నన్ను సచిన్‌తో పోల్చకండి.. ఇబ్బందిగా ఉంది!
పరుగుల యంత్రంలా మారి నిరంతరం రికార్డులతో హోరెత్తిస్తున్న విరాట్ కోహ్లిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, టీ-20 వరల్డ్ కప్, ఐపీఎల్.. ఇలా తాను ఆడిన ప్రతి సీరిస్‌లోనూ తనదైన ప్రత్యేకత నిలుపుకొంటున్న కోహ్లిని ఇప్పుడు అందరూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. డొనాల్డ్ బ్రాడ్‌మన్ తర్వాత క్రికెట్‌లో ఆ స్థాయిలో గొప్ప ఆటతీరును ప్రదర్శించిన ఆటగాడు సచిన్. 100 అంతర్జాతీయ సెంచరీలు, 200 టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడికి క్రికెట్ చరిత్రలో సచిన్‌కు తిరుగులేని స్థానం. మరి, అంతటి లెజండరీ ఆటగాడితో పోలిక పట్ల కోహ్లి ఎలా ఫీలవుతున్నాడంటే..
'నిజాయితీగా చెప్తున్నా. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇది సరికాదు. సచిన్‌ను ఎవరితో పోల్చలేం. నా విషయంలో ఈ పోలిక ఎంతమాత్రం ప్రామాణికం కాదు. అతన్ని చూస్తేనే నేను ఎదిగాను. కానీ క్రీజ్‌లో నాలా ఆడాలనుకుంటాను. కచ్చితంగా సచిన్ నుంచి స్ఫూర్తి పొందుతాను. ఏ ఆటగాడితో పోల్చినా రెండు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటారు ఆయన. సచిన్‌కు ప్రతిభ స్వతహఃగా జన్మతో వచ్చింది. నేను కష్టపడి దానిని సొంతం చేసుకున్నాను' అని కోహ్లి వివరణ ఇచ్చాడు.