- రచన: ఎం.వి.రమణారెడ్డి
వాతావరణంలోని ఆటుపోట్లను నిబ్బరించుకునే మార్పులు ఏ జీవి సంతరించుకుందో అది మాత్రమే కాలప్రవాహంలో నిలుస్తుంది, లేనివన్నీ నశిస్తాయి. దాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’- అంటే, ‘సమర్థతతో సాటిలేనిది మాత్రమే ప్రాణాలతో నిలవడం’ అంటారు.
‘అహం బ్రహ్మస్మి’ అంటూ కొత్తగా తయారైన క్రోమొజోమ్ సృష్టికార్యం మొదలెట్టింది. ఒక దశవరకు బాగా బలుస్తుంది, బలిసి బలిసి రెండు సమానభాగాలుగా చీలిపోతుంది. చీలిన ముక్కల్లో దేనికది విడివిడిగా జీవిస్తూ, అవి తమ వంతుగా తిరిగి రెండు రెండుగా చీలిపోతూ, దేనికది రెట్టింపు సంఖ్యను ఉత్పత్తి చేస్తూ, తరతరానికి రెండు రెట్లు, నాలుగు రెట్లు, ఎనిమిది రెట్లుగా ‘జామెట్రిక్’ పద్ధతిలో జనాభాను పెంచుకుపోతాయి.
కణంలో జరిగే ఆ విభజన అస్తవ్యస్తంగా ఉండేదిగాదు; కచ్చితమైన పద్ధతిని అనుసరించేది. జీవలక్షణాలకు పునాది ‘క్రోమొజోమ్’ అయినందున, కణవిభజన దానితోనే మొదలౌతుంది. ఒకటిగావచ్చు, రెండుగావచ్చు, ఇంకా ఎక్కువగావచ్చు - ఒక కణంలో ఎన్ని క్రోమొజోమ్‌లు ఉంటాయో ఆ మొత్తం నిట్టనిలువుకు చీలి, ఒక సగం ఒక ధ్రువానికీ, మరో సగం రెండో ధ్రువానికీ చేరుకుంటాయి. అవి ఇరువైపులకూ చేరిపోగానే, వాటి మధ్య విభజన పొర ఏర్పడుతుంది. అది అట్టపొరలా అడ్డంగా చీలిపోయి రెండు వేరువేరు కణాలుగా ఆ భాగాలను విడదీస్తుంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే, మాతృకణంలోని క్రోమొజోముల సంఖ్యలో మార్పు జరగకుండా, ఒకే మోస్తరుగా కనిపించే రెండు విభిన్నజీవులు ఉనికిలోకి వస్తాయి. తరాలు ఎన్ని మారినా ఈ ప్రాథమిక దశలోని జీవికి తండ్రీ ఉండడూ, తల్లీ ఉండదు. మరణమూ ఉండదు.
చావులేదని మాటవరుసకు అనుకున్నామేగానీ, దాని కష్టాలు దానికీ ఉన్నాయి. అది ప్రాణంతో ఉండేందుకు అవసరమైన తడి ఎల్లకాలం అందుబాటులోవుండే అవకాశం లేదు. తడి తగలని తావున చిక్కుకుపోతే ఎండకూ గాలికీ ఆరిపోయి ప్రాణం పోగొట్టుకుంటుంది. ఏ జీవికైనా ఇది ప్రకృతితో జరిగే నిత్య సంఘర్షణ. అయితే, ఆ సంఘర్షణవల్ల సృజనాత్మకమైన జీవపరిణామానికి అంకురార్పణ కూడా జరిగింది. ఎలాగంటే - కొన్ని జీవులు ఒడ్డుమీద చిక్కుబడి, ఎండ తాకిడికి వాటిలోని జీవరసం ఆరిపోవడం మొదలెట్టిందనుకోండి... అప్పుడు, మొదట వాటి వెలుపలి భాగంలోవుండే రసం చిక్కబడటంతో ఆ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అంతలో ఏదైనా నీడ వాటిమీదికి జరిగితే, ఆ నీడపాటులోని జీవులు పూర్తిగా ఆరిపోకుండా తట్టుకుంటాయి. అదృష్టం కొద్దీ వర్షం కురిసినా, అలల తాకిడి మొదలైనా వాటికి ప్రాణం దక్కుతుంది. ప్రాణం దక్కడంతోపాటు, వాటి జీవరసం వెలుపలి భాగంలో చోటుజేసుకున్న మార్పు అలాగే నిలిచిపోతుంది. క్రమంగా ఆ మార్పు వాటి సంతానానికి సంక్రమిస్తుంది. ఇదివరకటి విపత్తు మరోసారి సంభవిస్తే, వెలుపలి పొరలో జీవరసం సాంద్రంగా మారిన జీవికి ఒడిదుడుకులు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేగాదు, వాటిల్లో కొన్నిటికి సాంద్రత పెరిగిన జీవరసం తడవ తడవకూ మరింత గట్టిపడుతూ, వేలాది తరాల తరువాత రక్షణకవచముండే కొత్త జీవుల రూపకల్పనకు పునాది ఏర్పడుతుంది.
ఈ పరిణామం ప్రతి జీవిలోనూ ఒకేలా జరగదు. వాతావరణంలోని ఆటుపోట్లను నిబ్బరించుకునే మార్పులు ఏ జీవి సంతరించుకుందో అది మాత్రమే కాలప్రవాహంలో నిలుస్తుంది, లేనివన్నీ నశిస్తాయి. దాన్ని ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’- అంటే, ‘సమర్థతతో సాటిలేనిది మాత్రమే ప్రాణాలతో నిలవడం’ అంటారు. మరోవైపు నుండి చూస్తే - సమర్థత కలిగిన వాటిని మాత్రమే తనతోపాటు కొనసాగేందుకు ప్రకృతి ఎంపిక చేసుకుంటూ, లేనివాటిని తుడిచేస్తున్నది గాబట్టి, ఈ విధానాన్ని ‘నేచురల్ సెలెక్షన్’ అని కూడా అంటారు. ఈ పరిణామ సిద్ధాంత పితామహుడు ఛార్లెస్ డార్విన్ అనే బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు. ఎన్నో దృష్టాంతరాలతో తన సిద్ధాంతాన్ని నిరూపించి, జీవశాస్త్ర అభ్యాసానికి ఆయన కొత్తదారి చూపించాడు. దాంతో మానవుని చరిత్రను అధ్యయనం చేసే విధానం విప్లవాత్మకంగా పురోగమించింది.
ఇంతకుముందు మనం చెప్పుకున్న జీవపదార్థాల పరిణామం తేలిగ్గా అవగాహన కలిగించేందుకు ఉద్దేశించిన నమూనా మాత్రమే గానీ శాస్త్రీయ ప్రమాణాలకు సాటిరాగలదిగాదు. పరిణామం ద్వారా సంక్రమించే మార్పులు అప్పటికప్పుడు భూతద్దంతో పసిగట్టేందుకు వీలయ్యేంత స్వల్పవ్యవధి వ్యత్యాసాలుగావు. వేల సంవత్సరాల సమయం తీసుకునేవి. వాటిల్లో భౌతికమైన మార్పులేకాదు, క్లిష్టమైన రసాయనిక పరివర్తనలు కూడా ఉంటాయి. భౌతికమైన మార్పుల్లో గుణాత్మకమైనవీ ఉంటాయి, పరిమాణాత్మకమైనవీ ఉంటాయి, సంఖ్యాపరమైనవీ ఉంటాయి. సంఖ్య విషయానికి వస్తే - ఇంతదాకా మనం ఒకే కణంగావుండే క్రిమిని గురించి మాట్లాడుకుంటూ, అది రెండు విడివిడి జీవులుగా తెగిపోవడం ద్వారా జాతిని విస్తరిస్తుందని అనుకున్నాంగదా, అంతర్గత విభజన పూర్తిగా జరిగిన తరువాత, రెండుగా విడిపోయే దశలో ఏదైనా ఆటంకం ఎదురైతే, కణాలు రెండూ అంటుకునే ఉండిపోయి రెండు కణాల జీవిగా నిలిచిపోతుంది. అలా కొంతకాలానికి బహుకణ జీవులు ఉనికిలోకి వస్తాయి. ఎక్కువైన కణాల వల్ల దాని సైజు పెరిగి, ఇరుగుపొరుగు ప్రాణులకు మింగుడుకానంత పెద్దదిగా ఏర్పడడంతో, ఆ తరహా ప్రమాదాలను అధిగమించి, ప్రకృతిలో కొనసాగే అర్హత పొందుతుంది.
మొగసాల
Published Fri, Jan 16 2015 11:46 PM | Last Updated on Thu, Jul 11 2019 5:37 PM
Advertisement
Advertisement