బడినుంచి వచ్చిన దగ్గరనుంచి ముఖం వేలాడేసుకుని ఉన్న గోపాల్‌ను దగ్గరకు తీసుకుని ‘ఏం జరిగింది కన్నా? ఎందుకలా ఉన్నావు’ అని బుజ్జగింపుగా అడిగింది అమ్మ. ‘మరేం లేదమ్మా, ఆదివారం నాడు మా బడిలో పిల్లలందరినీ వనభోజనాలకు తీసుకు వెళ్తున్నారు. అందరినీ తలా రెండు రకాల పదార్థాలను తీసుకురమ్మన్నారు మాస్టారు. అందరూ రకరకాల తినుబండారాలు తీసుకు వస్తామన్నారు. మరి నేను ఏమి తీసుకు వెళ్లాలి? ఎలా తీసుకు వెళ్లాలి...’’ అని వెక్కసాగాడు. ‘‘ఓస్, ఇంతేనా! నువ్వు కూడా రుచికరమైన తినుబండారాలు తీసుకు వెళుదువుగానీ.
నువ్వేమీ దిగులు పడకు కన్నా’’ అని సముదాయించింది అమ్మ. భర్త తీసుకు వచ్చే జీతం రాళ్లకు తోడు ఇంటి ముందున్న స్థలంలో కూరగాయలు, పండ్ల చెట్లు పెంచి వాటితో గుట్టుగా ఇల్లు నడుపుకొస్తూన్న ఆమె ఏం చేయాలా అని ఆలోచిస్తూ పెరటిలోకి వచ్చింది. అరటి, సపోటా, జామ, దానిమ్మ పండ్ల చెట్లు ప్రేమగా తనను పలకరిస్తున్నట్లుగా తలలు ఊగిస్తున్నాయి. తమ కొమ్మల్లో దాచుకున్న పండ్లను తినమన్నట్లు చూస్తున్నాయి. ఏదో ఆలోచన వచ్చినదానిలా ఆ చెట్లను ఆప్యాయంగా నిమురుతూనే పండ్లు కోసింది.వాటిని ముక్కలుగా తరిగింది. ఇంతలోనే ఆమెకు మా ప్రేమను పిండుకోవా అన్నట్లుగా వేపచెట్టు కొమ్మలలోనుంచి తొంగి చూస్తున్న తేనెపట్టు కనిపించింది. తంటాలు పడి ఆ తేనెపట్టు దింపింది. పట్టునుంచి పిండిన తేనెను పండ్ల ముక్కల మీద పోసింది. ముందురోజు నానపెట్టి ఉంచిన పెసరపప్పును వడకట్టి, దానిలో సన్నగా తరిగిన కేరట్, కీరదోస ముక్కలను, కొబ్బరి కోరును కలిపి చారెడు ఉప్పు వేసి, నిమ్మరసం పిండింది. తాటిమట్టలతో తయారు చేసిన రెండు దొన్నెలలో వాటిని నింపి పైన బాదం ఆకులతో కప్పేసి, కొబ్బరి ఈనెలతో వాటి మూతులను కుట్టేసింది.
‘ఇక తీసుకు వెళ్లు’ అన్నట్లుగా గోపాల్ వైపు చూసింది ప్రేమగా. గోపాల్ సంకోచంగానే వాటిని అందుకుని వనభోజనాలకు వెళ్లాడు. అక్కడ ఆటపాటలు, క్విజ్ పోటీల తర్వాత కాళ్లూ చేతులు కడుక్కొని వచ్చి చెట్ల నీడన భోజనాలకు కూర్చున్నారు పిల్లలు. అందరూ తాము తెచ్చిన వాటి మూతలు తెరిచి చూపిస్తుంటే, గోపాల్ మాత్రం బెరుకు బెరుకుగా తను తెచ్చిన దొన్నెలను వెనకాల దాచుకుంటున్నాడు. మాస్టారు అది గమనించారు.గోపాల్ నుంచి ఆ దొన్నెలను అందుకున్నారు. ముందు తాను రుచి చూశారు. చాలా బాగున్నాయి. మీరు కూడా తినండంటూ అందరికీ గోపాల్ తెచ్చిన పదార్థాలను తానే స్వయంగా పంచారు. లొట్టలు వేసుకుంటూ తిన్నారందరూ. తల్లి ప్రేమను రంగరించి మరీ పోషకాలు ఉన్న పదార్థాలు తెచ్చాడని మెచ్చుకుని మంచి బహుమతి ఇచ్చారు. డబ్బు అన్ని పనులూ చేయలేదు.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment