చేపల చెరువులు తవ్వితే ఊరుకోం
ఉండి : చేపలచెరువులు తవ్వితే ఊరుకోబోమని ఉండి మండలం పాములపర్రు, యండగండి గ్రామాల ప్రజలు అధికారులను హెచ్చరిచారు. సుమారు 300 మంది మహిళలు, రైతులు గురువారం ఉండి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. చెరువులు తవ్వి తమ జీవితాలు నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం మాట్లాడుతూ.. చేపల చెరువులు తవ్వొద్దని డిమాండ్ చేశారు. ఈ సమయంలో అప్రమత్తమైన ఇ¯ŒSచార్జి ఎస్సై ఆకుల రఘు ఇక్కడ ధర్నా చేయడానికి వీల్లేదని, ఖాళీ చేసి వెళ్లాలని హుకుం జారీ చేశారు. దీంతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీపీఎం నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఈ సమయంలో కార్యాలయం నుంచి బయటకు వెళ్లబోతున్న తహసీల్దార్ కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. దీంతో తహసీల్దార్ మాట్లాడుతూ.. ఇలా ఆందోళన చేయడం తగదని, కేసులు పెట్టేందుకూ వెనుకాడనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో వినతిపత్రాన్ని ఇస్తే ఉన్నతాధికారులకు పంపుతానని, పాములపర్రులో చేపల చెరువుల తవ్వకానికి కోర్టు అనుమతులు ఉన్నాయని, వాటిని తాను ఆపలేనని, దీనిపై తర్వాత చర్చిద్దామని చెప్పి వెళ్లిపోయారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జేఎ¯ŒSవీ గోపాలన్, సత్యనారాయణ, సీపీఎం మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్, గ్రామ ఇ¯ŒSచార్జ్ సర్పంచ్ నక్కా కేశవరావు, ఎంపీటీసీ సభ్యులు వర్రే పైడియ్య పాల్గొన్నారు. ఇదిలా ఉంటే బలరాం, గోపాలన్ తదితర 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.