కళకు మేకప్
చేయి తిరిగిన చిత్రకారులకు.. సప్తవర్ణాల పాలెట్ ఉండాలి. ఆ రంగులను కాన్వాస్‌పై రంగరించడానికి వేళ్ల మధ్య ఒదిగిపోయే కుంచె కావాలి. మనసెరిగిన కళాకారులకు ఇవేవీ ఉండాల్సిన అవసరం లేదు. లిప్‌స్టిక్‌నే కుంచెగా మార్చేయగలరు. మేకప్ కిట్‌తో వేకప్ సీనరీ సృష్టించగలరు. ఫ్రెంచ్ చిత్రకారిణి 62 ఏళ్ల డామినిక్ పాలిన్ ఈ కోవకు చెందినవారే. డాక్టర్‌గా సేవలందిస్తూనే.. తన పేషంట్స్ ముఖాల్లోని బాధను చిత్రాల్లో చూపించారు. మూడు వారాల కిందట ఇండియాకు వచ్చిన డామినిక్ ఇక్కడ తాను చూసిన, తనకు నచ్చిన, అర్థం చేసుకున్న విషయాలను పెయింటింగ్స్‌గా మలిచారు. ఇటీవల నగరంలోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో వీటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
..:: ఓ మధు
కళాకారుల ఇంట్లో పుట్టాను. అమ్మానాన్న, తాత, అంకుల్స్ అందరూ కళాకారులే. అమ్మ వేసిన పెయింటింగ్స్ చూస్తూ పెరగటం వల్లనేమో.. మూడేళ్ల వయసు నుంచే పెయింటింగ్ నా జీవితంలో భాగమైంది. డాక్టర్ అయిన తర్వాత కూడా కుంచె విడిచిపెట్టలేదు. నా ఆసక్తి, అభిరుచి కోసమే బొమ్మలు వేస్తూ వచ్చాను. 2007 వరకూ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాను. తర్వాత సే్నిహ తుల ప్రోత్సాహంతో మొదటిసారి పారిస్‌లో నేను గీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశాను. అప్పట్నుంచి వివిధ దేశాల్లో చిత్ర ప్రదర్శనలిస్తున్నాను.
ఎలా ఉంటుందని..
ఇండియాకు రావడం ఇది తొమ్మిదో సారి. మూడు వారాలైంది ఇక్కడ అడుగుపెట్టి. ఎన్నో ప్రాంతాలు చూశాను. రోజుకు 14 నుంచి 16 గంటల పాటు పని చేసి.. పెయింటింగ్స్ వేశాను. వాటినే ఇక్కడ ప్రదర్శనకు ఉంచాను. ఇవన్నీ మేకప్ కోసం వాడే రంగులతో వేసినవే. ఎందుకలా వేశారని చాలామంది అడుగుతున్నారు. నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఒక పెద్ద మేకప్ బాక్స్ తెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చింది. వాటి టెక్స్‌చర్, కలర్స్‌తో డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. లిప్‌స్టిక్స్, పౌడర్స్, ఐషాడోస్.. ఇలా మేకప్ కిట్‌లో ఉన్న రంగులతోనే ఈ పెయింటింగ్స్ వేశాను. వాటినే కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించాను. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. ఇక్కడి గోల్కొండ కోట చూస్తే తెగ ముచ్చటేసింది.
మంచి మనుషులు..
ముంబై, రుషికేశ్, గోవా, తమిళనాడు ఇలా ఈ మూడు వారాల్లో చాలా ప్రాంతాలు బుల్లెట్ మీద తిరిగాను. ఇక్కడ ప్రదేశాలే కాదు, మనుషులు.. వారి మనసులు కూడా నాకు ఎంతగానో నచ్చాయి. భారత్‌లోని స్వేచ్ఛావాతావరణం నాకు బాగా ఇష్టం. మా దేశంలో పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇంత స్వేచ్ఛగా ఉండలేం. అక్కడికి, ఇక్కడికి ఉన్న ముఖ్య తేడా కమ్యూనికేషన్. ఇక్కడ ఏదైనా అడిగితే ఎవరైనా ఎంతో బాధ్యతగా జవాబు చెబుతారు. ఎంతో సహాయం చేస్తారు. అదే ఫ్రాన్స్‌లో ఏదైనా అడ్రస్ అడిగితే వారిచ్చే బదులు చాలా విసురుగా ఉంటుంది. ఫ్రాన్స్‌లో కళాకారులకు, కళాభిమానులకు కొదవలేదు. ఇక్కడి కళాకారులను ఇంకా కలుసుకోలేదు. ఫ్రాన్స్, ఇండియా మధ్య సాంస్కృతిక సంబంధాలు పటిష్టం చేయాలనుకుంటున్నాను.
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి