మోదీ గురించి కోహ్లి చెప్పిన ఒక్కమాట!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భారత టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగతంగా ఎప్పుడూ కలుసుకోలేదు. కానీ, సోషల్ మీడియాలో వీరు పలుసార్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నరేంద్రమోదీ దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు ట్విట్టర్ లో కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. మోదీ దేశాన్ని మరింత గొప్పగా నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత ఇటీవలి వరల్డ్ కప్ సందర్భంలో కోహ్లిని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. వరల్డ్ కప్ లో తన అద్భుత పోరాటంతో టీమిండియాను కోహ్లిని గెలిపించినప్పుడు అతనిపై మోదీ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా ఇలా కోహ్లి-మోదీ మధ్య మంచి అనుబంధమే ఉంది. ఈ నేపథ్యంలో సీఎన్ఎన్ చానెల్ లో మల్లికా కపూర్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారని మల్లికా కపూర్ అడుగగా..'సెల్ఫ్ బిలీఫ్' (ఆత్మవిశ్వాసం) అని కోహ్లి బదులిచ్చారు. ప్రధాని మోదీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని కితాబిచ్చారు. అదే సమయంలో తనకున్న క్రికెట్ నైపుణ్యంపైనే విశ్వాసంతోనే తాను మైదానంలో అడుగుపెడతానని కోహ్లి తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో కోహ్లి ఇచ్చిన ఫటాఫట్ జవాబులివి..
క్రికెట్ ను మీరు ఎలా భావిస్తారు?
నా జీవితంలో క్రికెట్ కే అన్నింటికన్నా ఎక్కువ ప్రాధాన్యమిస్తాను
దూకుడుగా ఆడటంపై..
దూకుడుగా ఆడటమే నన్ను గేమ్ లో టాప్ ఆటగాడిగా నిలబెట్టింది. ఏదిఏమైనా ఎట్టిపరిస్థితుల్లో దానిని వీడను.
టెస్ట్ క్రికెట్ ఆడటంపై..
టెస్ట్ క్రికెట్ ఒక ప్రయాణం లాంటింది. ఎన్నింటినో నేర్పిస్తుంది. నిన్ను నువ్వు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది.
మీ వ్యక్తిగత జీవితంపై వస్తున్న కథనాలపై..
మైదానంలో ఎలా ఆడుతారు అన్న దానిపైనే ఆటగాళ్లను పరిగణించాలి. అంతేకానీ వ్యక్తిగతంగా వారు ఏమిటి అన్నదానిపై కాదు
సచిన్ తో అంతర్జాతీయ వేదిక పంచుకోవడంపై..
సచిన్ నా ఆరాధ్యుడు. నా ఆదర్శంగా భావిస్తూ వచ్చిన ఆయనతో కలిసి క్రికెట్ ఆడటం నిజం కాదేమో అనిపిస్తుంది.
మ్యాచ్ ఫిక్సింగ్ పై..
ఎవరైనా తప్పు చేయాలనుకుంటే ఎవరూ ఆపలేరు.ఎంత నియంత్రణ ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఆపడం కష్టం.