ఫైళ్ల విభజన పనులపై శాఖాధిపతులకు సీఎస్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, భవనాలు, ఇతర వస్తువుల పంపిణీలపై తుది నిర్ణయం గవర్నర్, కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి స్పష్టం చేశారు. విభజన పనులకు సంబంధించి పలు శాఖల అధికారులు, ఉద్యోగులు రూపొందిస్తున్న సమాచారాన్ని అపెక్స్ కమిటీ , అనంతరం గవర్నర్, కేంద్రం ఎదుట ఉంచుతామన్నారు. రాష్ట్ర విభజనలో కీలకాంశాలైన ఫైళ్ల విభజన, రికార్డులు, డిస్పోజల్స్ విభజన, స్థిర, చరాస్తుల విభజన, రాష్ట్ర, మల్టీ జోనల్ పోస్టుల విభజన, కోర్టు కేసులు, కాంట్రాక్టులు, చట్టాలు, నిబంధనలు, నోటిఫికేషన్లు తదితర అంశాలపై సీఎస్ బుధవారం సచివాలయంలో శాఖాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఫైళ్ల విభజనను ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి విభజించడంతోపాటు వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేయాలని సూచించారు. అయితే విభజన వివరాల సేకరణకు సంబంధించి ఇదే అంతిమం కాదన్నారు. గవర్నర్, కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రతి కార్యాలయంలో ఫైళ్లను స్కానింగ్ చేయడానికి త్వరలోనే స్కానర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. స్కానర్‌లు ప్రై వేట్ ఏజెన్సీలకు చెందినవి అయినందున ఫైళ్లు స్కాన్ చేసే చోట కచ్చితంగా ప్రభుత్వానికి చెందిన ఉద్యోగిని అక్కడ ఉంచాలని ఆదేశించారు. ఆ సమయంలో పెన్‌డ్రై వ్, డిస్క్ ఆప్షన్స్ లేకుండా చూడాలని సూచించారు. అన్ని ఫైళ్లు ఐటీ విభాగంలోని ప్రధాన సర్వర్‌కు వస్తాయని, అనంతరం ఫైళ్లు చూసేందుకు ఆయా శాఖలకు పాస్‌వర్డ్ ఇస్తామని వివరించారు. మొత్తం విభజన ప్రక్రియను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. విభజన పనులకు సంబంధించి అంశాలవారీగా అన్ని శాఖలకు గడువును సీఎస్ నిర్దేశించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి ఫైళ్లే అత్యధికం
సచివాలయంలో అన్ని శాఖల్లో 1.80 లక్షల ఫైళ్లు ఉన్నట్లు గుర్తించారు. గత ఐదేళ్ల నాటి ప్రధానమైన ఫైళ్లు, రికార్డులు, డిస్పోజల్స్‌ను స్కానింగ్ చేసి భద్రపరచాల్సి ఉంది. 1.80 లక్షల ఫైళ్లలో అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధికి చెందినవే 40 వేల ఫైళ్లు ఉన్నాయి. రెవెన్యూకు చెందినవి 20 వేల ఫైళ్లు, మున్సిపల్‌కు చెందినవి 16 వేల ఫైళ్లు ఉన్నాయి.