థ్రిల్ ఆఫ్ లైఫ్ | Movie Review Sachin: A billion dreams | Sakshi
Sakshi News home page

థ్రిల్ ఆఫ్ లైఫ్

Published Fri, May 26 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

థ్రిల్ ఆఫ్ లైఫ్

థ్రిల్ ఆఫ్ లైఫ్

మీకు నచ్చింది చేస్తున్నప్పుడు మీరు చేస్తున్నది అందరికీ నచ్చుతుంది! మన పిల్లలకు కూడా మనం ఇదే చెప్పాలేమో. మనకు నచ్చింది వాళ్లతో చేయించడం కంటే... వాళ్ల అభిరుచిని అర్థం చేసుకుని ప్రోత్సహించాలేమో..! ఎవరైనా అనుకున్నారా.. ఒకరోజు మనం పక్షిలా ఎగరగలమని! ఎవరైనా అనుకున్నారా..ఒకరోజు మనం చంద్రుడిపై కాలు పెట్టగలమని! సచిన్‌ లైఫ్‌ లోని థ్రిల్‌ని చూస్తే ఇదే అనిపిస్తోంది.
సచిన్‌ అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నాడు. మన పిల్లలు కనవలసిన బిలియన్‌ డ్రీమ్స్‌కి స్ఫూర్తిని ఇచ్చాడు.


విఖ్యాత సంగీత దర్శకుడు ఎస్‌డీ బర్మన్‌పై అభిమానంతో తల్లిదండ్రులు సచిన్‌ అని పేరు పెట్టారు. ప్రొఫెసర్‌గా పని చేసిన తండ్రి రమేశ్‌ టెండూల్కర్‌ ప్రఖ్యాత మరాఠీ రచయిత కూడా. సచిన్‌కు ఇద్దరు సోదరులు నితిన్, అజిత్, సోదరి సవిత ఉన్నారు. వీరిద్దరు రమేశ్‌ తొలి భార్య సంతానం కాగా, తల్లి రజనికి సచిన్‌ ఒక్కడే. ఈ విషయాన్ని సచిన్‌ తన సొంత ఆటోబయోగ్రఫీలో కూడా ప్రస్తావించలేదు. చిన్నప్పుడు టెన్నిస్‌ స్టార్‌ జాన్‌ మెకన్రోను విపరీతంగా అభిమానించిన సచిన్‌ అతనిలాగే రింగుల జుట్టు పెంచుకొని హెడ్‌ బ్యాండ్‌తో కనిపించేవాడు. కిషోర్‌ కుమార్, లతా మంగేష్కర్‌ పాటలను సచిన్‌ అమితంగా ప్రేమిస్తాడు.

వేసవి సెలవుల్లో ఓ సాయంత్రం దూరదర్శన్‌ గైడ్‌ సినిమా ప్రసారమవుతున్న సమయంలో చెట్టుపైనుంచి పక్కింట్లో చూడబోయే ప్రయత్నంలో సచిన్‌ కింద పడ్డాడు. దాంతో అతని అన్న అజిత్‌ పనిష్మెంట్‌ కింద క్రికెట్‌ కోచింగ్‌ క్లాస్‌లకు తీసుకెళ్లాడు. మొదటిసారి గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌ ముందు వెళ్లినప్పుడు ఆయన ముందు భయంతో సరిగా బ్యాట్‌ కూడా పట్టలేకపోయాడు. అయితే సచిన్‌లో మంచి ప్రతిభ ఉందని, ఎదురుగా నిలబడకుండా మరో అవకాశం ఇవ్వమని అజిత్‌ కోరాడు.

దాంతో సచిన్‌ను ఆడమని చెప్పిన అచ్రేకర్‌ చెట్టు చాటునుంచి పరీక్షించారు. అంతే... ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత తన అకాడమీలోకి తీసుకోవడం, చరిత్ర సృష్టించేందుకు అడుగులు పడటం అక్కడే జరిగిపోయాయి. సచిన్‌ అక్కడ సుదీర్ఘంగా సాధన చేసేవాడు. కుర్రాడిని ఉత్సాహపరిచేందుకు కోచ్‌ స్టంప్స్‌పై ఒక రూపాయి నాణాన్ని ఉంచేవారు. సెషన్‌ మొత్తం అవుట్‌ కాకుండా ఉంటే అది సచిన్‌కు, ఎవరైనా అతడిని అవుట్‌ చేస్తే అది వారికి దక్కుతుంది. ఈ రకంగా ఎన్నో సెషన్‌లలో అసలు అవుట్‌ కాకుండా ఆడిన సచిన్‌ వద్ద ఆ రూపాయి నాణాలు ఎన్నో భద్రపరిచి ఉన్నాయి. అవన్నీ తన అపురూపమైన కానుకలని అతను అంటాడు.


శారదాశ్రమ్‌ విద్యా మందిర్‌ స్కూల్‌ తరఫున సచిన్, వినోద్‌ కాంబ్లీ కలిసి స్కూల్‌ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హారిస్‌ షీల్డ్‌ ట్రోఫీ సెమీ ఫైనల్లో సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌పై వీరిద్దరు ఏకంగా 664 పరుగులు జోడించారు. ఇందులో సచిన్‌ 326 పరుగులు, కాంబ్లీ 349 పరుగులు చేశారు. జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ లక్ష్మణ్‌ చౌహాన్‌ ఇక చాలు డిక్లేర్‌ చేయమని ఎన్ని సందేశాలు పంపించినా... వీరిద్దరు పట్టించుకోకుండా తమ జోరును కొనసాగించారు. ఆ తర్వాత అచ్రేకర్‌ సర్‌ తిట్లు తినాల్సి వచ్చింది.  ఏ స్థాయికి చేరినా తన మూలాలు మరచిపోని సచిన్, నాలుగు నెలల సుదీర్ఘ పర్యటన తర్వాత 1992 వరల్డ్‌ కప్‌నుంచి తిరిగొచ్చాక స్థానిక లీగ్‌లలో కీర్తి కాలేజ్‌ తరఫున ఆడాడు.  

ప్రేమ... సచిన్‌కంటే అతని భార్య అంజలి వయసులో ఐదేళ్లు పెద్ద. చిన్న పిల్లల వైద్యురాలు. టీనేజర్‌గానే సచిన్, అంజలిపై మనసు పారేసుకున్నాడు. తొలిసారి 1990 న్యూజిలాండ్‌ పర్యటనకు వెళుతున్న సమయంలో సచిన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అంజలి కలిసింది.  జర్నలిస్ట్‌గా తనను తాను పరిచయం చేసుకొని నేరుగా అతని ఇంటికే వచ్చి కలిసే ప్రయత్నం కూడా చేసింది. ఆ తర్వాత ఆ ప్రేమ అలాగే పెరిగింది. మూడేళ్ల స్నేహం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో సచిన్‌ వయసు 22 ఏళ్లు మాత్రమే. సాధారణంగా బయట ఏ కెరీర్‌ చూసుకున్నా ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అరుదు. కానీ అంతర్జాతీయ క్రికెటర్‌కు కుటుంబం అవసరం ఎక్కువగా ఉందని భావించిన సచిన్‌ 1995లో అంజలిని వివాహమాడాడు. సచిన్‌ విషయంలో కూడా అప్పట్లో అనేక గాసిప్స్‌ వినిపించాయి. ముఖ్యంగా నాటి బాలీవుడ్‌ నటి శిల్పా శిరోద్కర్‌తో ప్రేమ వ్యవహారం అంటూ టెండూల్కర్, శిరోద్కర్‌ కులాలు కూడా ఒక్కటే... సమస్య లేదు, ఇక పెళ్లే తరువాయి అంటూ కథనాలు ఇచ్చాయి. అయితే సచిన్‌ తాను అనుకున్నట్లుగా పెళ్లి చేసుకొని వాటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టేశాడు. సచిన్‌ పెళ్లి లైవ్‌ కవరేజి కోసం ఒక ఛానల్‌ భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినా అతను తిరస్కరించాడు.

1987 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, జింబాబ్వే మధ్య వాంఖెడేలో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ బాల్‌ బాయ్‌గా పని చేశాడు. తర్వాతి ఏడాది బ్రబోర్న్‌ స్టేడియంలో పాకిస్తాన్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడగా, ఆ టీమ్‌ తరఫున సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం విశేషం. సునీల్‌ గావస్కర్‌ బహుమతిగా ఇచ్చిన ప్యాడ్స్‌ కట్టుకొని అతను తన తొలి టెస్టు (కరాచీ)లో బరిలోకి దిగాడు. ఎడమ కాలికి ముందుగా ప్యాడ్‌ కట్టుకునే సెంటిమెంట్‌ అతడికి ఉంది. ముంబై సహచరుడు ప్రవీణ్‌ ఆమ్రే తొలి సారి సచిన్‌కు అంతర్జాతీయ క్రికెటర్లు ధరించే బ్రాండింగ్‌ షూస్‌ను కానుకగా ఇచ్చాడు. సచిన్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఆమ్రే కొత్త అడిడాస్‌ స్పైక్స్‌ తీసుకొని అక్కడికి వచ్చాడు. అవి సచిన్‌ను బాగా ఆకర్షించడంతో పదే పదే ఆమ్రేను వాటి గురించి అడిగాడు. దాంతో ఆమ్రే నువ్వు సెంచరీ కొడితే చాలు షూస్‌ నీవే అన్నాడు. అంతే...తర్వాతి వారమే స్కూల్‌ క్రికెట్‌లో సచిన్‌ శతకం మోత మోగింది. సచిన్‌ తన కెరీర్‌ చివర్లో అడిడాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం.

కెరీర్‌లో పెద్ద సంఖ్యలో ప్రకటనలకు ప్రచారకర్తగా కోట్లాది రూపాయలు ఆర్జించిన సచిన్‌ తొలి ప్రకటన బ్యాండ్‌ – ఎయిడ్‌. తనతో ఆడుతూ గాయపడిన ఫీల్డర్‌ వేలికి అతను బ్యాండ్‌ ఎయిడ్‌తో చికిత్స చేస్తాడు. 1996 ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన సమయంలో సచిన్‌ బ్యాట్‌కు స్పాన్సర్‌ ఎవరూ లేరు. ఆ తర్వాత అతనితో జత కట్టిన ఎంఆర్‌ఎఫ్‌ సుదీర్ఘ కాలం ఆ అనుబంధాన్ని కొనసాగించింది. ప్రకటనల విషయంలో కూడా సచిన్‌ ఆటను ఏ మాత్రం తక్కువ చేయడానికి ఇష్టపడడు. ఒక సారి పెప్సీ యాడ్‌లో అతను బంతిని ఫ్లై స్వాటర్‌ (దోమలను కొట్టే పరికరం)తో కొట్టే విధంగా రూపొందించారు. అది క్రికెట్‌ విలువను తగ్గించినట్లే అని చెప్పడంతో రూపకర్త ప్రహ్లాద్‌ కక్కడ్‌ చివరకు స్టంప్స్‌తో బంతిని కొట్టే విధంగా మార్చారు.

1999 వరల్డ్‌ కప్‌ జరుగుతున్న సమయంలో సచిన్‌ తండ్రి రమేశ్‌ కన్నుమూశారు. హుటాహుటిన ఇంగ్లండ్‌నుంచి తిరిగొచ్చిన సచిన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్లీ వచ్చి జట్టుతో చేరాడు. కీలకమైన మ్యాచ్‌లో కెన్యాపై సెంచరీ సాధించి భారత్‌ను గెలిపించాడు. అప్పటినుంచి అతను తాను చేసి ప్రతీ సెంచరీకి ఆకాశం వైపు చూసి తండ్రిని గుర్తు చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు.

1988లో సచిన్‌ తొలి సారి రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. అంతకు కొద్ది రోజుల ముందు అతను ఒక మ్యాచ్‌లో అతను మరో ఆటగాడు సాయిరాజ్‌ బహుతులే (భారత్‌ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు) బ్యాట్‌తో బరిలోకి దిగి మంచి స్కోర్‌ సాధించాడు. దాంతో సెంటిమెంట్‌గా మరో ఫ్రెండ్‌కు చెప్పి అదే బ్యాట్‌ తెప్పించమని కోరాడు. అదే బ్యాట్‌తో గుజరాత్‌తో  తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదడంతో చరిత్రకు తొలి అడుగు పడింది. బ్యాట్‌లను కానుకలుగా ఇచ్చే అలవాటు సచిన్‌కు కూడా ఉంది.  1989లో సచిన్‌ ఆడిన తొలి టెస్టు పాక్‌ దిగ్గజ పేస్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌కు కూడా మొదటి టెస్టే. ఈ సిరీస్‌ చివరి టెస్టులో వకార్‌ బౌలింగ్‌లో ముక్కుకు గాయమై రక్తం కారినా కూడా ఇన్నింగ్స్‌ కొనసాగించి సచిన్‌ అర్ధసెంచరీ చేశాడు. ఆ తర్వాత వకార్‌తో మంచి స్నేహం కుదిరింది. ఒక సారి సచిన్‌ తన బ్యాట్‌ను అభిమానంతో వకార్‌కు కానుకగా ఇచ్చాడు. కొన్నాళ్లకు షాహిద్‌ ఆఫ్రిది ఇదే బ్యాట్‌తో 37 బంతుల్లో ప్రపంచరికార్డు సెంచరీ సాధించాడు. అంటే పరోక్షంగా ఆ రికార్డులో సచిన్‌దే పాత్ర ఉంది.

సచిన్‌ ఆరంభంలో తాను ఫాస్ట్‌ బౌలర్‌ను కావాలని కోరుకున్నాడు. మద్రాస్‌లోని ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ అకాడమీ సెలక్షన్స్‌కు కూడా అతను హాజరయ్యాడు. అయితే అక్కడి డైరెక్టర్, దిగ్గజ బౌలర్‌ డెన్నిస్‌ లిల్లీ నువ్వు బౌలింగ్‌కు పనికి రావని తేల్చేశాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెడితే మంచిదని మందలించి వెనక్కి పంపించాడు. ఆ రోజు అలా జరగకబోతే క్రికెట్‌ ప్రపంచం వేల కొద్దీ పరుగులను చూసి ఉండకపోయేదేమో.

సచిన్‌ బ్యాటింగ్‌లో రైట్‌ హ్యాండరే అయినా... తినడం, ఆటోగ్రాఫ్‌ ఇవ్వడం అంతా ఎడమ చేత్తోనే చేస్తాడు.
తన తొలి రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ మ్యాచ్‌లలో సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌ సచిన్‌.
భారతరత్న కూడా అయిన సచిన్‌కు ప్రస్తుతం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో గ్రూప్‌ కెప్టెన్‌ ర్యాంక్‌ ఉంది.

మూవీ రివ్యూ
సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌
సచిన్‌ అంటే క్రికెట్‌ ఒక్కటే కాదు... అతని జీవితంలోనూ అందరిలాగే అమ్మా నాన్నల ఆప్యాయత ఉంది...అండగా నిలిచిన అన్న ఉన్నాడు... అడుగులో అడుగు వేసి నడిచిన అంజలి ఉంది. అందులో అందరికీ తెలిసిందే కొంతే. కొడుకుగా, భర్తగా, నాన్నగా మనం చూడని సచిన్‌ను అతను కొత్తగా వెండి తెరపై  ‘సచిన్‌– ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ పేరుతో తనను తను ఆవిష్కరించుకున్నాడు. ఈ చిత్రం నిన్న శుక్రవారం విడుదలైంది. సచిన్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.


సమ్‌థింగ్‌ స్పెషల్‌
‘సచిన్‌ – ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ అనేది పూర్తి స్థాయి ఫీచర్‌ ఫిల్మ్‌ కాదు. డాక్యుమెంటరీ కమ్‌ మూవీ. ధోని, అజహర్, మిల్కా సింగ్‌ల తరహాలో మరొకరు సచిన్‌ పాత్రను పోషిస్తూ సన్నివేషాలను షూట్‌ చేయలేదు. ఇందులో సచిన్‌ మాత్రమే కనిపిస్తాడు. వినిపిస్తాడు. తన చిన్ననాటి అల్లరి, ఆట పాటల మొదలు దిగ్గజంగా ఎదిగే వరకు వేర్వేరు దశల్లో సచిన్‌ తన గురించి తాను చెప్పుకుంటాడు. మధ్యలో గొప్ప మ్యాచ్‌లు, విజయాలు, పరాజయాలు, వివాదాలు.... ఇలా అన్నీ రియల్స్‌ విజువల్స్‌ చూపిస్తూ మనల్ని మరోసారి పాత రోజుల్లోకి ఈ సినిమా తీసుకెళుతుంది. దాదాపు 10 వేల గంటల వ్యవధి గల సచిన్‌ వీడియోలను తీసుకొని వాటిని సందర్భానుసారం ఈ సినిమాలో వాడుకున్నారు. అలాగే తనకు మాత్రమే పరిమైతమైన కొన్ని అరుదైన ఫ్యామిలీ వీడియోలు కూడా సచిన్‌ మనకు చూపించాడు.
– మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది, సాక్షి క్రీడా ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement