాడా పట్టించుకోని భర్త. అతని పోలిక ఉందా వాడిలో. పద్నాలుగేళ్ల పిల్ల... చదువుకుంటా నాన్నా నాకిష్టం లేదు నాన్నా అంటున్నా స్టేజ్ ఎక్కించిన తండ్రి... రంగు పూయించిన తండ్రి... సారా కోసం లిప్‌స్టిక్ వేయించిన తండ్రి.... ఎవడికో ఒకడికి కట్టబెట్టేస్తే తన పని అయిపోతుందనుకున్న తండ్రి... ఆ తాత పోలిక ఉందా వాడిలో? భయమేసింది.ఎందుకు భయం? తను ఉంది. ఆ పోలికలు అంటకుండా తనే చక్కగా పెంచుకుంటుంది. బాగా చదివించుకుంటుంది. అవసరమైతే ఇంకా ఎక్కువ నటించి ఇంకా ఎక్కువ పాత్రలు చేసి ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకుండా స్థిరపరుస్తుంది.  అలా అనుకునే బతికింది. మనవరాలే లోకం. మనవరాలికి నానమ్మ లోకం.
 
ఇదేమిటండీ... కన్నవాళ్లు అంత కాకుండా పోతున్నారేమిటి దానికి అందట ఒకరోజు. నవ్వుతూ నవ్వుతూనే చెప్పాడు.
 మొన్నా మధ్య గుడికో మరెక్కడికో వెళ్లి వచ్చింది. వస్తూ వస్తూ ఎనిమిదో పుట్టినరోజు రాబోతున్నది కదా అని మనవరాలికి కొత్త డ్రస్సు కొనుక్కుని వచ్చింది. అది తొడిగించి చూసి మెటికలు విరిచి సంబరపడాలనుకుంటూ వచ్చింది. వచ్చే సరికి ఇల్లు ఇల్లులా లేదు. అంత చిందర వందరగా ఉంది. రాద్ధాంతం జరిగినట్టుగా ఉంది. కొడుకూ కోడలూ... ఏడుస్తూ మనవరాలు... నానమ్మా... పరిగెత్తుకుంటూ వచ్చి చుట్టేసుకుంది. ఏమైంది తల్లీ... ఏమైంది... మేకప్ కిట్ తెరిచి లిప్‌స్టిక్ వేసుకోవడానికి చూసిందట. అది గమనించి వాళ్లమ్మ చావ గొట్టిందట. అడ్డుకోబోయిన భర్తను నానామాటలు అందట.

ఇంట్లో ఆల్రెడీ ఒక టక్కులాడి ఉంది. ఇంకో టక్కులాడిని తయారు చేయబోతారా? అందట. ఈ మాటలు కాదు. నిజంగా ఏమందో. మార్చి మర్యాదగా చెప్పాడు. ఇవన్నీ ఇక మానెయ్యమ్మా. ఇంట్లో ఉండు. తిరక్కు. ఆ మేకప్ కిట్ తీసి బయట పారెయ్... చూసింది.
 భర్త పారిపోయినప్పుడు సంవత్సరం పిల్లవాడు. రాత్రి నాటకాలు. మేకప్ వేసుకొని లిప్‌స్టిక్ పూసుకుని సరిగ్గా స్టేజ్ మీదకు వెళ్లేసమయానికి ఏడుపు మొదలుపెడితే ఓపలేక బుగ్గలంతా ముద్దులు పెడితే ఎర్రటి మరకలంతా పడేవి. సినిమా నాటికలు వేసేప్పుడు బ్లౌజ్ లేకుండా పవిట గట్టిగా కట్టి పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో... డాన్స్ చేస్తుంటే జనం ఆ గుండెల్ని చూడ్డానికి ఏడ్చేవాళ్లు. తను వాటిల్లో ఉన్న పాలు ఇవ్వడానికి ఏడ్చేది. ఇన్నాళ్లు పెంచడానికి చదివించడానికి ఫ్లాట్ కొని ఉంచటానికి అవసరాలను ఆదుకోవడానికి పనికొచ్చిన లిప్‌స్టిక్ ఇప్పుడు అక్కర్లేదంటున్నాడు.

నవ్వింది. వస్తున్నారా?.... వెనక్కు తిరిగి చూసింది. ఇందాక పలకరించిన పక్క రూమ్‌మేట్. డోర్ దగ్గర నిలుచుని ఉంది.  డిన్నర్‌కు టైమ్ అయ్యిందిగా... పిలుస్తూ ఉంది. అప్పటికే చీకటి పడిపోయింది. టైమ్ ఏడై ఉంటుంది. ఇక్కడ ఏడుకే డిన్నర్ ముగించేయాలి. ఆ తర్వాత ఏదైనా కాలక్షేపం.  చేతులు కడుక్కుని, ముఖం వాష్ చేసుకుని, కొంచెం పౌడర్, లైట్‌గా లిప్‌స్టిక్ టచ్ ఇచ్చి బయలు దేరింది. నాలుగైదు ఎకరాల ఆవరణ అది. ఊరికి కాస్త దూరంగా ప్రశాంతంగా. మీ గురించి విన్నాను...  నవ్వింది.  ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడు?
 తెలీదు. ఫ్లాట్ అమ్మేశాను. నీ దారి నువ్వు చూస్కో అని చెప్పాను. వచ్చింది బ్యాంక్‌లో డిపాజిట్ చేసి మిగిలింది ఈ హోమ్‌కు కట్టి ఇక్కడకు వచ్చేశాను.  మనవరాలు గుర్తుకు రావడం లేదా? వస్తుంది. ఏం చేస్తాం. తప్పదు కదా. పాత్ర ముగిసిందని తెలిశాక స్టేజ్ మీద ఎంత బ్యాడ్ ఆర్టిస్టూ నిలవదు. దిగిపోతుంది...
 
ఒక్కోరూమ్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తూ కనిపిస్తున్నారు. తన వయసు వాళ్లు. తనలాంటివాళ్లు. అన్నట్టు సినిమాల్లో యాక్ట్ చేస్తారా? అమ్మబాబోయ్. నాకు రాదండీ... మీరంటే ఆర్టిస్టు... ఏం లేదండీ. కొంచెం లిప్‌స్టిక్ వేసుకుని నిలబడండి. చాలు. అంతేనా? అంతే... ఇద్దరూ హాయిగా నవ్వుకుంటూ మంచి డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్లోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement