మిలియన్ డాలర్ టీనేజర్స్
పూర్వీకుల ఆస్తులు కలిసిరాలేదు. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేదు... ఇవేమీ లేకపోయినా టీనేజ్‌లోనే కోటీశ్వరులయ్యారు. డ బ్బుతో అనుభవించగల అన్ని సౌఖ్యాలు సొంతం చేసుకున్నారు. భారీ స్థాయిలో ఆస్తులు కూడబెడుతున్నారు. కొందరిలో అసూయను, మరికొందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. వీళ్లు డబ్బున్న వాళ్ల పిల్లలు కాదు... డబ్బున్న పిల్లలు! ప్రతిభనే పెట్టుబడిగా చేసుకుని కోట్ల డాలర్లకు అధిపతులయ్యారు. అలాంటి వారిలో మొదటి స్థానాల్లో ఉన్నవారితో కూడిన ‘రిచెస్ట్ టీనేజర్స్ ఆన్ ది ప్లానెట్’ జాబితా ఇది...
ఎమ్మావాట్సన్: మోడలింగ్ ద్వారా ప్రతి యేటా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఈ ఇంగ్లిష్ నటి. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఫ్యాషన్ పరేడ్‌లలో ఎమ్మా ద్వారా తాము రూపొందించిన డ్రస్సులను ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. దీంతో ఎమ్మా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఏడాదికి 12 మిలియన్ డాలర్ల సొమ్ము జమ అవుతోందని అంచనా. ఇది రూపాయల్లో 72 కోట్లు.
జడెన్‌స్మిత్: ఈ కరాటే కిడ్‌ను చాలా సులువుగా గుర్తించవచ్చు. ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ కుమారుడు అయిన జడెన్ స్మిత్ ‘కరాటే కిడ్’ అనే సినిమాతో బాగా ఫేమస్‌అయ్యాడు. 13 ఏళ్ల వయసులోనే ఆ సినిమాలో నటించాడు ఈ జూనియర్ స్మిత్. అది సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కో సినిమాకు పారితోషి కంగా ఐదు మిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై కోట్లు డిమాండ్ చేస్తున్నాడని భోగట్టా.
సెలీనా గొమెజ్: హాలీవుడ్ సినిమాల ద్వారా భారతీయ యువతకు పరిచయమున్న అమెరికన్ యువతి. 19 ఏళ్ల వయసులోసెలీనా ఒక ఏడాదికి పొందుతున్న పారితోషికాన్ని లెక్కగడితే అది దాదాపు ఆరు మిలియన్ డాలర్లుగా తేలింది. అంటే దాదాపు 36 కోట్ల రూపాయలు.
మిల్లీ సైరస్: 18 ఏళ్ల వయసులో ఒక ఏడాదిలోనే 48 మిలియన్ డాలర్ల డబ్బును సంపాదించి రికార్డు స్థాపించింది. రిచెస్ట్ టీనేజ్ గర్ల్‌గా నిలిచింది ఈ యాక్టర్ కమ్ సింగర్.
జస్టిన్ బీబెర్ : 17 యేళ్ల వయసులో ఒకే ఏడాదికి 50 మిలియన్ డాలర్ల సొమ్మును సంపాదించాడు బీబెర్. దీన్ని రూపాయిల్లోకి మారిస్తే దాదాపు 300 కోట్లు! ఇదంతా ఒక ఏడాది సంపాదనే. బీబెర్ ఈ స్థాయిలో సంపాదన మొదలుపెట్టి మూడేళ్లు గడిచిపోయాయి!
నిక్‌జొనస్: ఇతడూ పాప్ గాయకుడే. బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం కోసం భారీ స్థాయి పారితోషికాన్ని పొందుతున్నాడు. ఈ కుర్రాడి ఏడాది సంపాదన 20 మిలియన్ డాలర్ల పైమాటే! అంటే దాదాపు 120 కోట్ల రూపాయలు.