దీర్ఘాయువుఎంత దూరం? | Nindaina health lifestyle changes .. | Sakshi
Sakshi News home page

దీర్ఘాయువుఎంత దూరం?

Published Wed, Aug 20 2014 11:15 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

దీర్ఘాయువుఎంత దూరం? - Sakshi

దీర్ఘాయువుఎంత దూరం?

 ‘‘ఎలుకల్లో విజయవంతంగా వృద్ధాప్య తగ్గింపు’’
 - జనవరి 28 2014, ‘సెల్’ జర్నల్

 
 ‘‘ముదిమిలోనూ మెరుగైన ఆరోగ్యానికి కీలకం సంతులిత ఆహారం’’
 - జూలై 25, 2014 ‘నేచర్’

 
 ‘‘జీవనశైలి మార్పులతో నిండైన ఆరోగ్యం.. ఆయుష్షు!’’
 - యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సెప్టెంబరు 17, 2013

 
ఏడాది కాలంలో వచ్చిన వేర్వేరు పరిశోధనల ఫలితాలివి. అన్నీ... అవునా? నిజమేనా? అని ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అచ్చంగా ఇలాగే జరుగుతుందా? అందరూ నిండు నూరేళ్లు నిక్షేపంగా బతికేయవచ్చా? అని ప్రశ్నించుకుంటే మాత్రం భిన్నమైన జవాబులు వస్తాయి. అయితే... ఈ పరిశోధనలు చెప్పేది ఒక్కటే. జరామరణాలను జయించాలన్న మనిషి మేధోదాహం ఇప్పుడిప్పుడే తీరేది కాదు అని. కాకపోతే నెమ్మదిగానైనా మనం ఆ దిశగా ముందుకు వెళుతూండటం కూడా విస్పష్టమే...!
 
అరవైల్లో ఇరవై లా ఉండాలని... 70, 80 ఏళ్ల వయస్సులోనూ జబ్బులేవీ లేని జీవితం కావాలని కోరుకోని వాళ్లెవరు చెప్పండి? అందరమూ అనుకుంటాం. కానీ ఆ అవకాశం కొంతమందికే దక్కుతుంది. దీనికి మనలో చాలామంది జన్యువుల అమరిక అని.. ఆహార, వ్యవహారాలని... శారీరక శ్రమ అని రకరకాల కారణాలు చెబుతుంటాం కూడా. కానీ సైన్స్ మాత్రం ఇవన్నీ అర్ధసత్యాలేనని... అన్నింటినీ కలిపిన జీవనశైలితోనే వయసును జయించే వరం అందరికీ లభిస్తుందని వేర్వేరు పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తోంది.
 
ఇంతకీ వయసై పోవడమంటే...?
 
వృద్ధులకు నిర్వచనం స్పష్టంగా చెప్పడం కొంచెం కష్టమే. పుట్టుక తరువాత కాలంతోపాటు శరీరంలో వచ్చే మార్పులని వికీపీడియా చెబుతుంది. ఇది బహుముఖమైందని, భౌతిక, మానసిక, సామాజిక మార్పులూ కలిసి ఉంటుందనీ అంటుంది. జీవశాస్త్రం ప్రకారం చూస్తే మాత్రం వయసు మీరడం రెండు రకాలని, ఒకటి క్రమానుగతమైంది (పుట్టిన రోజులు), రెండోది కణ విభజనకు సంబంధించినది.

దీర్ఘాయువు కావాలనుకునే వారికి కణ విభజన తాలూకూ వ్యవహారం కీలకమవుతుంది. పుట్టుక మొదలుకొని మరణం వరకూ ప్రతి క్షణం శరీరంలోని కణాలు విడిపోతూ ఉంటాయన్నది మనకు తెలిసిన విషయమే. ఈ కణాల్లోని క్రోమోజోమ్‌లలోనే మనిషి జన్యుక్రమం (డీఎన్‌ఏ పోగు) ఉంటుందన్నదీ చదువుకుని ఉంటాం. కాలం గడిచే కొద్దీ ఒక కణం రెండుగా రెండు నాలుగుగా, నాలుగు ఎనిమిదిగా... ఇలా విడిపోయే వేగం తగ్గుతూ వస్తుంది.

ఈ క్రమంలోనే క్రోమోజోమ్‌ల చివర రక్షణ కవచంగా ఉండే టెలిమోర్ అనే తోకలాంటి నిర్మాణం పొడవూ తగ్గిపోతుంది. యువకులుగా ఉన్నప్పుడు టెలిమెరేస్ అనే ఎంజైమ్ పుణ్యమా అని పొడవు తగ్గడం కొంచెం నెమ్మదిగా సాగితే... ఆ తరువాత ఇది క్రమేపీ రెండుగా విడదీయలేనంత స్థాయికి తగ్గిపోతోంది. ఈ దశలో కణం విడిపోవడం ఆగిపోతుంది. ఫలితంగా కేన్సర్ మొదలుకొని అనేక వృద్ధాప్య సంబంధిత రుగ్మతలు, సమస్యలు చుట్టుముడతాయి.
 
ఇతర కారణాల తోడైతే...


మనం ఎంత కాలం జీవించి ఉంటామన్నది టెలిమోర్‌ల పొడవు ఒక్కటే నిర్ణయించదు. ఆక్సిడేటివ్ రస్ట్రెస్, గ్లైటేషన్ (ప్రొటీన్లు, కొవ్వులతో చక్కెరలు ఏర్పరచుకునే రసాయనిక బంధం) వంటి ఇతర కారణాలు వృద్ధాప్య సమస్యలకు కారణాలవుతాయి. గ్లైటేషన్‌నే ఉదాహరణగా తీసుకుందాం. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోనూ ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. శరీరంలో మరీ ముఖ్యంగా రక్తంలో జరిగే గ్లైటేషన్ కారణంగా కొన్ని వ్యర్థ పదార్థాలు ఏర్పడుతుంటాయి. వీటిని అడ్వాన్స్డ్ గ్లైటేషన్ ఎండ్ ప్రొడక్ట్ క్లుప్తంగా ఏజ్‌లని అంటారు. శరీరంలో ఈ ఏజ్‌ల మోతాదు ఎక్కువైన కొద్దీ మధుమేహం, ఆర్థెరోస్క్లిరోసిస్ (రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకుపోవడం) వంటి వ్యాధులు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులతోపాటు కేన్సర్‌కు కూడా కొన్ని రకాల ఏజ్‌లు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ధూమపానం వంటి అలవాట్లతో శరీరంలో ఏజ్‌ల మోతాదు పెరిగిపోతుందని ఇప్పటికే స్పష్టమైంది.
 
పరిశోధనల సారం ఏమిటి?
 
దీర్ఘాయువుకు జన్యువులే కీలకమని చాలాకాలంగా భావించినప్పటికీ ఇటీవలి కాలంలో ఈ దృక్పథంలో స్పష్టమైన మార్పు వచ్చింది. వృద్ధాప్యాన్ని జయించే లక్ష్యంతో యుగాలుగా ఎన్నో ప్రయోగాలు జరిగినప్పటికీ గత 30 ఏళ్లలోనే మనిషి ఎంతో కొంత ప్రగతి సాధించగలిగాడు. జన్యుక్రమాన్ని తెలుసుకుని 13 ఏళ్లు మాత్రమే అవుతూంటే... టెలిమోర్‌ల గురించి తెలిసిందే 2009లో. గత ఏడాది జరిగిన పరిశోధనలను తీసుకుంటే.... ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తొలిసారి ముసలితనాన్ని వెనక్కు మళ్లించవచ్చునని తెలిసింది.

వయసుతోపాటు మన శరీరాల్లో తగ్గిపోయే ఒక పదార్థాన్ని మళ్లీ చేర్చడం ద్వారా ఇది సాధ్యమని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేల్చారు. గత నెలలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ‘నేచర్’లో ప్రచురించిన వ్యాసం ప్రకారం... ముసలితనంలోనూ ఆరోగ్యంగా ఉండేందుకు సంతులిత ఆహారం, వ్యాయామం అత్యంత కీలకం. దీంతోపాటు కణాలపై వయసు చూపే దుష్ర్పభావాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ఇక గత ఏడాది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనను చూద్దాం. దీని ప్రకారం... జీవనశైలిలో మార్పులతో టెలిమోర్‌ల పొడవును పెంచుకోవచ్చు.

ఈ మార్పులు స్థూలంగా నాలుగు. మొదటిది... రోజూ వ్యాయామం చేయడం. ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా లేదా ధ్యానం వంటి ప్రక్రియలను ఎంచుకోవడం రెండోది. ఇక మూడో మార్పు... ఎరుపు రంగు మాంసం ముట్టకుండా, మొక్కలు, చెట్ల నుంచి అందే ఆహారాన్ని తీసుకోవడం. చివరగా... అందరితో కలివిడిగా ఉండటం. ఈ మార్పులన్నీ చేపట్టిన వారి టెలిమోర్ పొడవు ఐదేళ్లలో పదిశాతం వరకూ పెరిగిందని, మామూలుగా ఉన్నవారిలో మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందని ఈ పరిశోధన ద్వారా తెలిసింది.            
 
- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా
 
చింతల్లేని వృద్ధాప్యానికి...

అరవై ఏళ్ల వయస్సును ఇరవైకి మార్చడం ఇప్పటికైతే ఎవరికైనా అసాధ్యమే. కాకపోతే వయసు పెరిగినా యువకుల్లా కనిపించేందుకు... రోగాలు రాకుండా చూసుకునేందుకు... కంటి నిండా నిద్ర, ఒంటికి తగిన వ్యాయామం, మేలు చేసే ఆహారం అనే మూడు సూత్రాలు పాటిస్తే మంచిదన్నది పరిశోధనలు స్పష్టం చేస్తున్న విషయం. ఏది ఎంత మోతాదులో ఉండాలన్నది స్పష్టంగా చెప్పలేముకానీ... అన్నీ ఎంతో కొంత ఉండటం మంచిది. ఆహారం విషయంలో ఇది మరీ ముఖ్యం.
     
ఎముకల దృఢత్వానికి కాల్షియం మంచిదని అందరూ చెబుతూంటారు. ఇది నిజం కూడా. అయితే 30 ఏళ్ల వయసు తరువాత శరీరం కాల్షియంను పీల్చుకునే మోతాదు తగ్గుతుంది. కాబట్టి యువకుడిగా ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ కాల్షియంను నిల్వ చేసుకోవడం మేలన్నది కొందరు శాస్త్రవేత్తల అంచనా. మహిళల్లో రుతుస్రావం నిలిచిపోయిన తరువాత కాల్షియం కోల్పోయే వేగం పెరుగుతుంది కాబట్టి చిన్న వయసులోనే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వారికి ముఖ్యం.
     
శరీర క్రియలకు మేలు చేసేవి, రోగాల నుంచి రక్షణ కల్పించే రసాయనాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చునని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు తృణధాన్యాలను తీసుకుందాం. మనం వాడే తెల్ల బియ్యంతో పోలిస్తే కొర్ర, జొన్న, రాగుల వంటి తృణధాన్యాల్లో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని అప్పుడప్పుడైనా తీసుకోవడం మంచిది. ఇక ప్యాకెట్లలో లభించే, శుద్ధి చేసిన ఆహార పదార్థాలను తగ్గించాలి. రకరకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరల మోతాదును పెంచడం ద్వారా ముసలితనాన్ని దూరం చేయవచ్చు.
     
అరవై ఏళ్లుపైబడ్డ వారు తమ ఆహారంలో ఎక్కువ పౌష్టికత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
     
వ్యాయామం శరీరాన్ని చురుకుగా చేయడంతోపాటు ఆయుష్షును కూడా పెంచుతుందన్నది మనకు తెలిసిన విషయమే. అలాగని మరీ రోజూ విపరీతంగా ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సిన పనిలేదని... నడక, సైక్లింగ్, ఈత వంటివి కొద్దిమోతాదులో చేపట్టినా సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మోతాదు తక్కువగా ఉన్నప్పటికీ తగినన్ని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉండేలా జాగ్రత్త పడటం ద్వారా రోగాల బారిన పడటాన్ని తగ్గించుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement