మల్టీప్లెక్స్ తిండితో మందబుద్ధి!?
బంగాళదుంప చిప్స్, బర్గర్, కూల్‌డ్రింక్... మల్టీప్లెక్స్ ఫుడ్ ఇది. వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌లో భాగం ఈ ఆహారం. తినేటప్పుడు ఆనందాన్ని ఇచ్చినా వీటివల్ల శరీరంలో చెడు కొవ్వు పేరుకొంటుందనే హెచ్చరికలు పాతవే. అయితే వీటివల్ల మెదడు వికాసం కూడా ఆగిపోతుందని అంటున్నారు అధ్యయనకర్తలు. ప్రత్యేకించి 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను ఇలాంటి ఆహారానికి దూరంగా ఉంచడమే మంచిదని వారు సూచిస్తున్నారు. పాశ్చాత్య ఆహారపు శైలిలో ఈ టేక్ అవే ఫుడ్ చాలా సహజమైనది.
మనదేశంలో కూడా ఈ తరహా ఆహారం పట్ల ఎక్కువ ఆసక్తే ఉంది. నయా నగర జీవితంలో బర్గర్‌ల, బంగాళదుంప చిప్స్ ప్రాధాన్యం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధ్యయనకర్తలకు ఈ ఆహారం మీద ప్రత్యేకమైన కోపం ఏమీ లేదు. వీటిని వండే విధానం, వీటిలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు మెదడు శక్తిని తగ్గించి వేస్తాయన్నదే వారి వాదన. మరి ఇప్పటికైనా ఇలాంటి ఫుడ్‌కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదేమో!